Draupadi Murmu Biography: ద్రౌపది ముర్ము జీవితమంతా విషాదాలే, భర్తతో పాటు ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్నా చెదరని ధైర్యం, టీచర్ నుండి రాష్ట్రపతి దాకా ద్రౌపది ముర్ము జీవిత ప్రస్థానం ఇదే..
భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము (NDA Presidential Candidate Droupadi Murmu) నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో (President Election 2022 Result) బరిలో దిగిన ద్రౌపది ముర్ము విజయ దుందుభి మోగించారు
New Delhi, July 21: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము (NDA Presidential Candidate Droupadi Murmu) నిలిచారు.
ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో (President Election 2022 Result) బరిలో దిగిన ద్రౌపది ముర్ము విజయ దుందుభి మోగించారు. సగానికి పైగా ఓట్లు సాధించిన ముర్ము ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. దేశ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన #ద్రౌపది ముర్ముకి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలతో కూడిన అభినందనలు తెలిపారు. ఇంతకీ ద్రౌపది ముర్ము ఎవరు, ఆమె జీవితం ఏంటీ.. అనే విషయాలు చాలామందికి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది.
64 ఏళ్ల ఒడిశా ట్రైబల్ లీడర్ ( Tribal Leader ).. తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ (Mayur bhanj) జిల్లాలో జన్మించారు. శ్యామ్ చరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అయితే భర్త, కుమారులు ఇద్దరూ చనిపోవడంతో ఆమె జీవితంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత ప్రజాసేవకే ఆమె జీవితాన్ని అంకితం చేశారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన మరియు గిరిజన సంఘం నుండి వచ్చిన ముర్ము ఉపాధ్యాయురాలిగా ప్రారంభించి ఒడిశా రాజకీయాల్లోకి ప్రవేశించారు.
1997లో రాయ్‌రంగాపూర్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మోర్చా ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు.. రాయ్‌రంగాపూర్ నియోజకవర్గం నుంచే 2000వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశాలో బీజేపీ, బీజేడీ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో వాణిజ్య, రవాణా శాఖలతోపాటు ఫిషరీస్ అండ్ యానిమల్ రిసోర్సెస్ విభాగాల మంత్రిగా సేవలు అందించారు. 2000 నుంచి 2004 వరకు మంత్రి పదవిలో కొనసాగిన ఆమె.. 2015లో జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా (Jarkhand Governor) ప్రమాణ స్వీకారం చేశారు. వివాద రహితురాలిగా పేరున్న ద్రౌపదికి.. జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు అధికార పక్షమే కాకుండా ప్రతిపక్ష నేతల నుంచి కూడా మన్ననలు పొందారు.
దేశ అత్యున్నత పదవిని చేపట్టిన ద్రౌపది ముర్ము తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, విషాదాలను ఎదుర్కొన్నారు. 2009లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక కుమారుడు మరణించాడు. ఈ విషాదం నుంచి తెరుకునే లోపే, 2012లో రోడ్డు ప్రమాదంలో మరో కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. భర్త శ్యామ్ చరణ్ ముర్ము గుండెపోటుతో మరణించారు. భర్త, కొడుకులను కోల్పోయిన ద్రౌపది మిగిలిన ఏకైక కూతురు ఇతిశ్రీనే అన్నీ. కూతురుకు వివాహమై ఒక పాప కూడా ఉంది. తీరిక చిక్కినప్పుడల్లా చిన్నారి మనవరాలితో ఆడుకుంటారు ద్రౌపది ముర్ము.
ద్రౌపది ముర్ము బయోడేటా..
64 ఏళ్ల ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్తుడు.
ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్చరణ్ ముర్ము. మర్ము దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
టీచర్ గా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము.. అనంతరం బీజేపీలో చేరి వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొందారు. అందరి మన్ననలు పొందారు.
1997లో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముర్ము.. రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ – బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మార్చి 6, 2000 నుండి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం, రవాణా మంత్రిగా పనిచేశారు.
ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.
2010, 2013లో మయూర్‌భంజ్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా, 2013లో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలిగా కొనసాగారు.
జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు గవర్నర్‌గా సేవలందించారు.