Who is Draupadi Murmu; ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఎవరు? ఆమె జీవిత విశేషాలు ఏంటి? ఎన్డీయే ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేసింది, ముర్ము జీవితంలో అతిపెద్ద షాక్ ఏంటో తెలుసా?

New Delhi, June 22; రాష్ట్రపతి ఎన్నికలు ( Presidential Polls ) దగ్గరపడే కొద్దీ పోటీలో ఎవరుంటారనే ఉత్కంఠ పెరిగిపోతూ వచ్చింది. ఇలాంటి సమయంలో యశ్వంత్ సిన్హా ( Yashwant Sinha )ను విపక్షాలు బరిలో దించాయి. విపక్షాలు సీనియర్ నేతను రంగంలోకి దించడంతో.. అధికార బీజేపీ ఎవరిని బరిలో దింపుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఉత్కంఠకు తెర దించిన బీజేపీ.. అనూహ్యంగా ద్రౌపది ముర్ము (Draupadi Murmu) పేరును ప్రకటించింది. 64 ఏళ్ల ఒడిశా ట్రైబల్ లీడర్ ( Tribal Leader ).. తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ (Mayur bhanj) జిల్లాలో జన్మించారు. శ్యామ్ చరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అయితే భర్త, కుమారులు ఇద్దరూ చనిపోవడంతో ఆమె జీవితంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత ప్రజాసేవకే ఆమె జీవితాన్ని అంకితం చేశారు.

1997లో రాయ్‌రంగాపూర్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మోర్చా ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు.. రాయ్‌రంగాపూర్ నియోజకవర్గం నుంచే 2000వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశాలో బీజేపీ, బీజేడీ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో వాణిజ్య, రవాణా శాఖలతోపాటు ఫిషరీస్ అండ్ యానిమల్ రిసోర్సెస్ విభాగాల మంత్రిగా సేవలు అందించారు. 2000 నుంచి 2004 వరకు మంత్రి పదవిలో కొనసాగిన ఆమె.. 2015లో జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా (Jarkhand Governor) ప్రమాణ స్వీకారం చేశారు. ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో ఆ పార్టీకి జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) మద్దతు లభించే అవకాశం ఉంది.

వివాద రహితురాలిగా పేరున్న ద్రౌపదికి.. జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు అధికార పక్షమే కాకుండా ప్రతిపక్ష నేతల నుంచి కూడా మన్ననలు పొందారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌తోపాటు ప్రస్తుత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో ద్రౌపదికి మంచి అనుబంధం కూడా ఉండటం వల్ల వాళ్ల మద్దతు బీజేపీకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బీజేపీకి ఆదివాసీల ఓట్ల షేర్ పెరగడమే కాకుండా.. ఒడిశాలో పార్టీకి మద్దతు పెరుగుతుందని ఆ పార్టీ సీనియర్ల అభిప్రాయం.

Presidential Elections 2022: బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము పేరు ప్రకటన, పూర్తి వివరాలు మీకోసం  

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కూడా ద్రౌపది ముర్ముకు స్నేహపూర్వక అనుబంధం ఉంది. కావున ఆమెకే ఒడిశా సీఎం మద్దతు తెలిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఇక్కడ కీలకమైన ఆదివాసీల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. వాటిలో భాగంగానే ఆదివాసీ నేత అయిన ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Presidential Election 2022: ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా, అధికారికంగా ప్రకటించిన జైరాం రమేష్‌  

మరోవైపు విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా పేరు ఖరారు అయింది. పార్ల‌మెంట్ ఎన్ఎక్స్ భ‌వ‌న్‌లో స‌మావేశ‌మైన 18 ప్ర‌తిప‌క్షాల‌ పార్టీల నాయ‌కులు య‌శ్వంత్ సిన్హా పేరును ఏక‌గ్రీవంగా ప్ర‌తిపాదించారు. విప‌క్షాల నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్ ప్ర‌క‌టించారు. ఎన్‌సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ నేతృత్వంలో ఈ సమావేశం జ‌రిగింది. అన్ని పార్టీలు త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని య‌శ్వంత్ సిన్హా విజ్ఞ‌ప్తి చేశారు. య‌శ్వంత్ సిన్హా గ‌తంలో కేంద్ర ఆర్థిక‌, విదేశాంగ శాఖ‌ల మంత్రిగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం తృణ‌మూల్ పార్టీలో కొన‌సాగుతున్న య‌శ్వంత్ సిన్హా.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. విప‌క్ష పార్టీల త‌ర‌పున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ఎంపిక చేసేందుకు ఇటీవ‌ల బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

జూలై 18వ తేదీన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. య‌శ్వంత్ సిన్హా 1960లో ఐఏఎస్ ఉద్యోగం సాధించారు. ఆ త‌ర్వాత 24 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా కొన‌సాగారు. 1984లో త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంత‌రం జ‌న‌తా పార్టీలో చేరారు. 1988లో రాజ్యస‌భ‌కు ఎంపిక‌య్యారు. 1996లో బీజేపీ అధికార ప్ర‌తినిధిగా పని చేశారు. 1998, 1999, 2009లో హ‌జారీబాగ్ ఎంపీగా ఎన్నిక‌య్యారు.

1998లో చంద్ర‌శేఖ‌ర్ కేబినెట్‌లో ఏడాది పాటు కేంద్ర ఆర్థిక మంత్రిగా కొన‌సాగారు. 2002లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 2021, మార్చి 13న తృణ‌మూల్ కాంగ్రెస్‌లో చేరారు. మార్చి 15న టీఎంసీ వైస్ ప్రెసిడెంట్‌గా య‌శ్వంత్ సిన్హాను ఎన్నుకున్నారు.