Kolkata, May 3: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తల్లకిందులు చేస్తూ..పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) హ్యాట్రిక్ కొట్టారు. తృణమూల్ కాంగ్రెస్‌కు (Trinamool Congress (TMC)ఒంటిచేత్తో వరుసగా మూడోసారి కూడా అప్రతిహత విజయాన్ని సాధించిపెట్టారు. ప్రధాని మోదీ, కేంద్ర హో మంత్రి అమిత్ షా (PM Modi-sha) హవా ఇక్కడ సాగలేదు. 294 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి 200 సీట్లు గెలవాలన్న నినాదం ఏమాత్రం పనిచేయలేదు సరికదా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయాలను కూడా బీజేపీ (Bharatiya Janata Party (BJP) ఈ ఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయింది.
నందిగ్రామ్‌లో నామినేషన్ల దాఖలు సందర్భంగా కాలికి గాయమైనప్పటికీ.. వీల్ చైర్‌లో మమత రాష్ట్రమంతటా పర్యటించి ఒంటిచేత్తో టీఎంసీని విజయపథాన నడిపారు. తాను నందిగ్రామ్‌లో స్వల్పతేడాతో ఓడినప్పటికీ.. తన పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించేందుకు కృషిచేశారు. నిన్నటివరకు ప్రతిపక్షాలుగా చలామణి అయిన కాంగ్రెస్, సీపీఎం దాదాపు కనుమరుగయ్యాయి. వీటికి ఒక్క సీటు కూడా దక్కలేదు.
ఇక్కడ మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తుది ఫలితాలు వెలువడే సరికి.. వాటిలో, ఏకంగా 213 సీట్లలో తృణమూల్ ఘన విజయం సాధించింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సాధించి హ్యాట్రిక్ కొట్టింది. ఇతర రాష్ట్రాల తరహాలో ముస్లిముల ఓట్లు చీలిపోకుండా అడ్డుకోవడంలో మమత విజయం సాధించారని, ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్న ముస్లిములంతా తృణమూల్‌కే ఓటేశారని విశ్లేషిస్తున్నారు. కాకపోతే, తృణమూల్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన సువేందు అధికారితో నువ్వానేనా అన్నట్లుగా నందిగ్రామ్‌లో బరిలోకి దిగిన మాత్రం మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బెంగాల్లో అనూహ్యంగా 42 స్థానాలకు 18 గెలుచుకుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి 77 స్థానాలను కైవసం చేసుకుని ఉనికిని బలంగా చాటింది. కానీ, హైటెన్షన్ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. బెంగాల్లో రెండేళ్ల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 18 ఎంపీ సీట్లను బీజేపీ, 22 ఎంపీ సీట్లను తృణమూల్ గెలుచుకున్నాయి. అంటే, దాదాపు 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పట్లో బీజేపీ పాగా వేసింది. కానీ, రెండేళ్లలోనే దాదాపు 46 స్థానాల్లో కమలం ప్రభ తగ్గిపోయినట్లు చెబుతున్నారు.
2019లో టీఎంసీకి 43.3 శాతం ఓట్లు రాగా.. ఇప్పుడు దరిదాపుగా ఐదు శాతం పెంచుకుని 48.06 శాతం సాధించింది. అప్పట్లో 40.7 శాతం ఓట్లు సాధించిన బీజేపీ... ఇప్పుడు 37.86 శాతమే పొందింది. అంటే 2.9 శాతం ఓట్లు కోల్పోయింది.
శూన్యంగా మిగిలిన కాంగ్రెస్, వామపక్షాలు
ఇక, ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్.. రెండున్నర దశాబ్దాలపాటు అప్రతిహతంగా చక్రం తిప్పిన వామపక్షాలు బెంగాల్లో నామరూపాల్లేకుండాపోయాయి. వామపక్షాలు కనీసం ఖాతా కూడా తెరవలేదు. గత ఎన్నికల్లో 44 సీట్లు గెలిచి రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్.. 33 స్థానాల్లో గెలిచిన వామపక్షాలు ఇప్పుడు ‘శూన్యం’గా మిగిలాయి.
పశ్చిమ బెంగాల్‌ను 1977 నుంచి 2011 దాకా.. 34 ఏళ్లపాటు అప్రతిహతంగా పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ నేడు దయనీయ స్థితికి దిగజారింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని పోటీ చేసినా ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేక చతికిలపడింది. ప్రజా ఉద్యమాలు, భూ సంస్కరణలతో ఒకప్పుడు బెంగాలీల మనసు గెలుచుకొని సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు ఘోర పరాజయానికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్‌లోని ప్రధాన పార్టీలు సీపీఎం, సీపీఐ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్‌బీ), రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ(ఆర్‌ఎస్పీ). 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నాలుగు పార్టీలు కలిసి బెంగాల్‌లో 50.7 శాతం ఓట్లు సాధించగా, 2009 ఎన్నికల్లో 43.3 శాతం ఓట్లు దక్కించుకోగలిగాయి. 2007లో జరిగిన నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక పోరాటంలో తృణమూల్ అధినేత మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరించారు. 2008లో పంచాయతీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలను మట్టికరిపించారు. నందిగ్రామ్ ఉద్యమం తర్వాత రాష్ట్రంలో చాలా వర్గాలు కమ్యూనిస్టులకు దూరమయ్యాయి.
