Monsoon 2021: ఆగస్టు 25 వరకు దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఢిల్లీలో కేవలం మూడు గంటల్లో 73.2 సెంటీమీటర్ల వాన, తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు
బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, సబ్ హిమాలయన్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
New Delhi, August 21: దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rainfall) కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) (Meteorological Department) వెల్లడించింది. బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, సబ్ హిమాలయన్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
ఈ మేర ఐఎండీ (IMD) శనివారం తాజాగా వెదర్ బులెటిన్ ను విడుదల చేశారు.శనివారం గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. హర్యానా, చండీఘడ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్ రాష్ట్రాల్లో వచ్చే నాలుగైదు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. తుపాన్ ప్రభావం వల్ల విదర్భ పరిసర మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
గుజరాత్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ , ఢిల్లీ రాష్ట్రాల్లో శని,ఆదివారాల్లో భారీవర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్,కేరళ, మహారాష్ట్ర, రాయలసీమ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్,యానాంలలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్ రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో కేవలం మూడు గంటల్లో 73.2 సెంటీమీటర్ల వాన కురిసింది. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడ నిలిచిపోయింది. రోడ్లమీద భారీగా నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలోని సష్దర్‌గంజ్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 2.30 నుంచి 5.30 గంటల వరకు 73.2 సెంటీమీటర్ల వాన నమోదయిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మరో రెండు వారాలపాటు ఇదేవిధంగా వానలు కురుస్తాయని వెల్లడించింది.
ప్రగతి మైదాన్ ప్రాంతంలో రోడ్లు జలపాతాలను తలపిస్తున్నాయి. పండిట్ మార్గ్, మింటో బ్రిడ్జి, విజయ్ చౌక్, ఐటీఓ ప్రాంతం, ఆజాద్ మార్కెట్ ప్రాంతంలో భారీగా వర్షం కురిసింది. కాగా, మింటో బ్రిడ్జి ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. దీంతో బ్రిడ్జిని ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. ఆజాదీ మార్కెట్ అండర్‌పాస్‌లో భారీగా నీరు నిలవడంతో వాహనాలను అనుమంతించడం లేదు. 1.5 ఫీట్ల వరకు నీరు నిలిచిపోవడంతో అండర్‌పాస్‌ను మూసివేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
వచ్చే రెండు గంటల్లో ఢిల్లీ పరిధిలోని బహదూర్‌గడ్, ఫరీదాబాద్, వల్లభ్‌గఢ్, హిండన్ ఏఎఫ్ స్టేషన్, ఘజియాబాద్, ఇందిరపురం, నోయిడా, గ్రేటర్ నోయిడాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. అదేవిధంగా దేశరాజధాని చుట్టూఉన్న హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా వానలు పడతాయని తెలిపింది. కాగా, వాతావరణ శాఖ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. అదేవిధంగా ఈనెల 23 నుంచి 26 వరకు గ్రీన్ అలర్ట్‌ను జారీచేసింది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇటు విజయవాడ సిటీతో పాటు.. అటు వైజాగ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది.. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది అమరావతి వాతావరణ కేంద్ర… ఏపీలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్యభారత దేశం వైపు ప్రయాణం చేస్తుందని ప్రకటించిన వాతావరణశాఖ.. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వీస్తున్నాయని.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది. రేపటికి మరింత బలపడి అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణశాఖ.. దీని ఫలితంగా ఈ నెల 21, 22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసేఅవకాశం.. ఉందని.. రాగల 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది.
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా 3.1 ఎత్తున ఆవరించి ఉందని చెప్పింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తాయని చెప్పింది. శనివారం ఉరుములు, మెరుపులతో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.