COVID in India: కరోనా ప్రమాదంలో 40 కోట్ల మంది ప్రజలు, జూన్–జూలైల్లో చేపట్టిన నాలుగో సెరో సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి, దేశంలో తాజాగా 42,015 కరోనా కేసులు, కొత్తగా 3,998 మంది కరోనాతో మృతి
దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,16,337కు (Coronavirus Outbreak) చేరింది. అలాగే, నిన్న 36,977 మంది కోలుకున్నారు. మరణాల విషయానికొస్తే... నిన్న 3,998 మంది కరోనాతో (Covid Deaths) ప్రాణాలు కోల్పోయారు.
New Delhi, July 21: దేశంలో నిన్న కొత్తగా 42,015 కరోనా కేసులు (COVID in India) నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,16,337కు (Coronavirus Outbreak) చేరింది. అలాగే, నిన్న 36,977 మంది కోలుకున్నారు. మరణాల విషయానికొస్తే... నిన్న 3,998 మంది కరోనాతో (Covid Deaths) ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,18,480కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,03,90,687 మంది కోలుకున్నారు. 4,07,170 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 41,54,72,455 వ్యాక్సిన్ డోసులు వేశారు.
దేశంలోని ఆరేళ్లపైబడి వయస్సున్న మూడింట రెండొంతుల మంది జనాభాలో కరోనా నిరోధక యాంటీబాడీలు అభివృద్ధి చెందినప్పటికీ, సుమారు 40 కోట్ల మంది కోవిడ్ బారిన పడే ప్రమాదముందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. జాతీయ స్థాయిలో జూన్–జూలైల్లో చేపట్టిన నాలుగో సెరో సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మీడియాకు చెప్పారు.
దేశ జనాభాలోని ఆరేళ్లకు పైబడిన మూడింట రెండొంతుల జనాభా, 67.6% మందిలో కోవిడ్ యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు తేలిందని చెప్పారు. ఇంకా, సుమారు 40 కోట్ల మంది ప్రజలు ఈ మహమ్మారి బారినపడే ప్రమాదంలో ఉన్నారని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తల్లో 85 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు వెల్లడైంది. కానీ, దేశంలోని ప్రతి 10 మందిలో ఒక ఆరోగ్య కార్యకర్త ఇప్పటికీ టీకా వేయించుకోలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాలకు చెందిన 28,975 మంది సాధారణ ప్రజలు, 7,252 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ సర్వే జరిగింది.
పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ కోవిడ్‌పై పోరులో రాజీ పడరాదని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిం దేనని స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, సామాజిక, మత, రాజకీయ సమావేశాలకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు. చిన్నారులు వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడేందుకు అవకాశాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే స్కూళ్లు తెరవడం మంచిదని సూచించారు.
ఒకవేళ భారత్‌లో బడులు తెరవడం ఆరంభించేట్లయితే ముందుగా చిన్న తరగతులతో ఆరంభించడం మేలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ సూచించారు. మానవ కణాల్లో వైరస్ రాకను అనుమతించే గ్రాహకాలు చిన్నపిల్లల్లో తక్కువని, అందువల్ల పెద్దలతో పోలిస్తే చిన్న పిల్లల్లో వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువని వివరించారు. అయితే బడులు తెరిచినా సరే నిబంధనలు కఠినంగా పాటించాల్సిందేనని సూచించారు. ముఖ్యంగా టీచర్లు ఇతర సిబ్బంది టీకాలు వేయించుకొనిఉండాలన్నారు.
దేశంలో 6–9వయసు గ్రూపు జనాభాలో సీరోప్రీవాలెన్స్(బ్లడ్ సీరమ్‌లో సూక్ష్మజీవి స్థాయి) పెద్దలతో సమానంగా దాదాపు 57.2 శాతంఉందని జాతీయ సర్వేలో తేలిందన్నారు. ప్రైమరీ తరగతులకు చెందిన పిల్లలతో బడులు ఆరంభించడం మంచిదని అభిప్రాయపడ్డారు. పలు దేశాల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ సందర్భాల్లో కూడా ప్రైమరీ బడులు మూసివేయలేదని తెలిపారు. అందువల్ల మనదగ్గర కూడా ముందుగా ప్రైమరీ పాఠశాలలు తెరవడం మంచిదన్నారు.