Coronavirus in India: డేంజర్‌గా మారిన కరోనా సెకండ్ వేవ్, దేశంలో కొత్తగా 68 వేల కరోనా కేసులు, మళ్లీ లాక్‌డౌన్ ప్రణాళికకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించిన మహారాష్ట్ర సీఎం, ఢిల్లీలో మళ్లీ కఠిన ఆంక్షలు
వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 32,231 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,39,644కు (Coronavirus in India) చేరింది.
New Delhi, March 29: దేశంలో గత 24 గంటల్లో 68,020 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 32,231 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,39,644కు (Coronavirus in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 291 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు.
దీంతో మృతుల సంఖ్య 1,61,843కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,55,993 మంది కోలుకున్నారు. 5,21,808 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,05,30,435 మందికి వ్యాక్సిన్లు వేశారు.
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 27 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా రికార్డుస్థాయిలో 40,414 కరోనా కేసులు, 108 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,13,875కు, మరణాల సంఖ్య 54,181కు చేరింది. అలాగే ముంబైలో ఆదివారం రికార్డుస్థాయిలో 6,923 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 3,98,674కు పెరిగింది.
మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 17,874 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 23,32,453కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,25,901 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.
మహారాష్ట్రలో కరోనా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆదివారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఇది అమలుకానున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, బహిరంగ ప్రదేశాలు నిర్మానుష్యంగా మారాయి.
ప్రజలు సేఫ్టీ రూల్స్ పాటించడం లేదని.. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్దవ్ థాకరే ఆదేశించారు. రాష్ట్రంలో తాజాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అనుసరించాల్సిన విధి విధానాలపై ఆదివారం ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీతారాం కుంటే, కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ వైద్యులు, ఇతర అధికారులతో సమీక్షించారు.
సమీక్షలో పాల్గొన్న అధికారులు, కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ వైద్యులు తాజాగా కరోనా కేసులు పెరుగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కరోనా మరణాలు కూడా పెరుగుతాయన్నారు. సీఎం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ కరోనా కేసులు ఇలాగే పెరిగిపోతే రాష్ట్రం మౌలిక వసతుల లేమితో ఆరోగ్య పరిరక్షణ సంక్షోభాన్ని ఎదుర్కునే దుస్థితి నెలకొందన్నారు. ఇదిలా ఉంటే, రాష్ట్ర సచివాలయం- మంత్రాలయంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించే సాధారణ ప్రజలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపీ మాట్లాడుతూ ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాల్సి వచ్చిందన్నారు.
కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో ఆంక్షలు మళ్లీ ప్రారంభమయ్యాయి. గతంలో పెళ్లిళ్లు, వేడుకలు, అంత్యక్రియలకు హాజరయ్యే సంఖ్యను కుదిస్తూ ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ తాజాగా ఆదేశాలిచ్చింది. పెళ్లిళ్లు, వేడుకలకు అతిథులు 200 మంది దాటకూడదని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) ఆదేశాలు జారీ చేసింది.
పెళ్లిళ్లకు 200 మంది అతిథులు, ఓపెన్ ఎయిర్ వెన్యూల్లో జరిగే కార్యక్రమలకు 100 మందికి, అంత్యక్రియల కార్యక్రమాలకు 50 మంది మించరాదని స్పష్టం చేసింది. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించడంతోపాటు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. ఈ ఆదేశాలు ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. శనివారం 1,558 కేసులు రావడం మొత్తం కేసులు 6,55,834కు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.