New Delhi, October 17: దేశంలో గడిచిన 24 గంటల్లో 62,212 పాజిటివ్ కేసులు (Coronavirus Outbreak in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,32,681కి చేరింది. నిన్న ఒక్క రోజే 837 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,12,998 మంది కరోనాతో మృత్యువాత (Coronavirus Deaths) పడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 65,24,596 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 7,95,087గా ఉంది. కరోనా రోగుల రికవరీ రేటు 87.78 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 9,99,090 కరోనా టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు మొత్తం 9,32,54 017 టెస్టులు నిర్వహించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కరోనా (Ghulam Nabi Azad Test Positive for Corona) మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందంటూ, తనతో సన్నిహితంగా మెలిగినవారిని అప్రమత్తం చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకోవాల్సిందిగా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కోరారు. తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని ట్వీట్ చేశారు.
Here's Ghulam Nabi Azad Tweet
I have tested positive for COVID-19. I am in home quarantine. Those who came in contact with me in last few days may kindly follow the protocol.
— Ghulam Nabi Azad (@ghulamnazad) October 16, 2020
కరోనా జనతాదళ్ (JDU) సీనియర్ నాయకుడు, బిహార్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ (69) ను (bihar minister kapil deo kamat dies due corona) కబలించింది. కొన్ని రోజులు క్రితం ఆయనకు కరోనా సోకడంతో పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేరారు. అయితే అంతకుముందు ఆయనకు కిడ్నీ సహా అనారోగ్య సమస్యలు ఉండటంతో పరిస్థితి విషమించి కామత్ మరణించినట్లు ఎయ్‌మ్స్ వైద్యులు శుక్రవారం దృవీకరించారు.
వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. కామత్ మృతిపట్ల జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని ట్వీట్ చేశారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే తత్వం కామత్‌ది అంటూ పేర్కొన్నారు. ఆయన మరణం రాజకీయ రంగానికే తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సీఎం ట్వీట్ చేశారు.
కరోనావ్యాధి చికిత్స కోసం వాడుతున్న రెమెడిసివర్ ఔషధంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కోవిడ్ ట్రీట్‌మెంట్ కోసం వాడుతున్న రెమెడిసివర్ ఔషధంతో అతి తక్కువ లేదా అసలు ఎలాంటి ప్రభావం లేదని తెలిపింది. రెమెడిసివర్ తీసుకున్న రోగులు కోలుకోవడం లేదా వారి జీవితకాలం పెరగడం వంటి ఫలితాలు కనిపించలేదని డబ్ల్యూహెచ్‌ఓ సర్వే తెలిపింది.
కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగించిన మొట్ట మొదటి యాంటీవైరల్ మందు రెమెడిసివర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చికిత్సలో భాగంగా దీన్ని కూడా ఉపయోగించారు. ఇలాంటి తరుణంలో డబ్ల్యూహెచ్‌ఓ సర్వే తెలిపిన విషయాలు కాస్త ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 30 కంటే ఎక్కువ దేశాలలో దాదాపు 11,266 మంది కోవిడ్ రోగుల మీద రెమెడిసివర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, యాంటీ-హెచ్‌ఐవీ డ్రగ్ లోపినావిర్/రిటోనావిర్, ఇంటర్ఫెరాన్ల కాంబినేషన్లను ఉపయోగిస్తున్నారు.