COVID in India: భారత్‌ని వణికిస్తున్న XBB.1.16 వేరియంట్, మరణాలకు, కేసుల పెరుగుదలకే కారణం ఇదేనని నిర్థారించిన WHO, దేశంలో కొత్తగా 3,823 కేసులు
మొన్నటి వరకు వందల్లో నమోదైన పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 4వేలకు చొరవైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,823 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
New Delhi, April 2: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది. మొన్నటి వరకు వందల్లో నమోదైన పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 4వేలకు చొరవైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,823 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 18,389 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. ఇక, శనివారంతో పొల్చితే పాజిటివ్ కేసుల సంఖ్య 27 శాతం పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక, శనివారం దేశవ్యాప్తంగా 2,995 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, వైరస్ బారినపడి ఇప్పటి వరకు 5,30,881 మృతిచెందినట్టు పేర్కొంది.
పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 రూపాంతరమే కారణమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు అధ్యయనాలు వేరియంట్ ఇన్ఫెక్టివిటీ రేటును చూపుతున్నాయని పేర్కొంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన ఎపిడెమియోలాజికల్ నివేదిక ప్రకారం.. గత 28 రోజుల్లో భారతదేశంలో కోవిడ్ -19 కారణంగా మరణించిన వారి సంఖ్య 114 శాతానికిపైగా పెరిగింది.
అదే సమయంలో కొవిడ్ కేసుల సంఖ్య 437 శాతం పెరిగింది. కేసుల పెరుగుదలకు, మరణాలకు ఇంకా కారణాలు తెలియరాలేదు. ఆగ్నేయాసియా ప్రాంతం నుంచి 27వేల కంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. భారత్ తర్వాత మాల్దీవుల్లో 129శాతం, నేపాల్‌లో 89శాతం కేసులు పెరిగాయి.దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
22 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16కి చెందిన 800 సీక్వెన్స్‌లు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ COVID-19 సాంకేతిక విభాగం అధిపతి డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. చాలా సీక్వెన్స్‌లు భారత్ నుంచే వచ్చాయన్నారు.XBB.1.16 ప్రొఫైలింగ్ వాస్తవానికి XBB.1.5ని పోలి ఉంటుంది. స్పైక్ ప్రోటీన్‌లో అదనపు మ్యుటేషన్ కలిగి ఉంది. ల్యాబ్‌లో నిర్వహించిన అధ్యయనాల్లో ఈ వేరియంట్ ఇన్ఫెక్షన్‌ను పెంచుతున్నట్లు తేలింది. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XBB.1.16ని నిత్యం పర్యవేక్షిస్తున్నది.