2011లో సీపీఐ 2, సీపీఎం 40 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. మొదటిసారిగా తృణమూల్ అధికారంలోకి వచ్చింది. 2016 శానసనభ ఎన్నికల్లో సీపీఐ ఒక్కటి, సీపీఎం 26 స్థానాలకే పరిమితమయ్యాయి. ఓట్ల శాతం భారీగా తగ్గింది. ఇప్పుడు ఖాతా కూడా తెరవలేదు. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్ కూటమి కేవలం 2 సీట్లు గెలుచుకొని, 29.71 శాతం ఓట్లు సాధించగా, 2019లో ఒక్క స్థానం కూడా సొంతం చేసుకోలేకపోయింది. ఓట్ల శాతం 6.34 శాతానికి పడిపోయింది.
మమతాబెనర్జీ రాజకీయ ప్రస్థానం
మమతాబెనర్జీ.. 45 ఏళ్ల రాజకీయ జీవితం.. 7 సార్లు ఎంపీ.. మూడు సార్లు కేంద్రమంత్రి.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. నిత్యం పోరాటాలతోనే గడిపారు. బెంగాల్లో 34 ఏళ్ల కమ్యూనిస్టు కోటను కుప్పకూల్చింది. దేశ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. దేశమంతా ప్రేమగా ‘దీదీ’ అని పిలుచుకునే ఈ 66 ఏళ్ల యోధురాలు.. తన 21వ ఏటనే రాజకీయ ప్రవేశం చేశారు. 1975లో సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణకు వ్యతిరేకంగా ఆయన కారుపైకే ఎక్కి నృత్యం చేయడం ద్వారా నాటి కాంగ్రెస్ నాయకుల దృష్టిలో పడ్డారు. 1976లో ఆ పార్టీలో చేరి.. అతి కొద్ది కాలంలోనే అగ్రనాయకురాలిగా ఎదిగారు.
1984లో నాటి కమ్యూనిస్ట్ దిగ్గజం సోమ్‌నాథ్ చటర్జీని ఓడించి.. తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు మంత్రివర్గంలో మానవవనరుల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కమ్యూనిస్టులను బద్ధ శత్రువులుగా భావించే ఆమె.. వారితోనే చేతులు కలిపిన నాటి కాంగ్రెస్ అధినాయకత్వంతో విభేదించి.. ఆ పార్టీని వీడి 98లో తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. 99లో వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ రైల్వే మంత్రిగా పనిచేశారు. అనంతరం 2001లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలు గెలిచి.. అధికార సీపీఎంకు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచారు. చివరకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీని చిత్తు చేసి.. వరుసగా మూడోసారి గెలిచారు.
తృణమూల్‌కు జై కొట్టిన ముస్లిం ఆధిక్య జిల్లాలు
కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న ముస్లిం ఆధిక్య జిల్లాలైన మాల్దా, ముర్షీదాబాద్‌లు ఈసారి తృణమూల్‌కు జై కొట్టాయి. ఈ రెండు జిల్లాల్లో టీఎంసీకి పెద్దగా పట్టులేదు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మాల్దా జిలాల్లోని 12 సీట్లలో టీఎంసీ ఒక్క సీటూ గెలువలేదు. ముర్షీదాబాద్‌లోని 22 స్థానాల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. ఈ రెండు జిల్లాల్లోని 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 స్థానాల్లో (మాల్దాలో 7, ముర్షీదాబాద్‌లో– 14) నెగ్గింది. 2011 ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో కాంగ్రెసే విజయ ఢంకా మోగించింది.
2021 ఎన్నికల నాటికి పరిస్థితి తారుమారైంది. ఈ ప్రాంతంలో అనూహ్యంగా తృణమూల్ పుంజుకుంది. రెండు జిల్లాల్లోని 32 స్థానాల్లో 24 సీట్లలో టీఎంసీ విజయం సాధించింది. పోటీలో ఉన్న వారిలో ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో శంషేర్‌గంజ్, జంగీపూర్ స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 8 సీట్లలో విజయం సాధించి బీజేపీ కూడా ఈ ప్రాంతంలో గణనీయ స్థాయిలో బలపడింది. ముస్లిం జనాభా మెజారిటీగా ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్‌ఎఫ్ కూటమి ఈ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించకపోవడం గమనార్హం.