New Delhi, May 22: దేశంలో గడచిన 24 గంటల సమయంలో కొత్తగా 2,57,299 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus) అయింది. నిన్న ఒక్కరోజే 3,57,630 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,62,89,290కు చేరింది. మరో 4,194 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 2,95,525కు ( Coronavirus Cases in India) పెరిగింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,30,70,365 మంది కోలుకున్నారు. 29,23,400 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 19,33,72,819 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 32,64,84,155 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,66,285 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
సెకండ్ వేవ్ సమయంలోనూ కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 32 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడి కాగా, 353 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని సీఎం యడియూరప్ప నిర్ణయించారు. జూన్ 7 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. నిత్యావసర వస్తువులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని పోలీసులకు, అధికారులకు స్పష్టం చేశామని, ఆ మేరకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. కర్ణాటకలో మే 10 నుంచి 24వ తేదీ వరకు తొలుత లాక్ డౌన్ ప్రకటించినా, కేసుల ఉద్ధృతితో పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.
గడచిన 40 రోజుల్లో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గతంతో పోలిస్తే 50 శాతం మేరకు పడిపోయింది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుండటం, మరోవైపు వ్యాక్సినేషన్ మందగించడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగింది. అయితే మే మాసం వచ్చే నాటికి రోజువారీ అందించే వ్యాక్సినేషన్ మోతాదుల సంఖ్య సగానికి పడిపోయింది. దేశంలో మే 1 నుంచి 18 సంవత్సరాలు దాటిన వారికి టీకాలు వేయడం ప్రారంభించారు.
ఏప్రిల్ 10 న ఒకే రోజులో అత్యధికంగా 36,59,356 టీకాలు వేశారు. ఇదే ఇప్పటివరకు అత్యధికంగా టీకాలు వేసిన రోజు. అయితే ఆ తరువాత నుంచి రోజువారీ టీకాలు వేసే మోతాదుల సంఖ్య దిగజారింది. మే 21 న ఇరవై నాలుగు గంటల్లో 17,97,274 మోతాదుల టీకాలు మాత్రమే వేశారు. గడచిన 40 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ 50.88 శాతానికి పడిపోయింది. గడచిన ఏప్రిల్‌లో దేశంలో రోజుకు సగటున 30,24,362 మోతాదులు టీకాలు ఇచ్చారు. మేలో ఈ సంఖ్య రోజుకు సగటున 16,22,087 మోతాదులకు పడిపోయింది. కోవిడ్ 19 ఇండియా ఆర్గనైజేషన్ వెల్లడించి వివరాల ప్రకారం మే 1 నుంచి మే 20 మధ్యకాలంలో రోజువారీ టీకాల సంఖ్య 20 లక్షల కంటే తక్కువగానే నమోదవుతూ వస్తోంది. వ్యాక్సిన్ల కొరతతో పలు వ్యాక్సినేషన్ సెంటర్లు మూతపడ్డాయి