IAF Helicopter Crash: హెలికాప్టర్ ప్రమాదంపై రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన, 12.08 నిమిషాలకు ఏటీసీతో హెలికాప్టర్ సంబంధాలు కట్, ఘటనపై ట్రై సర్వీస్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలిపిన రక్షణ మంత్రి
దీనిపై ఇవాళ లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన (Rajnath Singh briefs Parliament) చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో (IAF Helicopter Crash) 13 మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు.
New Delhi, Dec 9: తమిళనాడు రాష్ట్రంలో నిన్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన (Rajnath Singh briefs Parliament) చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో (IAF Helicopter Crash) 13 మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారని, ఆయన్ను బ్రతికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మరణించినవారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రానికి మృతదేహాలు ఢిల్లీకి చేరుతాయన్నారు. శుక్రవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయన్నారు.
మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదంలో (AF MI-17V5 Helicopter Crash) బిపిన్ రావత్ దంపతులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు. వెల్లింగ్టన్ కాలేజీ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు అక్కడకు వెళ్లారన్నారు. సూలూరు ఎయిర్ బేస్ నుంచి నిన్న.. ఉదయం 11:48 గంటలకు హెలికాప్టర్ టేకాఫ్ అయిందన్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు వెల్లింగ్టన్ లో ల్యాండ్ కావాల్సి ఉందని ఆయన తెలిపారు. కానీ మధ్యాహ్నం 12:08 గంటలకు సూలూరు ఏటీపీ విమానానికి కాంటాక్ట్ తెగిపోయిందని రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు.అయితే స్థానికులు మంటల్లో కాలిపోతున్న హెలికాప్టర్‌ను చూశారని, దాంట్లో ప్రాణాలను కొట్టుమిట్టాడుతున్నవారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు.
ప్రమాదంలో మృతిచెందిన రక్షణ దళ సిబ్బంది పేర్లను రాజ్‌నాథ్ చదివి వినిపించారు. పార్డీవ దేహాలను వైమానిక దళ విమానంలో ఇవాళ ఢిల్లీకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. ఎయిర్ చీఫ్ మార్షెల్ చౌదరీ నిన్ననే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపారు. ఘటనపై ట్రై సర్వీస్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు చెప్పారు. ఎయిర్ మార్షల్ మనవేంద్ర సింగ్ నేతృత్వంలో విచారణ జరగనున్నది. విచారణ అధికారులు నిన్ననే వెల్లింగ్టన్ చేరారని, వాళ్లు దర్యాప్తు కూడా మొదలుపెట్టినట్లు చెప్పారు. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రాజ్‌నాథ్ తెలిపారు. స్పీకర్ ఓం బిర్లా కూడా నివాళి అర్పించారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. హెలికాప్టర్ లోని బ్లాక్ బాక్స్‌లో పైలట్ల సంభాషణలు రికార్డయ్యే అవకాశం ఉంటుంది. బ్లాక్ బాక్స్ కోసం అధికారులు, సిబ్బంది గాలించగా వారికి ప్రమాద స్థలికి 30 అడుగుల దూరంలో అది లభ్యమైంది. దాన్ని వైమానిక దళ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్ ప్రమాద దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలకం కానుంది. ప్రమాదానికి కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
మరోవైపు, కూలిపోయిన హెలికాప్టర్ కు సంబంధించిన మరిన్ని పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులికా రావత్ అంత్యక్రియలను రేపు ఢిల్లీలోని కంటోన్మెంట్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం వారి మృతదేహాలను సైనిక విమానంలో ఢిల్లీకి తరలిస్తారు. ఈ మేరకు అధికార వర్గాలు ఓ ప్రకటన చేశాయి. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం రావత్ మృతదేహాన్ని ఉంచనున్నామని వివరించారు.