Representational Image (Photo Credits: PTI)

రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా గడిచిన రెండేండ్లలో టెన్త్‌ పరీక్షలు రద్దయ్యాయి. 2020లో కోవిడ్‌ మొదటి వేవ్‌లో రెండు పేపర్లకు పరీక్షలు నిర్వహించిన తర్వాత రద్దుచేశారు. 2021లో కోవిడ్‌ రెండో వేవ్ కారణంగా పరీక్షలు నిర్వహించనే లేదు. రెండేండ్ల విరామం తర్వాత ఇప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. 11,401 పాఠశాలలకు చెందిన 5.09 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో మంచినీళ్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో పెట్టారు. పేపర్‌ లీకేజీకి ఆస్కారం లేకుండా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటుచేశారు. అవసరాన్ని బట్టి జిల్లా కలెక్టర్లు, డీఈవోలే సిట్టింగ్‌ స్కాడ్‌ను నియమించుకొనే అవకాశం కల్పించారు. కాపీయింగ్‌ను అరికట్టడంలో భాగంగా విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడితే డీఈవోలు, ఎంఈవోలదే బాధ్యతని ఆదేశాలిచ్చారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. అయితే పరీక్ష కేంద్రానికి 5 నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఎస్సెస్సీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినా, సాంకేతికతను వినియోగించి పేపర్‌ లీక్‌ చేసినా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సెస్సీ బోర్డు అధికారులు హెచ్చరించారు. ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసినా, వీడియోలు తీసినా పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్‌ప్రాక్టీస్‌ అండ్‌ అన్‌ ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 25, 1997 ప్రకారం క్రిమినల్‌ కేసు నమోదుచేస్తామని తెలిపారు. నేరం రుజువైతే కనిష్టంగా ఆరు నెలలు, గరిష్టంగా మూడేండ్ల శిక్ష, రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విస్తారు.

హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. ప్రస్తుతం బస్‌పాస్‌ కలిగి ఉండి దానితోపాటు పరీక్ష హాల్‌టికెట్‌ చూపిస్తే పరీక్ష కేంద్రానికి, పరీక్ష కేంద్రం నుంచి తిరుగు ప్రయాణం కూడా ఉచితంగా పొందవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్‌ శనివారం తెలిపారు.

ఆత్మవిశ్వాసంతో రాయండి

‘విద్యార్థులు ఆత్మవిశ్వాసంలో పరీక్షలు రాయాలి. ఒత్తిడి, భయానికి తావులేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరుకావాలి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. విద్యార్థులంతా పరీక్షల్లో విజయం సాధించాలి. తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలి. విద్యార్థులకు నా శుభాకాంక్షలు’ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.