New Delhi, May 22: భారత దేశంలో కరోనావైరస్ రెండో దశతో వణుకుతుంటే దీనికి తోడుగా ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల ముప్పు భయపెడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ (Black Fungus vs White Fungus) కేసులు, మరణాలు చోటుచేసుకుంటుండగా కొత్తగా వైట్ ఫంగస్ (White Fungus & Black Fungus) వెలుగులోకి రావడం కలవరపాటుకు గురిచేస్తోంది. బిహార్‌లో పాట్నా మెడికల్ కాలేజీలో నలుగురిలో వైట్ ఫంగస్ గుర్తించారు. కాగా బ్లాక్ ఫంగస్ కంటే ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైట్ ఫంగస్ ఉన్న నలుగురికీ కరోనా నిర్దారణ కాకపోయినా.. కోవిడ్ లక్షణాలు మాత్రం గుర్తించారు.
ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 70 ఏళ్ల వ్యక్తిలో తెల్ల ఫంగస్ కేసు (White Fungus) కనుగొనబడిందని వైద్యులు తెలిపారు. అతను ఢిల్లీలో కోవిడ్ -19 చికిత్స పొందాడని, అతను కోలుకున్న తరువాత డిశ్చార్జ్ అయ్యాడని వైద్యులు వెల్లడించారు. వైట్ ఫంగస్ అసలు పేరు కాండిడా అల్బికాన్స్. ఇది సోకడం వల్ల నోటిలో అంగిలి, నాలుక, చర్మం, జననేంద్రియాలు.. తదితర ప్రాంతాల్లో తెల్లటి మచ్చలు వస్తాయి.
పాట్నా మెడికల్ కాలేజీ మైక్రోబయాలజీ విభాగం చీఫ్ డాక్టర్ ఎస్‌ఎన్ సింగ్ మాట్లాడుతూ.. నాలుగు వైట్ ఫంగస్ కేసులు గుర్తించినట్టు తెలిపారు. ఈ నలుగురు రోగుల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించినప్పటికీ పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. నలుగురు రోగుల పరిస్థితి నిలకడగా ఉందని, యాంటీ ఫంగల్ ఔషధాలను వినియోగిస్తున్నామని తెలిపారు. ఆక్సిజన్ పరికరాలు, వెంటిలేటర్లను తరుచూ శుభ్రం చేయాలని సూచించారు.
ఇదిలా ఉంటే బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఊపిరితిత్తులపైనే కాకుండా గోళ్లు, చర్మం, పొట్ట, కిడ్నీలు, మెదడు, మర్మాంగాలు, నోరు భాగాలపై కూడా ఈ వైరస్ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. కరోనా వైరస్ బారినపడిప్పుడు కనబడుతున్న లక్షణాలే ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకినప్పడు కూడా కనబడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఇది ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని, HRCT (హెచ్‌ఆర్‌సీటీ) టెస్ట్ చేయడం ద్వారా దీన్ని గుర్తించవచ్చని చెబుతున్నారు.
బ్లాక్ ఫంగస్ సోకిన మాదిరిగానే రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని, డయాబెటిస్, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల వైట్ ఫంగస్ సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. వైట్ ఫంగస్ రోగుల ఊపిరితిత్తులను నేరుగా ప్రభావితం చేస్తుంది. వైద్యులు ప్రకారం.. క్యాన్సర్ రోగులు, పిల్లలు, మహిళలు వైట్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఏమిటీ వైట్ ఫంగస్?
సాధారణంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధకత తక్కువగా ఉన్నవారు, మధుమేహంతో బాధపడేవారు, కరోనా చికిత్సలో స్టెరాయిడ్లు వాడిన వారికి బ్లాక్ ఫంగస్ సోకుతోంది. అయితే వైట్ ఫంగస్ అలా కాదు. కరోనాతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇది వ్యాప్తిచెందుతోంది. కాగా ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా నెగటివ్ రిపోర్టు వచ్చింది. కానీ, సీటీస్కాన్‌లో వైట్ ఫంగస్ ఆనవాళ్లను గుర్తించామని పాట్నా మెడికల్ కాలేజీ మైక్రో బయాలజీ చీఫ్ డాక్టర్ ఎస్.ఎన్.సింగ్ తెలిపారు.
