Coronavirus Outbreak in India: అత్యంత ప్రమాదకరంగా ఎన్440కే వైరస్, దేశంలోకి కరోనా థర్డ్ వేవ్ ఎంటర్ కాబోతుందని తెలిపిన ఎయిమ్స్ డైరక్టర్, ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాపిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్, దేశంలో తాజాగా 3,82,315 మందికి కరోనా నిర్ధారణ
వాస్తవానికి దీన్ని సీసీఎంబీ (CCMB) శాస్త్రవేత్తలు దక్షిణాదిలో తొలి వేవ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలోనే కనుగొన్నారు. అయితే, ఇది ప్రస్తుతం మరింత రూపాంతరం చెందుతున్న ఆనవాళ్లు లేవని పరిశోధకులు తెలిపారు.
New Delhi, May 5: భారత్‌లో నిన్న కొత్తగా 3,82,315 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,38,439 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,65,148కు (COVID-19 in India) చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 3,780 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,26,188 కు (Covid Deaths in India)పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,69,51,731 మంది కోలుకున్నారు. 34,87,229 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,04,94,188 మందికి వ్యాక్సిన్లు వేశారు.
ఇదిలా ఉంటే సెకండ్ వేవ్ లో (Coronavirus Second Wave) భారత్‌లో పలు చోట్ల ఎన్440కే (N440k) అనే రకం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి దీన్ని సీసీఎంబీ (CCMB) శాస్త్రవేత్తలు దక్షిణాదిలో తొలి వేవ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలోనే కనుగొన్నారు. అయితే, ఇది ప్రస్తుతం మరింత రూపాంతరం చెందుతున్న ఆనవాళ్లు లేవని పరిశోధకులు తెలిపారు.
ఎన్440కే వేరియంట్ గతంలో వెలుగులోకి వచ్చిన వాటితో పోలిస్తే 15 రెట్లు ప్రాణాంతకమైందని నిపుణులు తెలిపారు. రెండో దశలో ప్రబల రూపకంగా ఉన్న డబుల్ మ్యూటెంట్ రకాలైన బీ1.617, బీ1.618 కంటే కూడా ఎన్440కే బలమైందని తెలిపారు. తొలి వేవ్ ఉనికిలో ఉన్న సమయంలో ఎన్440కే ఆందోళన కలిగించిందని.. కానీ, అది క్రమంగా తాజా డబుల్ మ్యూటెంట్ల స్థానాన్ని చేరుతోందని తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతున్న తరుణంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా మరో కీలక విషయం వెల్లడించారు. భారత్‌లో మూడో వేవ్ వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపారు. వైరస్ ఇలాగే వృద్ధి చెంది రోగనిరోధక వ్యవస్థను సైతం తప్పించుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటే మూడో వేవ్ తప్పదన్నారు. అయితే, అప్పటికల్లా చాలా మందికి వ్యాక్సిన్లు అందే అవకాశం ఉందని.. మూడో వేవ్ ప్రస్తుతం ఉన్నంత తీవ్రంగా ఏమీ ఉండకపోవచ్చునని అంచనా వేశారు.
తొలి వేవ్‌తో పోలిస్తే ప్రస్తుతం వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. వైరస్‌లో మార్పులు చోటుచేసుకుంటుండడం కూడా వేగవంతమైన వ్యాప్తికి ఒక కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ లాక్‌డౌన్ విధించాల్సి వస్తే కనీసం రెండు వారాల పాటు విధించాలని గులేరియా అభిప్రాయపడ్డారు. అదీ చాలా కఠినంగా అమలు చేయాలన్నారు. వారాంతపు లాక్‌డౌన్లు, రాత్రిపూట కర్ఫ్యూల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చునన్నారు.
టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ) సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో వ్యాప్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఎంతో ప్రమాదకరం అని పరిశోధకులు వెల్లడించారు. ఇది ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాప్తి చెందుతోందని, ఆ ముగ్గురి నుంచి అది మరింతమందికి వ్యాపిస్తోందని వివరించారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తోందని, తొలి దశ కంటే రెండో దశ వైరస్ 2 నుంచి 2.5 రెట్లు అధిక శక్తిమంతమైనదని తెలిపారు.
ఈ కొత్త వేరియంట్ కారణంగా కేసులే కాదు, మరణాలు కూడా పెరుగుతున్నాయని టాటా ఇన్ స్టిట్యూట్ ప్రాజెక్ట్ సమన్వయకర్త సందీప్ జునేజా పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కొవిడ్ మృత్యుఘంటికలు మోగించడానికి గల కారణాలను పరిశోధిస్తున్నామని పరిశోధక బృందం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ఇదే ఊపులో కొనసాగితే జూన్ 1 నాటికి కరోనా మరణాల సంఖ్య అదుపులోకి వస్తుందని పేర్కొంది.