India Coronavirus: కరోనాతో బీహార్ ఐజీ మృతి, ఎన్నికల తరహాలో వ్యాక్సిన్లకు సిద్ధం కావాలని ప్రధాని మోదీ పిలుపు, డిసెంబర్ నాటికి 30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు రెడీ, దేశంలో తాజాగా 61,871 మందికి కోవిడ్-19
దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,14,031 కు (India Coronavirus Deaths) చేరింది. కొత్తగా 61,871 మందికి వైరస్ (Coronavirus Outbreak) సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 74,94,552 కు (India Coronavirus) చేరింది. దేశంలో ప్రస్తుతం 7,83,311 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో తాజాగా 72,614 మంది కోలుకున్నారు.
New Delhi, October 18: దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనాబారినపడి మరో 1033 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,14,031 కు (India Coronavirus Deaths) చేరింది. కొత్తగా 61,871 మందికి వైరస్ (Coronavirus Outbreak) సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 74,94,552 కు (India Coronavirus) చేరింది. దేశంలో ప్రస్తుతం 7,83,311 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో తాజాగా 72,614 మంది కోలుకున్నారు.
ఇప్పటివరకు 65,97,210 మంది కోవిడ్‌ను జయించారు. ఈమేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో కరోనా రికవరీ రేటు 88.03 శాతంగా ఉందని, మరణాల రేటు 1.52 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 10.45 శాతం ఉందని వెల్లడించింది.
దేశంలోని ప్రతి పౌరుడికీ కోవిడ్–19 వ్యాక్సిన్ (Covid Vaccince) తప్పనిసరిగా అందేలా పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉండాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. ఎన్నికలు, విపత్తుల సమయాల్లో మాదిరిగానే టీకా పంపిణీలో కూడా అన్ని స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం, పౌర సమాజాలు పాలుపంచుకోవాలన్నారు. దేశంలో కోవిడ్–19 పరిస్థితి, టీకా సరఫరా, పంపిణీకి చేపట్టిన ఏర్పాట్లపై ప్రధాని మోదీ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కరోనా రక్కసికి బిహార్ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఇన్స్‌పెక్టర్ జనరల్ కన్నుమూశారు. పుర్నియాలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ బినోద్ కుమార్ మూడు రోజులుగా కరోనాతో పోరాడి ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచారు. ఇదిలాఉండగా.. జనతాదళ్ (JDU) సీనియర్ నాయకుడు, బిహార్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ (69), బీజేపీ నేత, బిహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ (50) కూడా కోవిడ్ బారినపడి ఇటీవల మరణించారు. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,619 చేరగా.. వైరస్ బారినపడి 990 మంది మరణించారు.
భారత్‌లో ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి దాదాపు 30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు సిద్ధమవుతాయని పుణేలోని ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ జాదవ్ చెప్పారు. డీసీజీఐ నుంచి లైసెన్స్ రాగానే ఈ వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందుతాయని పేర్కొన్నారు. చివరి పరీక్ష జరుపుకున్న వ్యాక్సిన్ 2021 మార్చిలో అందుబాటులోకి వస్తుందన్నారు. కరోనా వైరస్ నివారణకు సీరమ్ సంస్థ ఐదు రకాల వ్యాక్సిన్లతో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. తాము నెలకు దాదాపు 7 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తామన్నారు.
భారత్‌లో స్పుత్నిక్–వీ పరీక్షలు
కరోనా నివారణకు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వీ వ్యాక్సిన్ రెండు/మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను భారత్‌లో నిర్వహించేందుకు తమకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతి లభించిందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్)తో కలిసి తాము ఈ ట్రయల్స్ నిర్వహిస్తామంది.
సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను తేవడమే తమ సంకల్పమని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కో–చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. రష్యాలో స్పుత్నిక్–వీ టీకా మానవ ప్రయోగాలు జరుగుతున్నాయని ఆర్‌డీఐఎఫ్ సీఈఓ కిరిల్ చెప్పారు. భారత్‌లోనూ ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైందన్నారు. భారత్‌లో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు, వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్ గత నెలలో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా ఆర్‌డీఐఎఫ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు 10 కోట్ల్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందజేయనుంది.