New Delhi, January 16: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న వేళ ఢిల్లీలో కరోనా టీకా వేయించుకున్న 51 మంది కరోనా వారియర్లు స్వల్ప అస్వస్థతకు (COVID-19 Vaccine Side Effects) గురయ్యారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా 1.91 లక్షల మందికిపైగా ఆరోగ్య రంగానికి చెందిన వారికి కరోనా టీకా వేశారు.
అయితే ఢిల్లీలోని ఎన్డీఎంసీకి చెందిన చారక్ పాలికా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ (Coronavirus Vaccine in India) వేయించుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు అనంతరం తేలికపాటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఛాతిలో తేలికపాటి బిగుతుకు గురయ్యారు. దీంతో వారిద్దరిని కొంత సేపు వైద్యుల బృందం పరిశీలనలో ఉంచారు. 30 నిమిషాల తర్వాత కుదుటపడటంతో డిశ్చార్జ్ చేసినట్లు ఎన్డీఎంసీ అధికారి తెలిపారు.
ఉత్తర రైల్వే సెంట్రల్ హాస్పిటల్‌లో మరో ఇద్దరికి కూడా ప్రతికూల లక్షణాలు కనిపించాయి. దక్షిణ ఢిల్లీ, నైరుతి జిల్లాల్లో 11 కేసులు నమోదయ్యాయి. అలాగే పశ్చిమ ఢిల్లీ, తూర్పు ఢిల్లీలో ఆరు ప్రతికూల సంఘటనలు నమోదయ్యాయి. ఆగ్నేయ ఢిల్లీలో ఐదు, నార్త్ వెస్ట్ ఢిల్లీలో నాలుగు, సెంట్రల్ ఢిల్లీలో రెండు, నార్త్ ఢిల్లీలో ఒకటి ప్రతికూల సంఘటనలు వెలుగుచూశాయి. వీటిలో దక్షిణ ఢిల్లీ పరిధిలో ఒక కేసును తీవ్రంగా పరిగణించారు. ఉత్తర రైల్వే సెంట్రల్ హాస్పిటల్‌లో ఇమ్యునైజేషన్ డ్రైవ్ చేసిన తరువాత ఆరోగ్య సంరక్షణ కార్మికుల్లో ఒకరిని మెరుగైన చికిత్సకు సూచించినట్లు అధికారులు తెలిపారు.
కోవాగ్జిన్ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ వేసుకున్న కొందరిలో వ్యాక్సిన్ వేసుకున్న15-20 నిమిషాల తర్వాత గుండె దడ, అలర్జీ, తేలికపాటి జ్వరం వంటి సమస్యలు తలెత్తినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు. అయితే సత్వర చికిత్స అందించడంతో వారు వెంటనే కోలుకున్నట్లు తెలిపారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని రెండు రోజులు డాక్టర్ల పర్యవేషణలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
ఢిల్లీలో ఎయిమ్స్ ఉద్యోగి సహా 51 మందిలో వ్యాక్సిన్ దుష్ప్రభాలు బయటపడినట్లు గులేరియా తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండగా, మిగిలిన వారు చికిత్స అనంతరం యధాస్థితికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. కోవాగ్జిన్ టీకా వేసుకున్న వీరందిరిలో ఒకే రకమైన దుష్ప్రభావాలను గమనించినట్లు గులేరియా వెల్లడించారు. చర్మ సంబంధిత అలర్జీలు, గుండె దడ, తేలికపాటి జ్వరం లాంటి సమస్యలు బయటపడినట్లు పేర్కొన్నారు.
అయితే ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏమీ లేదని, రోగనిరోధక శక్తి తక్కువగా వారిలో వ్యాక్సిన్ వేసుకున్న తరువాత ఇలాంటి దుష్ప్రభావాలు బయటపడటం సాధారణమేనని ఆయన పేర్కొన్నారు. కాగా, తొలి రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 8,117 మంది హెల్త్ వర్కర్స్‌కు వ్యాక్సినేషన్ చేయాల్సి ఉండగా, కేవలం 4,319 మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి కనబర్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా ప్రజలకు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయగా.. వారిలో 13మందిలో ముఖ పక్షవాతం లక్షణాలు కనిపించాయని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఇజ్రాయెల్ పరిశోధకులు కరోనాను నియంత్రించేందుకు సరికొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని తీసుకున్న తర్వాత కనీసం 13 మందిలో ముఖ పక్షవాతం లక్షణాలు కనిపించాయట. ఆ దేశ ఆరోగ్య శాఖే ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. ‘‘వ్యాక్సిన్ తీసుకున్న 28 గంటల వరకూ నేను ముఖ పక్షవాతంతోనే ఉన్నా’’ అని ఓ వ్యక్తి చెప్పగా.. ఆ తర్వాత కూడా ఈ లక్షణాలు పూర్తిగా తగ్గలేదు అని మరో వ్యక్తి వెల్లడించారట.