Godavari Boat Tragedy: పెరుగుతున్న మృతుల సంఖ్య, 315 అడుగుల లోతులో బోటు, ఆ రోజు ప్రయాణమే కొంపముంచిందా ? విషాద ఘటనపై ప్రత్యేక కథనం
గత 30 ఏళ్ల కాలంలో వంద మందికి పైగా బోటు ప్రమాదాల్లో ప్రాణాలు వదలాల్సి వచ్చింది. ఆదివారం అంత సురక్షితం కాదా అనే అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. 2017 నవంబర్ 12న విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో బోటు తిరగబడిన ఘటన, తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం రెండూ ఆదివారమే జరిగాయి.
Devipatnam, September 17 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాద పరిస్థితులు నెలకొన్నాయి. పాపికొండల అందాలను తిలకించేందుకు వెళ్లిన వారిని మృత్యువు కాటేసింది. తూర్పుగోదావరి ( East Godavari ) జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య రాయల వశిష్ఠ అనే ప్రైవేటు బోటు ప్రమాదానికి గత ఆదివారం ప్రమాదానికి గురైంది. మొత్తం ఈ బోటులో 70 మంది ప్రయాణీకులు పాపికొండలను చూడటానికి వెళుతూ మార్గం మధ్యలో గోదావరి నదిలో గల్లంతయ్యారు. వీరిలో 27 మంది సురక్షితంగా బయటకురాగా 46 మంది గల్లంలతయ్యారు. గోదావరిలో బోటు ప్రమాదంలో గల్లంతయిన వారి ఆచూకి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు, నేవీ, విపత్తు నివారణ బృందాలు జల్లెడపడుతున్నాయి.
46 మందిలో ఇప్పటివరకు 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మిగిలిన మృతదేహాలన్నీ బోట్‌కు దిగువన లేదా బోట్ మొదటి అంతస్తులోని ఏసీ క్యాబిన్‌లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. చత్తీస్‌గఢ్, గుజరాత్ నుంచి ప్రత్యేక సిబ్బందిని గాలింపు కోసం తీసుకువచ్చారు.ఈ బృందం గోదావరిని జల్లెడ పడుతోంది. గోదావరిలో బోటు ప్రమాదం ఎలా జరిగింది? ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు..
315 అడుగుల లోతులో బోటు..
గోదావరిలో మునిగిపోయిన బోటు 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. కాగా ప్రమాద స్థలంలో ఇరువైపులా ఎత్తైన కొండలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో బోటు వెలికితీత చాలా కష్టంతో కూడుకున్న పని అని రెస్కూ బృందం చెబుతున్నట్లు సమాచారం. కొండ ప్రాంతం కావడంతో కేవలం బోట్ల ద్వారానే రెస్కూ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వర్గాలు చెబుతున్నాయి
అక్కడ బోటు నడపడం సవాలే !
వరదల సమయంలో దేవీపట్నం మండలం కచ్చులూరు మందం ప్రాంతాన్ని దాటాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఇక్కడ వరద సమయంలో భద్రాచలం నుంచి వచ్చే వరద నీరు పాపికొండలు నుంచి కొండమొదలు వరకు వేగంగా ప్రవహిస్తూ కచ్చులూరు వద్ద కొండను తాకి సుడులు తిరుగుతుంది. ప్రమాదం జరిగిన ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరుమందం వద్ద భారీ రాళ్ల కారణంగా గోదావరిలో మామూరు సమయంలోనే సుడిగుండాలు ఉద్ధృతంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ బోటు నడపడంలో ఎంతో అనుభవం ఉన్నవారు సైతం బోటు నడపడానికి భయపడతారని అంటున్నారు. కాగా ఇప్పుడు జరిగిన బోటు ప్రమాదం కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది.
నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా ?
వరదల నేపథ్యంలో గోదావరిలో అన్నిరకాల లాంచీలు, బోట్ల రాకపోకలకపై అధికారులు నిషేధం విధించారు. అయినా వరద ప్రవాహంలోనే పర్యాటక బోట్ల రాకపోకలు జరిగిపోతున్నాయి. దీంతో నిషేధం సమయంలో బోట్ల రాకపోకలు సాగిపోవడానికి అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా పర్యాటక బోటు ప్రమాదం నేపథ్యంలో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాపికొండలు పర్యాటకానికి బోటుకు ఎవరు అనుతిచ్చారనే విషయం ఆరా తీస్తున్నారు.
ఇక్కడ ఆదివారం ప్రయాణం ప్రమాదకరమేనా ?
గత 30 ఏళ్ల కాలంలో వంద మందికి పైగా బోటు ప్రమాదాల్లో ప్రాణాలు వదలాల్సి వచ్చింది. కాగా రెండేళ్ల క్రితం విజయవాడ సమీపంలో జరిగిన బోటు ప్రమాదం సైతం ఆదివారం రోజునే జరగింది. 2017 నవంబర్ 12న విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో బోటు తిరగబడిన ఘటన, తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం రెండూ ఆదివారమే జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన భక్తులు విజయవాడ కృష్ణానదిలో బోటులో విహారానికి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 22 మంది జలసమాధి అయ్యారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)