Vaccination Begins in Delhi. (Photo Credits: Twitter | ANI)

New Delhi, January 16: ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం (COVID-19 Vaccination Drive) భారత్‌లో శనివారం ప్రారంభమైన విషయం విదితమే. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్‌ సెంటర్లలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ (Coronavirus Vaccine in India) తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా పారిశుధ్య కార్మికుడు మనీశ్‌ కుమార్‌(34) గుర్తింపు పొందాడు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)లో అతడికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ పాల్గొన్నారు.

మనీశ్‌ కుమార్‌కు హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ ఇచ్చారు. తాను గత రాత్రి కంటినిండా నిద్రపోయానని, శనివారం ఉదయమే ఎయిమ్స్‌కు చేరుకున్నానని, తోటి పారిశుధ్య కార్మికులతో మాట్లాడానని, ఆ తర్వాత టీకా తీసుకున్నానని మనీశ్‌ కుమార్‌ చెప్పాడు. టీకా తీసుకోవడానికి చాలామంది భయపడ్డారని, అందుకే అధికారుల వద్దకు వెళ్లి తానే తొలి టీకా తీసుకుంటానని కోరానని అన్నాడు. భయపడాల్సిన అవసరం లేదని అందరికీ తెలియజేయడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. టీకా తీసుకోవడం పట్ల గర్వంగా ఉందన్నాడు. కరోనా టీకా విషయంలో తన తల్లి, భార్య భయపడ్డారని, వారికి ధైర్యం చెప్పానని పేర్కొన్నాడు.

వ్యాక్సిన్ వికటిస్తే నష్ట పరిహారం పొందే అవకాశం, కోవాగ్జిన్ టీకా తీసుకునేవారు నిబంధనలకు సమ్మతి తెలపాలి, సంబంధిత పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందని తెలిపిన భారత్ బయోటెక్

దేశంలో కరోనా టీకా తీసుకున్న మొదటి వ్యక్తి మనీశ్‌ కుమార్‌కు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా కృతజ్ఞతలు తెలిపారు. అతడు తొలి టీకా తీసుకొని కరోనా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బలమైన సందేశం ఇచ్చాడని ప్రశంసించారు. అతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేదానిపై సంబంధం లేకుండా కరోనాపై పోరాటంలో అతడు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఢిల్లీలో పారిశుధ్య కార్మికుడైన మనీశ్‌ కుమార్‌ కోవిడ్‌–19 జోన్లలోనూ నిర్భయంగా విధులు నిర్వర్తించాడు.

కరోనా టీకా విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను దూరం చేసేందుకు చాలా మంది ప్రముఖులు తొలిరోజు ఈ టీకా పొందారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా, నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.పాల్, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈవో అదార్‌ పూనావాలా, పశ్చిమ బెంగాల్‌ మంత్రి నిర్మల్‌ మజీ తదితరులు కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు.

దేశంలో పారిశుద్ధ్య కార్మికుడుకి తొలి వ్యాక్సిన్, వ‌ర్చువ‌ల్ విధానంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ, గురజాడ వ్యాఖ్య‌ల‌తో ప్రసంగం

దేశవ్యాప్తంగా శనివారం 3,352 సెషన్లలో 1.60 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ టీకా వల్ల దుష్ప్రభావాలు తలెత్తి ఆసుపత్రిలో చేరినట్లు ఇప్పటిదాకా ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం తొలిరోజు పూర్తిస్థాయిలో విజయవంతమైందని ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ అగ్నానీ తెలిపారు.