New Delhi, October 16: దేశంలో గత 24 గంటల్లో 63,371 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (2020 Coronavirus Pandemic in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469కి చేరింది. నిన్న ఒక్క రోజే 895 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,12,161 మంది కరోనాతో మృత్యువాత (Covid Deaths) పడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 64,53,780 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,04,528గా ఉంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,28,622 శాంపిళ్లను పరీక్షించామని, ఇప్పటివరకు 9,22,54,927 శాంపిళ్లను పరీక్షించామని ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) తెలిపింది.
కరోనా వైరస్ (Coronavirus in India)రాకుండా నిరోధించేందుకు ‘ఎపివాక్ కరోనా వ్యాక్సిన్’ పేరిట రెండో వ్యాక్సిన్‌కు రష్యా బుధవారం ఆమోదం తెలిపింది. కరోనా వైరస్ సోకకుండా ఈ వ్యాక్సిన్ ఆరు నెలలపాటు అండుకుంటుందని పేర్కొంది. వంద మంది వాలంటీర్లపైన రెండు విడతలుగా ప్రయోగాలు జరిపిన అనంతరం ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రష్యా ప్రభుత్వం అనుమతివ్వడం గమనార్హం. మొదటి వ్యాక్సిన్ లాగానే ఈ వ్యాక్సిన్‌పై కూడా ‘సైడ్ ఎఫెక్ట్స్’ ఏమిటో తెలసుకునేందుకు కీలకమైన తతీయ ట్రయల్స్‌ను నిర్వహించలేదు.
రెండో వ్యాక్సిన్ రెండు విడుతల ప్రయోగాల వివరాలను బహిర్గతం చేయకుండానే ఈ వ్యాక్సిన్ ఆరు నెలల పాటు కరోనాను అడ్డుకుంటుందని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సిన్‌తో వాలంటీర్లలో రోగ నిరోధక శక్తి పెరిగిందని, దాన్ని బట్టే ఈ వ్యాక్సిన్ పని చేస్తున్నట్లు తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటికే మొదటి వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’ ట్రయల్స్ అక్కడ చివరి దశలో ఉన్న సంగతి విదితమే. తొలి కరోనా వ్యాక్సిన్‌ను ఆగస్టు 11వ తేదీన రష్యా ప్రభుత్వం అనుమతించగా, రెండో వ్యాక్సిన్‌ను ఈ రోజే అనుమతించింది. మొదటి వ్యాక్సిన్‌ను మాస్కోలోని గామాలయ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోండగా, రెండో వ్యాక్సిన్‌ను వెక్టర్ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.
చైనా అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్లలో కీలకమైన సీఎన్‌బీజీ వ్యాక్సిన్‌పై తాజాగా నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వెల్లడయ్యాయి. వాలంటీర్లపై చేపట్టిన తాజా పరీక్షల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని సీఎన్‌బీజీ వెల్లడించింది. ప్రాథమిక, మధ్యస్ధాయి మానవ పరీక్షలో వ్యాక్సిన్ డోసు తీసుకున్న వారిలో వ్యాధి నిరోధకత మెరుగైందని పేర్కొంది. సీఎన్‌బీజీ అనుబంధ బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ ప్రొడక్ట్స్ (బీబీఐబీపీ) బీబీఐబీపీ-కోర్‌వీ పేరిట ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది.
కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించి బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీ, డెన్మార్క్‌లోని ఓడెన్స్ యూనివర్శిటీ హాస్పిటల్ పరిశోధకలు వేర్వేరుగా జరిపిన రెండు తాజా అధ్యయనాల్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. బ్లడ్ గ్రూప్ ‘ఓ (పాజిటివ్ లేదా నెగటివ్)’ కలిగిన ప్రజలపై కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపించడం లేదని, వారిలో వైరస్ కారణంగా శరీర అవయవాలు చెడిపోవడం, మత్యువాత పడడం చాలా తక్కువని ఓడెన్స్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వైరస్ బారిన పడుతున్న వారిలో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ ప్రజలు తక్కువగా ఉండడం మరో విశేషమని, ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతుండగా, వారిపైనే వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని, వారి పట్లనే వైరస్ ప్రాణాంతకంగా మారుతుందని డానిష్ పరిశోధకులు తేల్చారు.