London, June 5: భారత్‌లో అత్యంత వేగంగా వ్యాపించిన కొవిడ్ -19 డెల్టా వేరియంట్ (బీ1.617.2) (Delta Variant of COVID-19) ఇప్పుడు బ్రిటన్‌ను కలవరపెడుతోంది. ఆ దేశంలో ఈ వేరియంట్ వల్ల ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ (B1.617.2 Now Dominant in UK) పెరుగుతోంది. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) ప్రకారం డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్లు వారంలో 5,472కు పెరిగాయి. ఇప్పటివరకూ మొత్తం 12,431 కేసులు నమోదయ్యాయి. ఈ డెల్టా వేరియంట్ బ్రిటన్‌లో ఇప్పటికే ఉన్న ఆల్ఫా వేరియంట్‌ను అధిగమించే స్థాయికి చేరుకుందని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఈ డెల్టా వేరియంట్ మొట్టమొదట ఇంగ్లాండ్‌లోని కెంట్ రీజియన్‌లో బయటపడింది. అధికారిక గణాంకాల ప్రకారం, ఈ వారం డెల్టా వేరియంట్‌తో 278 మంది అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చేరారు. గత వారం 201 మంది హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. “ఈ వేరియంట్ ఇప్పుడు బ్రిటన్ అంతటా వ్యాపిస్తోంది.. మనమందరం వీలైనంత జాగ్రత్త వహించడం చాలా అవసరం” అని యూకే ఆరోగ్య భద్రతా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జెన్నీ హారిస్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆల్ఫా వేరియంట్‌తో పోల్చితే డెల్టా వేరియంట్‌తోనే ఆస్పత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉందని పీహెచ్ఈ తేల్చింది. దీంతో బ్రిటన్ అధికారులు అప్రమత్తమయ్యారు.
థర్ వేవ్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందనే వార్తల నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్‌కు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కఠినమైన సమీక్ష నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఏజెన్సీ చీఫ్ జూన్ రెయిన్ వెల్లడించారు. యురోపియన్ యూనియన్, అమెరికాల్లోనూ ఇలాంటి పరీక్షలు నిర్వహించారు. 12 నుంచి 15 ఏళ్ల పిల్లలపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్ డేటాను క్షుణ్నంగా పరిశీలించాం. ఫైజర్-బయోఎన్‌టెక్ కొవిడ్ వ్యాక్సిన్ ఈ వయసు పిల్లలకు పూర్తి సురక్షితమని గుర్తించాం. ఈ వ్యాక్సిన్ వల్ల కలిగే ముప్పుకంటే ప్రయోజనాలే అధికంగా ఉన్నాయి అని జూన్ రెయిన్ తెలిపారు.