HD Kumaraswamy: 2028 కల్లా మళ్లీ సీఎం అవుతా, కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు, కర్ణాటక కాంగ్రెస్ కలహాలతో ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్న జేడీఎస్ నేత
2028 లోపు తాను మళ్లీ కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) అవుతానని పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలవల్ల ప్రభుత్వం పతనమవుతదని ఆయన జోస్యం చెప్పారు.
Bangalore, OCT 20: భారత మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 లోపు తాను మళ్లీ కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) అవుతానని పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలవల్ల ప్రభుత్వం పతనమవుతదని ఆయన జోస్యం చెప్పారు. ప్రజలు కోరుకుంటే తాను ముఖ్యమంత్రిని అవుతానని, వారు తనకు మరో అవకాశం ఇస్తారని నమ్ముతున్నానని కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. 2028లోపు ప్రజల మద్దతుతో సీఎంగా బాధ్యతలు చేపట్టి, మరింత అద్భుతంగా పని చేస్తానని పేర్కొన్నారు. గతంలో కర్ణాటక సీఎంగా తాను చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎక్కువకాలం కొనసాగదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలే సర్కారును పడగొడతారని కుమారస్వామి అన్నారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ప్రజలు ఎమ్మెల్యేల పట్ల ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ నేతల్లో పెరిగిపోతున్న అసంతృప్తి పార్టీకి నష్టం చేస్తుందని, త్వరలోనే ఆ విభేదాలు బయటకు వస్తాయని అన్నారు.
అప్పటి వరకు తాను వేచి చూడాల్సిందేనని కుమారస్వామి వ్యాఖ్యానించారు. కాగా 2006 – 2007, 2018 మే నుంచి 2019 జూలై వరకు కుమారస్వామి రెండుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండు పర్యాయాలు సంకీర్ణ సర్కారుకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.