India Covid Updates: కరోనాతో ఆరు రాష్ట్రాలు విలవిల, దేశంలో తాజాగా 62,714 మందికి కరోనా నిర్ధారణ, 312 మంది కరోనా కారణంగా మృతి, తెలంగాణలో తాజాగా 535 కోవిడ్ కేసులు, కరోనాపై 12 రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమీక్ష, మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, Mar 28: దేశంలో గ‌త 24 గంటల్లో 62,714 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 28,739 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,71,624కు (India Covid Updates) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 312 మంది కరోనా కారణంగా మృతి (Covid Deathsw) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,61,552కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,23,762 మంది కోలుకున్నారు. 4,86,310 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,02,69,782 మందికి వ్యాక్సిన్లు వేశారు. దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,09,50,842 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,81,289 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 535 కరోనా కేసులు (New Covid Cases) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 278 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,339కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,00,156 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,688గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,495 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,979 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 154 మందికి క‌రోనా సోకింది.

ఒకరి నుంచి 8–9 మందికి కరోనా వ్యాప్తి, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు, సెకండ్ వేవ్ నేపథ్యంలో మాస్కులు తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే

ఇండియాలో కరోనా కేసులు మరోమారు విజృంభిస్తుండటంతో.. కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమైన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఈ దిశగా 5సూత్రాల ప్రణాళికలను ప్రకటించారు. కరోనా కట్టడికి నమూనాల పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆయన సూచించారు.

ఇదే సమయంలో వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ లో తప్పనిసరిగా ఉంచాలని, ఆపై వారి కాంటాక్ట్ ట్రేసింగ్, ఆరోగ్య కార్యకర్తల రక్షణ, ప్రజలు నిబంధనలను తు.చ. తప్పక పాటించేలా చూడటం తప్పనిసరని, అప్పుడే కేసుల సంఖ్య మరింత పెరగకుండా చూడవచ్చని ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇండియాలో 46 జిల్లాల్లో కరోనా అత్యధికంగా ఉందని, ఈ జిల్లాల్లో కంటెయిన్ మెంట్ జోన్లను కొనసాగించాలని ఆయా ప్రాంతాల స్థానిక అధికారులకు సూచించామని అన్నారు.

ఈ 46 జిల్లాల్లోనే కొత్తగా వస్తున్న కరోనా కేసుల్లో 71 శాతం వరకూ ఉంటున్నాయని, వీటిల్లో 30కి పైగా జిల్లాలు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయని రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. కరోనా టెస్టుల్లో 70 శాతం ఆర్టీ-పీసీఆర్ టెస్టులు మాత్రమే ఉండేలా చూడాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామని వ్యాఖ్యానించిన ఆయన, కరోనా వచ్చిన వారికి దగ్గరగా మెలిగిన వారిని మూడు రోజుల ఐసొలేషన్ లో ఉంచి పరీక్షించాలని కూడా ఆదేశించినట్టు పేర్కొన్నారు.

తెలంగాణలో మగవారికే ఎక్కువగా కరోనా వ్యాప్తి, సంచలన విషయాలు వెలుగులోకి, మొత్తం 60.63 శాతం మంది పురుషులు, 39.37 శాతం మంది మహిళలు కరోనా బారీన పడ్డారని వెల్లడించిన తెలంగాణ ఆరోగ్య శాఖ

కొత్త కేసుల్లో 79.57 శాతం కేసులు కేవలం ఆరు రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి. వీటిలో మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా 36,902 కేసులు నమోదయ్యాయి. కేవలం మహారాష్ట్ర, పంజాబ్, కేరళల్లోనే 73 శాతం కేసులు నమోదయ్యాయి. 10 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకూ 5.8 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

కరోనాపై 12 రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమీక్ష జరిపింది. మహారాష్ట్ర, గుజరాత్‌, హర్యానా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, బిహార్‌ రాష్ట్రాలపై కేంద్రం కీలక సమీక్ష నిర్వహించింది. కరోనా కేసుల వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రాల్లో చేపట్టిన చర్యలపై ఆరా తీసింది. 46 జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్రం గుర్తించింది. కరోనా కేసులు పెరిగే రాష్ట్రాల్లో టీకాలు, పరీక్షలు పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. కఠిన చర్యలు, కంటైన్మెంట్‌ జోన్లతో కట్టడి చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

మహారాష్ట్రలో 27వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలుకానున్న నైట్‌ కర్ఫ్యూకు సంబంధించిన మార్గదర్శకాలను మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నైట్‌ కర్ఫ్యూ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు వరకూ ఉండనుంది. అయితే అత్యవసర సేవలను ఇందులోనుంచి మినహాయించారు. మరోవైపు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. మాస్క్‌ లేకుండా తిరిగితే రూ. 500, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ. 1000, కర్ఫూ సమయంలో అయిదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడితే రూ. 1000 జరిమానా వసూలు చేయనున్నారు. ఈ ఆదేశాలు ఏప్రిల్‌ 15వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి.

మార్గదర్శకాల వివరాలు...

► రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

► కర్ఫ్యూ సమయంలో బీచ్‌లు, ఉద్యానవనాలు, సార్వజనిక ప్రాంతాలు మూసేయనున్నారు.

► కర్ఫ్యూ సమయంలో అయిదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడరాదు.

► బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మివేయరాదు.

► ముఖానికి మాస్క్, కనీసం ఆరు అడుగుల దూరం (సోషల్‌ డిస్టిన్స్‌). చేతులను తరచు సానిటైజ్‌ చేసుకోవాలి.

► మాస్క్‌ లేకుంటే రూ 500 జరిమానా

► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసి నియమాను ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానాను వసూలు చేయనున్నారు.

► కర్ఫ్యూ సమయంలో సినిమా హాళ్లు, హోటళ్లు, మల్టిప్లెక్స్, బార్లు అన్ని మూసి ఉండనున్నాయి. అయితే హోటళ్లు హోం డెలివరి చేసుకోవచ్చు.

► వివాహానికి 50 మందికి అవకాశం.

► అంత్యక్రియలకు 20 మంది మించకూడదు.

► ధార్మిక స్థలాలలో భౌతిక దూరం పాటించేలా ఆయా ధార్మిక స్థలాల ట్రస్టులు చూడాలి. అదేవిదంగా ఆన్‌లైన్‌ దర్శనం కల్పించాలి. అన్ని నియమాలతోనే ధార్మిక స్థలాల్లోకి అనుమతించాలి.

► కొన్ని ఆంక్షలతో ప్రజా రవాణా కొనసాగుతుంది.

► ప్రైవేట్‌ సంస్థలు (ఆరోగ్య, అత్యవసర సేవలు మినహా) 50 శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యేలా చూడాలి.