Covid in India: వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఇద్దరు మృతి, కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల చనిపోలేదంటున్న వైద్యులు, కరోనాతో కేరళలో సీపీఎం ఎమ్మెల్యే మృత్యువాత, దేశంలో అత్యంత తక్కువగా 10,064 కేసులు నమోదు
గత 24 గంటల్లో కేవలం 10,064 మందికి మాత్రమే వైరస్ (Coronavirus in India) సంక్రమించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు 1.05 కోట్ల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
New Delhi, Jan19: గత ఏడు ఎనిమిది నెలల్లో ఇండియాలో అత్యల్ప స్థాయిలో కేసులు (India Daily Covid Cases Drop) నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కేవలం 10,064 మందికి మాత్రమే వైరస్ (Coronavirus in India) సంక్రమించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు 1.05 కోట్ల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే రికవరీ అయిన వారిలో 1.02 కోట్ల మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైన నాలుగు రోజుల తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం విశేషం. ఇప్పటి వరకు ఇండియాలో 3.8 లక్షల మంది కరోనా టీకాను ఇచ్చారు.
గత 24 గంటల్లో చోటుచేసుకున్న మరణాల్లోనూ కూడా ఇండియా అత్యల్ప రికార్డు నమోదు చేసింది. కోవిడ్ వైరస్ బారిన పడినవారిలో కేవలం 137 మంది మాత్రమే నిన్న మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. దీంతో ఇప్పటి వరకు వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 1,52,556కు చేరుకున్నది. గత ఏడాది జూన్ 11వ తేదీన పది వేల కన్నా తక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ రోజున 9996 మందికి వైరస్ సంక్రమించింది. అయితే 8 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ దేశంలో పాజిటివ్ కేసులు పదివేల వద్దే ఆగిపోయాయి.
కరోనా వైరస్ (Coronavirus) సోకి కేరళలో సీపీఎం ఎమ్మెల్యే కేవీ విజయదాస్(61) మృతి చెందారు. విజయదాస్ (Vijay das) కొంగడ్ నియోజకవర్గం నుంచి కేరళ అసెంబ్లీకి (Kerala) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విజయదాస్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం నాయకులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సంతాపం తెలిపారు. విజయదాస్ మృతి (CPM MLA Dies With Corona) పార్టీకి తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు పండాళం సుధాకరణ్‌పై విజయదాస్ 13 వేల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేకు భార్య ప్రేమకుమారి, ఇద్దరు కుమారులు జయదీప్, సందీప్ ఉన్నారు.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో రాజస్థాన్ సర్కారు రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో నైట్ కర్ఫ్యూను ఎత్తివేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్... సాయంత్రం ఏడు గంటల తరువాత మార్కెట్ మూసివేయాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లలో ఆర్టీ-పీసీఆర్ టెస్టుల రుసుమును రూ. 800 నుంచి రూ. 500కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా సామాజిక, ధార్మిక కార్యక్రమాలకు ఇంతవరకూ విధించిన నిబంధనలను కొంతమేరకూ సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం రెండు మరణాలు సంభవించడం దేశంలో కలకలం రేపుతోంది. ఒకరు ఉత్తరప్రదేశ్‌లోనూ, మరొకరు కర్ణాటకలోనూ మరణించారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ గ్రూప్–డి ఉద్యోగి నాగరాజు (43) కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న రెండో రోజు మరణించాడు. అయితే ఈ మరణం హార్ట్ అటాక్ వల్ల వచ్చిందని, వ్యాక్సినేషన్ వల్ల కాదని వైద్యులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం పోస్ట్ మార్టం వరకూ ఆగాల్సి ఉంటుందని అన్నారు.
ఇక ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే ఓ ఆరోగ్య కార్యకర్త మృతిచెందాడు. అయితే, కరోనా టీకా సంబంధిత మరణం కాదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. గుండె–శ్వాసకోశ సంబంధిత వ్యాధితోనే మహిపాల్ మృతిచెందాడని శవపరీక్ష నివేదికలో పేర్కొన్నారు. మహిపాల్ మృతిపై దర్యాప్తు జరిపిస్తామని మొరాదాబాద్ కలెక్టర్ రాకేశ్‌సింగ్ చెప్పారు.