Coronavirus in India: దేశంలో సెకండ్ వేవ్ తగ్గినట్లే, కొత్తగా 1,14,460 కరోనా కేసులు, వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ జారీ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్, ఈనెల 14 వరకూ హిమాచల్ ప్రదేశ్‌లో లాక్‌డౌన్ పొడిగింపు
కోవిడ్ కోసం జూన్ 5 వరకు 36,47,46,522 నమూనాలను పరీక్షించామని, నిన్న ఒక్కరోజే 20,36,311 నమూనాలు పరీక్షించామని ఐసిఎంఆర్ తెలిపింది.
New Delhi, June 6: గత 24 గంటల్లో భారతదేశం 1,14,460 కొత్త కోవిడ్ -19 కేసులు (new COVID19 cases), 1,89,232 డిశ్చార్జెస్ మరియు 2677 మరణాలను (Covid deaths in India) నమోదు చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ కోసం జూన్ 5 వరకు 36,47,46,522 నమూనాలను పరీక్షించామని, నిన్న ఒక్కరోజే 20,36,311 నమూనాలు పరీక్షించామని ఐసిఎంఆర్ తెలిపింది.
తాజా మరణాలతో కలిపి మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,46,759కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 14,77,799 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,88,09,339 కి చేరుకున్నాయి. ఇప్పటివరకు 23,13,22,417 మందికి వ్యాక్సినేషన్ వేశారు.
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ ను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 14 వరకూ పొడిగించింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కరోనా కర్ఫ్యూను జూన్ 14 ఉదయం ఆరు గంటల వరకూ పొడిగించినట్టు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన అనంతరం వారికి టెలిఫోన్ లో వైద్య నిపుణులతో కన్సల్టేషన్ సేవలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
వ్యాక్సిన్ తయారీదారుల నుంచి నేరుగా వ్యాక్సిన్లను సేకరించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని నిర్ణయించింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ స్కూల్ బోర్డు నిర్వహించే పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇదిలా ఉంటే వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ జారీ చేయాలన్న ప్రతిపాదనను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. శుక్రవారం జరిగిన జీ-7 దేశాల ఆరోగ్య మంత్రుల సదస్సులో భారత్ తరఫున ఆతిధ్య హోదాలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ .. వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ అంటే అత్యంత వివక్షా పూరితమేనని స్పష్టం చేశారు. సంపన్న దేశాలతో పోలిస్తే, అభివ్రుద్ధి చెందుతున్న దేశాలు వ్యాక్సిన్ల పంపిణీ, సరఫరా, రవాణా, వ్యాక్సిన్ల సామర్థ్యం అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని హర్షవర్ధన్ గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ ప్రతిపాదన తేవడం అంటే వర్ధమాన దేశాల పట్ల వివక్ష ప్రదర్శించడమేనన్నారు.
మనదేశంలోనూ ఇప్పటివరకు మూడు శాతం జనాభాకు మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. వ్యాక్సిన్ల కొరతతోపాటు అభివ్రుద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్నది. మున్ముందు ముంచుకొచ్చే మహమ్మారులను ఉమ్మడిగా ఎదుర్కోవాలని హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. అయితే, పేద, అభివ్రుద్ధి చెందుతున్న దేశాలకు టీకాల పంపిణీపై ఈ సదస్సు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
Here's ANI Update
అన్ని దేశాలకు సమానంగా టీకాల పంపిణీపై కొత్త నిర్ణయాలు తీసుకోలేదు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ జారీ చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. టీకా వేయించుకున్నట్లు ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం సంబంధిత యాప్‌లో ఉంటుంది. దాన్ని బట్టి ఇతర దేశాలకు అనుమతించే విధానమే వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ అని చెప్పాలి.