New Delhi, June 6: కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమం ట్విట్టర్ మధ్య వార్ మరింత తీవ్రమవుతోంది. కొత్త డిజిటల్ (ఐటీ) నిబంధనల (New IT Rules) ప్రకారం దేశంలో భారత్‌కు చెందిన అధికారుల్ని నియమించకపోవడంతో ట్విట్టర్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనల్లో అమల్లోకి వచ్చి వారం రోజులు గడిచిపోయినా ట్విట్టర్ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో కేంద్ర ఐటీ శాఖ ఆ సంస్థకు చివరి హెచ్చరికగా శనివారం నోటీసులు (Govt Serves Final Notice to Twitter) జారీ చేసింది.
ట్విటర్‌లో నెటిజన్లు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి భారత్‌కు చెందిన అధికారుల్ని నియమించకపోతే ( Non-compliance of New IT Rules) తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ నోటీసులో హెచ్చరించింది. కాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకి సంబంధించి బ్లూ టిక్స్ బ్యాడ్జ్‌ని ట్విట్టర్ కొద్దిసేపు తొలగించి మళ్లీ పునరుద్ధించింది. ఇది జరిగిన కొద్ది గంట్లోలనే కేంద్రం ట్విటర్‌కి నోటీసులు పంపింది. కొత్త నిబంధనలు పాటించడానికి ట్విట్టర్ విముఖత చూపించడం భారతదేశ ప్రజల పట్ల ఆ సంస్థకు చిత్తశుద్ధి లేకపోవడాన్ని తేటతెల్లం చేస్తోందని పేర్కొంది.
ట్విట్టర్ వేదికగా భారత్ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు సరైన సమయంలో పారదర్శకంగా పరిష్కారమవ్వాలంటే దేశ పౌరులే అధికారులుగా ఉండాలని స్పష్టం చేసింది. ఇదే తాము ఇచ్చే చివరి నోటీసు అని తక్షణమే చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్లుగా భారతీయుల్ని నియమించకపోతే చట్టపరమైన చర్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో కేంద్రం హెచ్చరించింది.
నోటీసులో ఏముంది ?
భారత్‌లో దశాబ్దానికి పైగా పనిచేస్తున్న ట్విటర్ తీరు విస్మయం కలిగిస్తోంది. భారత ప్రజల సమస్యల్ని పారదర్శకంగా, వెంటనే పరిష్కరించే యంత్రాంగాన్ని సృష్టించేందుకు ట్విటర్ నిరాకరించడం నమ్మశక్యంగా లేదు. నిబంధనల్ని అనుసరించనందుకు గత నెల 26 నుంచే చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఆఖరి అవకాశం ఇస్తున్నాం. ఇకనైనా భారత నిబంధనల్ని అనుసరించకపోతే ఐటీ చట్టం, భారత శిక్ష్మాస్మృతి చట్టాల ప్రకారం పరిణామాలుంటాయి’’ అని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసుల్లో పేర్కొంది. అయితే.. ఏ తేదీలోపు చర్యలుంటాయన్నదానిపై స్పష్టతనివ్వలేదు.
Here's Govt Serves Final Notice to Twitter
Government of India gives final notice to Twitter for compliance with new IT rules. pic.twitter.com/98S0Pq8g2U
— ANI (@ANI) June 5, 2021
ఐటీచట్టం కింద జవాబుదారీ మినహాయింపు
ప్రస్తుతం సోషల్ మీడియా సంస్థలకు ఐటీచట్టం కింద జవాబుదారీ మినహాయింపు లభిస్తున్నది. అంటే, ఆ వేదికలపై యూజర్లు పోస్ట్ చేసే సమాచారానికి కంపెనీలు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. మినహాయింపును తొలగించటం అంటే.. ఇకపై ప్రతీ యూజర్ పెట్టే పోస్ట్‌కు, ట్వీట్‌కు ఆయా కంపెనీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఫిర్యాదులపై పోలీసులు క్రిమినల్ దర్యాప్తు చేపడితే ఆయా కంపెనీలు కూడా నిందితులుగా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వివాదం పెరిగిందిలా
కొత్త ఐటీ చట్టాలు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని ట్విట్టర్ ఇటీవల వ్యాఖ్యానించగా కేంద్రం తీవ్రంగా ఖండించింది. బీజేపీ నేతల ట్వీట్లపై ట్విట్టర్ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమైంది. దేశంలో కరోనా కట్టడిపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ ఓ డాక్యుమెంట్‌ను రూపొందించింది. దీనిపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలతో కూడిన ట్వీట్లకు ట్విట్టర్ ‘మానిప్యులేటెడ్ మీడియా’ అంటూ మార్క్ చేసింది.
