Coronavirus Pandemic: చిన్నపిల్లల్ని టార్గెట్ చేసిన కరోనా సెకండ్ వేవ్, దేశంలో రికార్డు స్థాయిలో 24 గంటల్లో 3,52,991 కరోనా కేసులు నమోదు, 2,812 మరణాలు, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ వల్ల ప్రమాదముందని తెలిపిన ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా
గడిచిన 24 గంటల్లో 3,52,991 కరోనా కేసులు (COVID-19 Cases in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ తెలిపింది.
New Delhi, April 26: దేశంలో వరుసగా ఐదో రోజు సోమవారం రికార్డు స్థాయిలో మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు (India Coronavirus), రెండువేలకుపైగా మరణాలు (2,812 Deaths in Past 24 Hours) నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,52,991 కరోనా కేసులు (COVID-19 Cases in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే రికార్డు స్థాయిలో 2,812 మరణాలు రికార్డయ్యాయని చెప్పింది. నిన్న ఒకే 2,19,272 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కు చేరింది. ఇప్పటి వరకు 1,43,04,382 మంది కోలుకున్నారు.
మహమ్మారి బారినపడి మొత్తం 1,95,123 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 28,13,658 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. మరో వైపు ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 14,19,11,223 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 14,03,367 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 27.93 శాంపిల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
కరోనా బాధితుడికి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌ను అనవసరంగా ఇస్తే మంచి కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని ఎయిమ్స్ (ఢిల్లీ) డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా హెచ్చరించారు. ఆ ఇంజెక్షన్లను, ఆక్సిజన్ సిలిండర్లను అనవసరంగా కొనిపెట్టుకోవద్దన్నారు. ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో రెమ్‌డెసివిర్ వాడితే ఆస్పత్రిలో ఉండే సమయం తగ్గినట్టు అమెరికాలో చేసిన ఒక అధ్యయనంలో తేలినట్టు చెప్పారు.
కర్ణాటక రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర కోవిడ్ చరిత్రలోనే అత్యధికంగా 34,804 మంది కరోనా బారిన పడ్డారు. మరోవైపు 6,982 మంది కోలుకున్నారు. మరో 143 మంది ప్రాణాలు విడిచినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,39,201 మందికి కరోనా సోకింది. అందులో 10,62,594 మంది కోలుకున్నారు. 14,426 మంది కన్నుమూశారు. ఇప్పటికి 2,62,162 మంది కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 1,492 మంది ఐసీయూలో ఉన్నారు. తాజాగా జిల్లాల వారీగా మరణాలు చూస్తే బళ్లారిలో 16, మైసూరులో 9, కలబురిగిలో 7, ధారవాడలో 6, తుమకూరులో 6, హాసనలో 4, మండ్యలో 3, మిగతా జిల్లాల్లో ఇద్దరు, ఒకరు చొప్పున కన్నుమూశారు.
ఐటీ సిటీ బెంగుళూరు కరోనా ముట్టడితో నలిగిపోతోంది. నిత్యం కోవిడ్ విస్తరిస్తూనే ఉంది. తాజాగా 20,733 మంది కరోనా బారినపడగా, 2,285 డిశ్చార్జిలు, 77 మరణాలు నమోదయ్యాయి. నగరంలో ప్రస్తుతం 1,80,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్‌లో చిన్నారులు కూడా ఈ మహమ్మారి బారినపడటం ఆందోళన పెంచుతోంది. 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ఎక్కువగా కరోనా దాడి చేస్తోంది. 1–8 మధ్య వయసున్న వారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌లో పిల్లలకి కరోనా సోకడానికి డబుల్ మ్యూటెంట్ కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ వైరస్‌కి త్వరగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటుగా రోగనిరోధక వ్యవస్థని నిర్వీర్యం చేసే సామర్థ్యం కూడా ఉంది. దీంతో పిల్లల్లో ఈ వైరస్ సులభంగా సోకుతోందని వైద్యులు చెబుతున్నారు.