kolkata, May 4: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో భారీ హింసాకాండ (West Bengal Post-Poll Violence) చెలరేగిన సంగతి విదితమే. ఈ హింసలోదాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన (PM Narendra Modi Expressed Serious Anguish) వ్యక్తం చేశారని గవర్నరే ట్విటర్ ద్వారా వెల్లడించారు.
రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతలపై ఫోన్‌లో ప్రధాని తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసినట్లు గవర్నర్ జగ్‌దీప్ (Governor Jagdeep Dhankhar) ఆ ట్వీట్‌లో తెలిపారు. కాగా ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన తర్వాత బెంగాల్‌లో హింస చెలరేగింది.
ఈ హింసపై స్పందించిన మోదీ మంగళవారం గవర్నర్‌కు ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీసిన తర్వాత గవర్నర్ జగ్‌దీప్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో హింస, విధ్వంసం, లూటీ, దహనాలు, హత్యలు నిరంతరాయంగా కొనసాగుతుండటంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.
Here's Governor West Bengal Jagdeep Dhankhar Tweet
PM called and expressed his serious anguish and concern at alarmingly worrisome law & order situation @MamataOfficial
I share grave concerns @PMOIndia given that violence vandalism, arson. loot and killings continue unabated.
Concerned must act in overdrive to restore order.
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 4, 2021
ఇదిలా ఉంటే ప్రధాని ఈ స్టంట్లు ఆపి ముందు ఇండియాలో కొవిడ్ పరిస్థితులపై దృష్టి సారించాలని టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రైన్ ట్వీట్ చేశారు. అందులో ఢిల్లీలో ల్యాండైన 300 టన్నుల కొవిడ్ ఎమర్జెన్సీ సరఫరాలు ఏమయ్యాయి అన్న ఓ న్యూస్ రిపోర్ట్‌ను పోస్ట్ చేశారు. కొవిడ్ పరిస్థితులు లేదా దీనిపై ముందు దృష్టి సారించండి అని ప్రధానికి సూచించారు.
Here's TMC MP Derek O'Brien Tweet
PM makes a call to West Bengal governor on ‘political violence’. (Exaggerated 214%)
Stop the stunts, Mr Prime Minister. Work the phones on #COVID19India or this👇https://t.co/6uysFn4cQO
— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) May 4, 2021
ఇక పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే బెంగాల్‌లో చెలరేగిన హింస తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ ఘటనలు తమను చాలా బాధించాయని చెప్పారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు దేశ విభజన సమయంలో మాత్రమే జరిగినట్లు తాను విన్నానని జేపీ నడ్డా చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఇలాంటి హింస చెలరేగడం స్వాతంత్య్ర భారతదేశంలో మనం ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. కోల్‌కతాలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్లో సోమవారం భారీ హింసాకాండ: ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో సోమవారం భారీ హింసాకాండ చెలరేగింది. కోల్‌కతా, చుట్టు పక్కల ప్రాంతాల్లో దుండగులు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. బీజేపీ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. దుకాణాలను దోచుకొన్నారు. హింసాకాండలో ఓ మహిళ సహా ఆరుగురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారని ఆ పార్టీ తెలిపింది. తృణమూల్ గూండాలే హింసకు కారణమని ఆరోపించింది. హింసాకాండ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
దుండగులు పిల్లలపై, జంతువులపై కూడా దాడులు జరిపారని బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలూనీ వీడియోలు ట్వీట్ చేశారు. గాయాలతో ప్రజలు పారిపోతున్న దృశ్యాలు వీడియోల్లో ఉన్నాయి. బెంగాల్‌లో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. మరోవైపు, తమ కార్యకర్తలు ముగ్గుర్ని బీజేపీ కార్యకర్తలు చంపేశారని తృణమూల్ ఆరోపించింది. హింసాకాండను సీఎం మమత ఖండించారు.
తృణమూల్ కార్యకర్తలు సంయమనం పాటించాలని, బీజేపీ కార్యకర్తలు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని సూచించారు. ఈ హింసాకాండపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీజేపీ నేత గౌరవ్ భాటియా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఈ నెల 5వ తేదీన దీదీ ప్రమాణ స్వీకారం: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఈ నెల 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమత వరుసగా మూడో విడత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్‌నుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆమె రాజీనామాను ఆమోదించినట్లు గవర్నర్ ట్విట్టర్‌లో తెలిపారు.
రిటర్నింగ్ అధికారికి చావు భయం: నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు వచ్చాక రీకౌంటింగ్ జరపాల్సిందేనని డిమాండ్‌లు వచ్చినప్పటికీ అక్కడి రిటర్నింగ్ అధికారి అందుకు ఒప్పుకోకపోవడానికి గల కారణాలు ఇవేనంటూ మమత కొన్ని విషయాలు చెప్పారు. ‘‘రీకౌంటింగ్ జరపండి అంటూ ఒకవేళ తాను ఆదేశిస్తే తీవ్రమైన పరిణామాలను తాను ఎదుర్కోవాల్సి రావచ్చు. తీవ్ర ‘ఒత్తిడి’కారణంగా ఒకవేళ ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తానేమో’’అని రిటర్నింగ్ అధికారి తీవ్ర ఆందోళనకు గురైనట్లు మమత మీడియా సమావేశంలో చెప్పారు. అందుకు సాక్ష్యంగా మమత ఒక ఎస్‌ఎంఎస్‌ను మీడియాకు చూపించారు.
రిటర్నింగ్ అధికారి ఆ ఎస్‌ఎంఎస్‌ను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు పంపారని మమత చెప్పారు. ‘ముందుగా వెల్లడైన ఫలితాల ప్రకటన కేంద్ర ఎన్నికల సంఘం ఎలా మారుస్తుంది? ఈ అంశంలో మేం కోర్టుకు వెళ్తాం. నాలుగుగంటలపాటు సర్వర్ డౌన్ ఎందుకైంది? ప్రజాతీర్పును మేం గౌరవిస్తాం. కానీ ఒక అసెంబ్లీ స్థానంలోనే అవకతవకలు జరిగాయి. వాస్తవాలు మాకు తెలియాలి. రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు వార్తలొచ్చాయి. టీఎంసీ కార్యకర్తలంతా ప్రశాంతంగా ఉండాలి’ అని మమత మీడియా సమావేశంలో అన్నారు.
రేపు దేశ వ్యాప్తంగా ధర్నా: ఈ పరిస్థితులు ఇలా ఉంటే రేపు దేశ వ్యాప్తంగా ధర్నాలకు దిగుతామని బీజేపీ ప్రకటన చేసింది.ఫలితాలు వెలువడిన అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ నేతలు, కార్యకర్తలు, కార్యాలయాలపై టీఎంసీ కార్యకర్తలు దాడులు చేశారని మండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే రేపు దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు బీజేపీ పిలుపునిచ్చింది. కరోనా నిబంధనలను పాటిస్తూ దేశ వ్యాప్తంగా తమ పార్టీ నేతలు, కార్యకర్తలు వారి ప్రాంతాల్లో ధర్నాలకు దిగుతారని వివరించింది.