KCR In Punjab: రైతులు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయ్! ప్రాణం పోయినా వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టం, పంజాబ్‌లో సీఎం కేసీఆర్ పర్యటన, గాల్వాన్ అమరులు, రైతు ఆందోళనల్లో మరణించినవారి కుటుంబాలకు ఆర్ధికసాయం
రైతులకు ఫ్రెండ్లీగా ఉన్న ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి అస్సలు గిట్టనే గిట్టదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మండిపడ్డారు. ఏదో విధంగా వారిని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుందని విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు.
Hyderabad, May 22: రైతులకు ఫ్రెండ్లీగా ఉన్న ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోదీ (MODI) ప్రభుత్వానికి అస్సలు గిట్టనే గిట్టదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (CM KCR) మండిపడ్డారు. ఏదో విధంగా వారిని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుందని విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు. ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉందని వారికి ధైర్యం కలిపించారు. తాము ఒంటరయ్యామని రైతు కుటుంబాలు ఆందోళన చెందవద్దని, తామంతా అండగా వున్నామని కేసీఆర్ పూర్తి భరోసానిచ్చారు. దేశ వ్యాప్తంగా రైతులు చేసే ఉద్యమానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా వుంటుందని, వాటికి మద్దతిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. చండీగఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ (Galwan) సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్ (CM KCR) పరామర్శించారు. ఈ సందర్భంగా 600 కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Bagawanth Mann), ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Kejriwal) కూడా పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... "స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడచినా.. ఇంకా ఇలాంటి సమావేశాలు నిర్వహించడం అత్యంత బాధాకరం. ఇదేమీ సంతోషించాల్సిన సందర్భం కాదు. ఇలాంటి సభలు చూసినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. బాధేస్తుంది. దేశం ఎందుకిలా వుందని అనిపిస్తుంది. దీని గురించి ఆలోచించాలి. దీని మూలాలేమిటో ఆలోచించాలి. చర్చ కూడా జరగాలి. భారతదేశానికి చెందిన ఓ పౌరుడిగా చర్చ జరగాలని కోరుకుంటున్నా. సమస్యల్లేని దేశం ఉందని నేను అనను. సమస్యలున్న దేశాలున్నాయి.
కానీ ఇలాంటి సమస్యలున్న దేశాలు మాత్రం లేవు. రైతు సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకడం లేదు. కేంద్రంపై ఒత్తిడి పెంచి, రైతులు తమ డిమాండ్లను నెరవేర్చుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేసుకున్నారని, వారందరికీ శతకోటి ప్రణామాలు అయితే రైతు ఉద్యమంలో అసువులు బాసిన వారిని తిరిగి తీసుకురాలేం. రైతు కుటుంబాలు ఒంటరిగా లేవు. దేశంమొత్తం మీకు అండగా వుంది. షహీద్ భగత్ సింగ్ (Baghat singh) స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తిని కన్న రాఫ్ట్రం పంజాబ్. దేశానికి పంజాబ్ రాష్ట్రం గొప్ప సేవలు చేసింది. వాటిని ఎవ్వరూ మరిచిపోలేరు. దేశవ్యాప్తంగా అన్నపానాదులకు కష్టంగా ఉన్న సమయంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలో పంజాబ్ రైతులు దేశానికి అన్నం పెట్టారు. ఇంత గొప్ప సేవలు చేసిన పంజాబ్ రైతులను మరిచిపోరు. వారి సేవలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు.
చైనా సైనికులతో దేశం కోసం కొట్లాడి, అమరులైన కల్నల్ సంతోష్ బాబు (Santhosh babu) మా తెలంగాణ ప్రాంతం వారు. ఆయనతో పాటు పంజాబ్ సైనికులు (Punjab Solders) కూడా వీరమరణం పొందారు. ఆ ఘటన తర్వాత వీర మరణం పొందిన పంజాబ్ కుటుంబాలను పరామర్శించాలని నేను అనుకున్నా. కానీ.. ఆ సమయంలో ఎన్నికలు జరిగాయి. అందుకే రాలేకపోయా. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కూడా పంచుకున్నా. ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసి, నా కార్యక్రమానికి మద్దతిచ్చారు.
దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి. తెలంగాణ కూడా రైతుల కోసం ఎంతో చేస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక మునుపు మా రైతుల గోస వర్ణనాతీతం. ఒక్క రోజే 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. విద్యుత్ సమస్య కూడా వుండేది. అర్ధరాత్రి కరెంట్ సరఫరా వల్ల ఎందరో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ మా ప్రభుత్వం 24 గంటలూ రైతుల కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇలా రైతుల రక్తాన్ని తాగాలని చూస్తోంది. మా ప్రాణాలు పోయినా.. మేం మాత్రం మీటర్లు బిగించమని అసెంబ్లీ నుంచే తీర్మానం చేసేశాం. ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం మంచి పనులు చేస్తే కేంద్రానికి సహించదు. ఏదో విధంగా ఒత్తిడి తెస్తుంది.
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తే వారిని ఖలిస్తాన్ ఉగ్రవాదులంటూ ఆరోపణలు చేశారు. ఇది దురదృష్టకరం. రైతు ఉద్యమానికి మేం మద్దతిస్తున్నాం. చెమటోడ్చి రైతులు పంటలు పండిస్తున్నారు. దేశంలోని రైతులందరూ ఉద్యమంలోకి రావాలి. ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉంది. కనీస మద్దతు ధర విషయంలో ఏ ప్రభుత్వమైతే చట్టబద్ధత కల్పిస్తుందో… వారికే మద్దతివ్వాలి. ఇంతటి ఐక్యత దేశ వ్యాప్త రైతుల్లో రావాలి. రైతు ఫ్రెండ్లీ ఉన్న ప్రభుత్వాలు మీకు మద్దతుగా నిలుస్తాయి. మా తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు ఉద్యమానికి అండగా వుంటుంది. మేం కూడా పూర్ణంగా మద్దతిస్తాం. మీరు మాత్రం ఆందోళన చేయండి.
మిత్రులారా.. ప్రాణాలు కోల్పోయిన రైతుల ప్రాణాలను తిరిగి వెనక్కి తీసుకురాలేను. మీకు స్వాంతన చేకూర్చడానికే వచ్చాను. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు సద్గతులు కలగాలని కోరుకుంటున్నా. రైతు కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. అంటూ సీఎం కేసీఆర్ ముగించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)