IAF Helicopter Crash: చిట్టి తల్లిని చూడాలని ఉందంటూ భార్యకు ఫోన్, వీడియో కాల్ చేస్తానంటూ.. కొద్ది గంటలకే హెలికాఫ్టర్ ప్రమాదంలో తెలుగు తేజం సాయితేజ్ మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం జగన్
Lance Naik Sai Tej from Andhra Pradesh (Photo-File Image)

Chittoor, Dec 9: భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో (IAF Helicopter Crash) చనిపోయినట్టు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి విదితమే. బిపిన్‌ రావత్‌ ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్టు వెల్లడిచింది. ఈ ప్రమాదంలో ఏపీ వాసి లాన్స్ నాయక్ సాయితేజ్ (Lance Naik Sai Tej from Andhra Pradesh) కూడా మృతి చెందాడు. ఇతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. లాన్స్ నాయక్ సాయి తేజ్ ప్రమాదానికి నాలుగు గంటలు ముందు ఆయన భార్యతో మాట్లాడిన మాటలు (spoke to wife four hours before mishap) కంటతడిపెట్టిస్తున్నాయి.

భార్యకు ఫోన్ చేసిన సాయితేజ్... నా గారాల పట్టి దర్శిని ఏం చేస్తోంది.. బాబు మోక్షజ్ఞ స్కూల్‌కు వెళ్లాడా.. చిట్టితల్లిని చూడాలని ఉంది. వీడియో కాల్‌ చేస్తా’ అంటూ భార్య శ్యామలతో లాన్స్‌నాయక్‌ బి.సాయితేజ బుధవారం ఉదయం 8.45 గంటలకు మాట్లాడారు. భార్య, పాపను వీడియోకాల్‌లో చూస్తూ తాను చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి తమిళనాడు వెళుతున్నానని.. వీలు కుదిరితే సాయంత్రం చేస్తానని టాటా చెప్పిన సాయితేజ.. కొద్ది గంటల్లోనే ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

సీడీఎస్ జనరల్ బిపిస్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో ఆంధ్రప్రదేశ్ జవాన్, ఉదయం భార్యకు ఫోన్ అంతలోనే దుర్ఘటన, సంతాపం తెలిపి సీఎం జగన్

సాయితేజ్ రక్షణ శాఖలో సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా విధులు నిర్విహిస్తున్నారు. సాయితేజ్ 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు . సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. ఊహించని ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామం షాక్‌కు గురైంది.

Here's CM YS Jagan Tweet

ప్రమాద విషయం తెలుసుకున్న సాయితేజ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు మదనపల్లెలో భార్య శ్యామల నివాసం ఉంటున్న ఇంటికి, ఎగువరేగడ గ్రామంలో తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో సాయితేజ చనిపోయాడని తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని, ఎలాంటి దుర్వార్త ఏ సమయంలో వినాల్సి వస్తోందని బాధాతప్త హృదయాలతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. సాయితేజ మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. తల్లి భువనేశ్వరిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

జనరల్ బిపిన్ రావత్ కన్నుమూత, ఆయన భార్య మధులికా రావత్ తో సహా 11 మంది ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి, అధికారికంగా ప్రకటించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

28 ఏళ్ల సాయితేజ 2013లో బెంగళూరు రెజిమెంట్‌కు ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు. అక్కడ శిక్షణ పొందుతూ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన పరీక్షలు రాసి ఏడాది తర్వాత ప్యారా కమాండోగా ఎంపికై 11వ పారాలో లాన్స్‌నాయక్‌గా నియమితులయ్యారు. విధి నిర్వహణలో భాగంగా కశ్మీర్, బెంగళూరు హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో బిపిన్‌ రావత్‌ వద్ద పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తల్లి భువనేశ్వరి మాజీ ఎంపీటీసీ, తండ్రి మోహన్‌ సాధారణ రైతు. తమ్ముడు మహేష్‌ఆర్మీలో సిపాయిగా సిక్కింలో పని చేస్తున్నారు.

సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ (5), పాప దర్శిని (2) సంతానం. కుమారుడు మోక్షజ్ఞ చదువు కోసం సాయితేజ భార్య శ్యామల మదనపల్లె ఎస్‌బీఐ కాలనీ రోడ్‌ నెం.3లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

బిపిన్‌ రావత్‌, ఏపీ ముద్దుబిడ్డ సాయి తేజ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలిన సంఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్‌ ప్రమాద ఘటన వార్తతో కలత చెందానన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.