బ్లాక్ ఫంగస్ ముఖ భాగాన్ని దెబ్బతీస్తుందని, ముక్కు ద్వారా కళ్లకు, మెదడుకు ఇన్ఫెక్షన్ అవుతుందని.. అయితే వైట్ ఫంగస్ ప్రధానంగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే.. ఊపిరితిత్తుల నుంచి గోళ్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, పునరుత్పత్తి అవయవాలు, నోటికి వ్యాపించే ప్రమాదముంది’’ అని వివరించారు. బ్లాక్ ఫంగస్ ప్రధానంగా ఊపిరితిత్తులు, నోరు, కళ్లు, ముక్కు, మెదడు వంటి భాగాలపై ఎక్కువ ప్రభావం చూపితే.. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులతో పాటు కడుపు, పేగులు, కిడ్నీలు, చర్మం, గోర్లు, జననేంద్రియాలకూ సోకుతుంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. మహిళలు, చిన్న పిల్లల్లోనూ ఇది ప్రభావం చూపిస్తుంది.
ఎలా గుర్తిస్తారు?
ఎక్స్‌రే, సీటీస్కాన్ ద్వారా వైట్ ఫంగస్‌ను గుర్తించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైట్ ఫంగస్ సోకిన వారికి సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. ఇందుకోసం యాంటీ-ఫంగల్ ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుంది’’ అని తెలిపారు. అదే సమయంలో తగిన పోషకాహారం తీసుకోవడం, వీలైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
లక్షణాలు ఎలా ఉంటాయి?
నోటిలో, గొంతులో, నాలికపై కురుపులు, తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. సైనస్ వాపు, గొంతునొప్పి ఉంటుంది. తీవ్రంగా ఆయాసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. జననేంద్రియాలు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఈ లక్షణాలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. పేగులకు ఫంగస్ ఇన్‌ఫెక్ట్ అయితే మలబద్ధకం, గ్యాస్, డయేరియా లక్షణాలు ఉంటాయి. బాహుమూలాలు, మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. కీళ్లనొప్పులు తలెత్తుతాయి.
ముప్పు ఎవరికి?
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారు, మధుమేహ వ్యాధిగ్రస్థులు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్, మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న వారికి వైట్ ఫంగస్‌తో ముప్పు ఎక్కువగా ఉంటుంది. కొవిడ్ రోగులకు కూడా ఈ ముప్పు ఉంటుందని డాక్టర్ ఎస్.ఎన్.సింగ్ వివరించారు. ‘‘కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించేప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. వైట్ ఫంగస్ సోకే ప్రమాదం ఉంటుంది. ఆక్సిజన్ తయారీలో కుళాయి నీళ్లు వాడితే.. వైట్ ఫంగస్ వచ్చే ముప్పు ఎక్కువ. ఆక్సిజన్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కాబట్టి.. ఆ ప్రాంతంలో వైట్ ఫంగస్ తిష్టవేస్తుంది’’ అని ఆయన వెల్లడించారు.
ఈ వైట్ ఫంగస్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ఇది సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని వైద్యులు స్పష్టం చేశారు. వైట్ ఫంగస్ కంటే బ్లాక్ ఫంగస్ చాలా ప్రమాదకరమని వెల్లడించారు. కాన్డిడియాసిస్ ఇన్ఫెక్షన్ సర్వసాధారణమైన ఓరల్ థ్రష్ అని వైద్యులు తెలిపారు. వైట్ ఫంగస్ గురించి ఆందోళన చెందవద్దని, ఇది కాన్డిడియాసిస్, కాండిడా అనే రకమైన ఫంగస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ అని అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఈశ్వర్ గిలాడా తెలిపారు. వైట్ ఫంగస్ ప్రమాదకరమని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.
కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ముకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సమస్య. పర్యావరణంలోని శిలీంధ్ర బీజాంశాలతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ప్రజలు మ్యూకోమైకోసిస్ బారినపడుతున్నారు. కట్, స్క్రాప్, బర్న్ లేదా ఇతర రకాల చర్మ గాయం ద్వారా ఫంగస్ చర్మంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఇది చర్మంపై అభివృద్ధి చెందుతుంది. కోవిడ్ -19 నుంచి కోలుకుంటున్న లేదా కోలుకున్న రోగులలో ఈ వ్యాధి కనుగొనబడింది. అంతేగాక, డయాబెటిస్ ఉన్నవారు, రోగనిరోధక శక్తి సరిగ్గా పనిచేయని ఎవరైనా ఈ వ్యాధి పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, బ్లాక్ ఫంగస్ కారణంగా కొందరు కంటిచూపు కోల్పోవడం, ముఖ భాగంలో ఉబ్బడం లాంటి తీవ్ర పరిణామాలుంటున్నాయి.