India Covid Update: తగ్గుతున్న కేసులు..పెరుగుతున్న మరణాలు, 24 గంటల్లో 3,741 మంది మృతి, తాజాగా 2,40,842 మందికి పాజిటివ్, ఉత్తరాఖండ్‌లో చిన్నారులపై భీకర దాడి చేస్తోన్న కరోనా
వరసగా ఏడో రోజు 3 లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు (India Covid Update) నమోదయ్యాయి. అయితే పాజిటివ్ కేసులు తగ్గినా.. మరణాలు ఆగడం లేదు.
New Delhi, May 23: దేశంలో రెండో విడత కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. వరసగా ఏడో రోజు 3 లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు (India Covid Update) నమోదయ్యాయి. అయితే పాజిటివ్ కేసులు తగ్గినా.. మరణాలు ఆగడం లేదు. గత 24 గంటల్లో దేశంలో 21,23,782 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,40,842 మందికి పాజిటివ్‌గా (New COVID-19 Cases) నిర్థారణ అయ్యింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గత 24 గంటల్లో కరోనా బారిపడి 3,741 మంది మృతి (3,741 Deaths in Past 24 Hours) చెందగా, ఇప్పటివరకు దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,99,266కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,55,102 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 2,34,25,467 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 28,05,399 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్‌లో ఇప్పటివరకు 32,86,07,937 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 16,04,542 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. దేశంలో ఇప్పటివరకు 19,50,04,184 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు.
హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో కరోనా మహమ్మారి చిన్నారులపై ప్రతాపం చూపిస్తున్నది. కేవలం ఇరవై రోజుల్లోనే పది వేలకుపైగా బాలలు కరోనా బారినపడ్డారు. స్టేట్ కొవిడ్ కంట్రోల్ రూమ్ గణాంకాల ప్రకారం.. మే 1 నుంచి 20 మధ్య 9 ఏండ్లలోపు చిన్నారులు 2044 మందికి కరోనా సోకింది.
అదేవిధంగా 10 నుంచి 19 ఏండ్ల టీనేజర్లు 8661 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించింది. అదేవిధంగా రాష్ట్రంలో గత 20 రోజుల్లో 1,22,949 మందికి మహమ్మారి సోకిందని తెలిపింది. కాగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 3626 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,07,566కి చేరింది. ఇందులో 63,373 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 2,38,593 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5600 మంది కరోనా వల్ల మరణించారు.