Boat Capsize in Godavari River | Photo Credits: PTI

East Godavari, September 16 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి నదీ తీరంలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నడుమన ఉన్న పాపికొండలను చూడటానికి వెళుతూ పర్యాటకుల మృతి చెందిన విషాద ఘటన రాష్ట్ర ప్రజలను ఒక్కసారిగా శోకసంద్రంలోకి తీసుకువెళ్లింది. బోటులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 13 మంది గల్లంతయ్యారు. 14 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా వారి కోసం ఎన్టీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటనతో మరోసారి భద్రత అనే అంశం తెరపైకి వచ్చింది. గోదావరికి వరద పోటు సమయంలోనూ పాపికొండలకు అనుమతి ఎలా ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రయాణం ఎక్కడ నుంచి మొదలైంది ?

దేవీపట్నం మండలం మంటూరు-కచ్చులూరు మధ్యన గోదావరిలో ఈ ఘటన జరిగింది. 62 మంది పర్యాటకులతో పాపికొండలకు వెళ్తున్న పున్నమి లాంచి మునిగింది. వీరిలో 50 మంది పర్యాటకులు కాగా 11 మంది సిబ్బంది. ఇందులో 13 మంది చనిపోయారు. లైఫ్‌ జాకెట్లు వేసుకున్న వారిలో 14 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. వీరంతా గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండల టూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

పర్మిషన్ ఉందా అసలు ?

గత రెండు రోజులుగా గోదావరిలో వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. నిన్నటి వరకు గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. సహజంగా గోదావరి వరద ప్రవాహం కొనసాగుతున్నప్పుడు పాపికొండల పర్యటనకు అధికారులు అనుమతి ఇవ్వరు. అయితే ఇప్పుడు వరద పోటు కొనసాగుతున్న సమయంలో బోట్లకు ఎవరు అనుమతిచ్చారని స్థానికులు నిలదీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ లాంచీకి పర్యాటక శాఖ అనుమతి ఇవ్వలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ చెబుతున్నారు. మరి అనుమతి లేని లాంచీ 60 మందికి పైగా పర్యాటకులను ఎక్కించుకుని తిరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి.

గాలింపు చర్యలు ముమ్మరం

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గోదావరి నదిలో సహాయక చర్యలు చేపట్టేందుకు రెండు హెలికాఫ్టర్లు రంగంలోకి దించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లొ పాల్గొంటున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 6 ఫైర్‌ టీంలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని ప్రకృతి విపత్తుల నివారణ శాఖ తెలిపింది. చర్యల్లో భాగంగా శాటిలైట్‌ ఫోన్‌, 12 ఆస్కాలైట్లు, 8 బోట్లను ఉపయోగిస్తున్నాం. రెండు ఎన్డీఆర్‌ఎప్‌ బృందాలు, మూడు రాష్ట్ర బృందాలు పని చేస్తున్నాయి. ఇండియన్‌ నేవీ నుంచి ఒక డీప్‌ డైవర్స్‌ బృందం పని చేస్తోంది. రెండు నేవీ హెలికాప్టర్లు, ఒక ఓఎన్‌జీసీ ఛాపర్‌ను వాడుతున్నామని ప్రకృతి విపత్తుల నివారణ శాఖ పెర్కొంది.

సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు, మంత్రులకు ఆదేశాలు

గోదావరి నదిలో లాంచీ ప్రమాదంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.జిల్లా మంత్రులను హటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా కూడా సీఎం ఆదేశించారు. తూర్పుగోదారి జిల్లా కలెక్టర్లతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఎన్టీఆర్ఎఫ్ బృందాలతో పాటు, హెలికాఫ్టర్లను కూడా సహాయక చర్యల్లో వినియోగించాలని ఆదేశించారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని అధికారులకు చెప్పారు. బోటు నడిపే వారికి శిక్షణ ఉందా లేదా ? అన్నదానిపై విచారణ చేపట్టాలన్నారు. లాంచీ ప్రమాదంపై ఎప్పటికప్పుడు సీఎం ఆరా తీస్తున్నారు.

సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే

కాగా బోటు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎంతోపాటు హోం మంత్రి సుచరిత, మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ కూడా ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను జగన్ పరామర్శించారు. బోటు ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు రాష్ట్రంలో బోట్లు నడపొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

AP CM Jagan Tweet: 

నష్ట పరిహారం

లాంచీ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది. దేవీపట్నం లాంచీ ప్రమాదం నేపధ్యంలో విశాఖ జిల్లా పర్యాటకుల కోసం విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా నుంచి పాపికొండల టూర్ కి ఎవరైనా వెళ్లి ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 00002 కి వివరాలు తెలపాలని వారి కుటుంబ సభ్యులకి కలెక్టర్ వినయ్ చంద్ విజ్ణప్తి చేశారు.

ఇంతకుముందు జరిగిన ప్రమాద వివరాలు

1985 వ సంవత్సరంలో శ్రీరామగిరిలోని శ్రీరామ నవమి కల్యాణాన్ని వీక్షించేందుకు సుమారు 50 మందితో వెళ్లిన బోటు ప్రమాదానికి గురైంది. అందులో 40 మంది మృతిచెందారు. ఇక 1990లో ఆత్రేయపురం మండల పరిధిలోని ఒద్దిపర్రు, వెలిచేరు, పేరవరం గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే లంకరేవులో పడవ మునిగి పది మంది చనిపోయారు. 1992లో ముగ్గురు, 1996లో పదిమంది, 2004లో 10 మంది, 2008లో ఒకరు, 2009లో ముగ్గురు, 2017 నవంబర్‌ 12న విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో బోటు తిరగబడి 22 మంది మృత్యువాత పడ్డారు.2018 మే నెల 15వ తేదీన మంటూరు వద్ద 19 మంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ ప్రాంతంలొ ఈ దుర్ఘటన మూడవదిగా చెప్పుకోవచ్చు.

చర్యలు ఏవి ?

2017 నవంబరులో కృష్ణా నదిలో బోటు మునిగి 21 మంది చనిపోయిన నేపథ్యంలో అప్పటి నుంచీ కృష్ణా, గోదావరి నదుల్లో పర్యాటక బోట్ల ప్రయాణానికి అనుమతులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీ, బోట్లకు లైసెన్సు ఇచ్చే బాధ్యతలను నీటిపారుదల శాఖ నుంచి పూర్తిగా తప్పించేశారు. ఆ స్థానంలో బాధ్యతలను రాష్ట్ర పోర్టు శాఖకు అప్పగించారు. కృష్ణానదిలో బోటు ప్రయాణ అనుమతులు, లైసెన్సులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, వాటి పరిశీలన మచిలీపట్నం పోర్టుకు.. గోదావరిలో బోట్లకు అనుమతి, రద్దు బాధ్యతలను కాకినాడ పోర్టుకు అప్పగించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం

ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నానంటూ తెలుగులో ట్వీట్ చేశారు.

PM Modi Tweet:

రాహుల్ గాంధీ సంతాపం

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు సంతాపం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు మందం సమీపంలో జరిగిన పడవ ప్రమాదంపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టి.. బాధితులకు అండగా నిలవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

తెలంగాణా ప్రభుత్వం అండ

గోదావరిలో బోటు మునిగి చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర రవాణ శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఆదేశించారు. ఈ ఘటనపై బిజెపి నేత, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి , తెలంగాణా రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Telangana CM Tweet:

ఈ ఘటనలో ఎంతమంది ప్రయాణించేరనే దానిపై ఇంకా అధికారిక సమాచారం అందలేదు. తొలుత 61 మంది అనుకున్నా ఈ సంఖ్య 72గా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.