కొత్త నిబంధనలేమిటి?
ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లో మరింత జవాబుదారీతనాన్ని తీసుకువచ్చే పేరుతో కేంద్రం కొత్త ఐటీ నిబంధనలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం..
దేశ సార్వభౌమత్వానికి, దేశంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే విధంగా ఉన్న పోస్టులను తొలుత ఎవరి నుంచి వచ్చాయో గుర్తించే వ్యవస్థను సోషల్‌మీడియా కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలి.
50 లక్షల యూజర్లు ఉన్న కంపెనీలు.. గ్రీవెన్స్ ఆఫీసర్‌ను, నోడల్ ఆఫీసర్‌ను, చీఫ్ కంప్లయెన్స్ ఆఫీసర్‌ను నియమించుకోవాలి. వీళ్లు భారతీయులై ఉండాలి.
అభ్యంతరకర కంటెంట్‌ను 36 గంటల్లో తొలిగించాలి. పోర్నోగ్రఫీకి సంబంధించిన కంటెంట్‌ను 24 గంటల్లో తొలిగించాలి.
ఫిర్యాదు వస్తే 24 గంటల్లో నమోదు చేసుకొని 15 రోజుల్లో పరిష్కరించాలి.
ట్విట్టర్ ఈ నిబంధనలను ఎందుకు వ్యతిరేకిస్తున్నది?
పోస్ట్ పెట్టిన వ్యక్తి ఎవరో గుర్తించి ఆ వివరాలు ప్రభుత్వానికి ఇవ్వటం అంటే.. తమ యూజర్లు ఇప్పుడున్నంత స్వేచ్ఛగా ఉండలేరని ట్విట్టర్ చెబుతున్నది.
కొత్త ఐటీ నిబంధనలు స్వేచ్ఛగా, బహిరంగంగా చర్చించుకోవటాన్ని అడ్డుకుంటాయని పేర్కొంది. ఇది అంతిమంగా దేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఒక హెచ్చరికలా మారుతాయని తెలిపింది.
భారతదేశంలోని పౌరసమాజంలోని పలువురు కూడా ఈ నిబంధనలను వ్యతిరేకిస్తున్నారని పేర్కొంది.
అంతర్జాతీయంగా తాము పాటిస్తున్న నిబంధనల మేరకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులను కొనసాగిస్తామని ప్రకటించింది.
ట్విట్టర్‌తోపాటు వాట్సాప్ కూడా కొత్త ఐటీ నిబంధనలను వ్యతిరేకిస్తున్నది. గూగుల్ వీటిని అమలుచేస్తామని ప్రకటించింది.
బ్లూటిక్ వివాదం
ఇదిలా ఉంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ట్విట్టర్ అకౌంట్లలో బ్ల్యూ బ్యాడ్జ్‌ను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. వెరిఫై చేసిన అకౌంట్లకు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జ్ ఇస్తుంది. అంటే సదరు వినియోగదారుడే ఈ ఖాతాను వాడుతున్నట్లు అధికారికంగా ధృవీకరించడమని అర్థం. శనివారం ఉదయం తొలుత వెంకయ్య వ్యక్తిగత ఖాతాకు బ్లూ బ్యాడ్జ్‌ను తొలగించిన ట్విట్టర్ తర్వాత పునరుద్ధరించింది. ఆరెస్సెస్ చీఫ్ భగవత్ వ్యక్తిగత ఖాతాతో పాటుగా ఇతర ఆరెస్సెస్ నేతలు సురేష్ సోని, అరుణ్‌కుమార్, సురేష్ జోషి, కృష్ణ గోపాల్ ఖాతాల్లో వెరిఫైడ్ బ్లూ టిక్స్‌ను తొలగించింది.
కాగా ఆరెస్సెస్ నేతల ఖాతాలకే ఇలా జరగడం వివక్షాపూరిత చర్యని ఆరెస్సెస్ ఢిల్లీ యూనిట్ నాయకుడు రాజీవ్ మండిపడ్డారు. టెక్ ఫ్యూడలిజానికి ట్విట్టర్ నిదర్శనంగా మారుతోందని విమర్శించారు. ట్విట్టర్ చర్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఆరు నెలల పాటు ఖాతాను వినియోగించకపోతే, ఎలాంటి ట్వీట్లు చేయకపోతే బ్లూ బ్యాడ్జ్ ఆటోమేటిక్‌గా తొలగిపోతుందని ట్విట్టర్ తెలిపింది. గత కొద్దికాలంగా వారెవరూ ట్వీట్లు చేయకపోవడంతో బ్ల్యూ టిక్స్ పోయాయని, ఇప్పుడు వాటిని పునరుద్ధరించామని వివరించింది.