Telugu Jawan Dies in Helicopter Crash: సీడీఎస్ జనరల్ బిపిస్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో ఆంధ్రప్రదేశ్ జవాన్, ఉదయం భార్యకు ఫోన్ అంతలోనే దుర్ఘటన, సంతాపం తెలిపి సీఎం జగన్
IAF helicopter crashed near Coonoor with CDS Gen Bipin Rawat onboard (Photo Ctredits: PTI/ANI)

చెన్నై, డిసెంబర్ 8: తమిళనాడులోని నీలగిరి కనుమల్లో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో జనరల్ రావత్ దంపతులు సహా 11 మంది దుర్మరణం పాలైన సంగతి విదితమే. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ కూడా వున్నారు. వివరాల్లోకి వెళితే హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ మృతిచెందారు.

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ.. లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన సీడీఎస్ బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. 2013లో బెంగళూరు రెజిమెంట్ నుంచి ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు. సిపాయిగా విధులు నిర్వర్తిస్తూనే.. 2014లో పారా కమాండో ఎగ్జామ్ రాసి సెలక్ట్ అయ్యారు. ఆ తర్వాత 11వ పారాలో లాన్స్ నాయక్ గా చేరారు. గతేడాది వరకు సాయితేజ.. బెంగళూరులోని ఆర్మీ శిక్షణా కేంద్రంలో ట్రైనర్ గా విధులు నిర్వర్తించారు. అనంతరం సీడీఎస్ కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా చేరారు.

ప్రస్తుతం సాయితేజ్ బిపిన్ రావత్‌కు సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. సాయితేజ్ మృతితో ఎగువరేగడి గ్రామంలో తీవ్ర విషాధ ఛాయలు అలుము కున్నాయి. భార్య శ్యామలతో చివరిసారిగా బుధవారం ఉదయం 8.30 గంటలకు ఫోన్‌లో సాయితేజ మాట్లాడారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కొడుకు మోక్షజ్ఞ, కూతురు దర్శిని. సాయితేజ మరణవార్త తెలుసుకున్న గ్రామస్తులు, సన్నిహితులు వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.

జనరల్ బిపిన్ రావత్ కన్నుమూత, ఆయన భార్య మధులికా రావత్ తో సహా 11 మంది ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి, అధికారికంగా ప్రకటించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

ప్రస్తుతం ఆయన కుటుంబం మదనపల్లెలో ఉంటుంది. సాయితేజ ఈ రోజు ఉదయం వెల్లింగ్టన్ కు బయలుదేరేముందు.. వీడియో కాల్ చేసి భార్య, పిల్లలతో మాట్లాడారు. ఆ తర్వాత కాసేపటికే జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. సాయితేజ మృతితో స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సాయితేజ మృతి పట్ల సీఎం జగన్ సైతం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.