New Delhi, Jan 18: ఉత్తరప్రదేశ్‌లోని మోర్దాబాద్ జిల్లాలో కొవిడ్ టీకా తీసుకున్న 24 గంటల తర్వాత ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి (UP Hospital Worker Dies) చనిపోయాడు. అయితే కొవిడ్ వ్యాక్సిన్ వల్ల ఆ ఉద్యోగి చనిపోలేదని (Unrelated To Vaccine), ఇతర సమస్యల వల్ల మృతి చెందాడని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. అయితే మహిపాల్ కుమారుడి కథనం ప్రకారం.. వ్యాక్సిన్ తీసుకునే కంటే ముందే నాన్న అనారోగ్యంగా ఉన్నాడని తెలిపాడు.
టీకా తీసుకున్న తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని చెప్పాడు. శనివారం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఇంటికి తీసుకువచ్చాను. ఆ తర్వాత దగ్గు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని కుమారుడు పేర్కొన్నాడు.
కాగా మోర్దాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వార్డ్ బాయ్‌గా పని చేస్తున్న మహిపాల్ సింగ్ శనివారం కరోనా టీకా తీసుకున్నాడు. ఆదివారం అతనికి ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మహిపాల్ మృతిపై ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. వ్యాక్సిన్ కారణంగా అతను చనిపోలేదని, గుండెపోటు కారణంగానే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందన్నారు. శనివారం రాత్రి డ్యూటీ చేసినప్పుడు అతనిలో ఎలాంటి సమస్యలు లేవు అని పేర్కొన్నారు.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13,788 కరోనా పాజిటివ్ కేసులు (new COVID-19 cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,71,773కు చేరింది. ఇందులో 2,08,012 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,02,11,342 మంది బాధితులు కోలుకున్నారు. మరో 1,52,419 మంది మహమ్మారి వల్ల ప్రాణాలొదిరారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం 8 గంటల వరకు కొత్తగా 14,457 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. కరోనా వైరస్ వల్ల మరో 145 మంది మృతిచెందారని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36,091 మందికి కరోనా పరీక్షలు చేయగా 161 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,985కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 251 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,76,949 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,896. వైరస్ బాధితుల్లో కొత్తగా ఒకరు మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 7,140కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.