
Hyderabad, Mar 27: తెలంగాణ రాష్ట్రంలో పురుషుల్లోనే అధికంగా కరోనా కేసులు (COVID-19 and gender equality) వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వారు జన సమూహాల్లోకి ఎక్కువగా వెళ్లడం, ఉపాధి, ఉద్యోగాల్లో వీరి సంఖ్య అధికంగా ఉండటమేనని తెలుస్తోంది ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ (Telangana State Medical and Health Department ) వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.05 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, అందులో 60.63 శాతం మంది పురుషులు, 39.37 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో నిన్న ఒకే రోజు 58,029 టెస్టులు చేసినట్లు వివరించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 99,03,125 మందికి పైగా పరీక్షలు చేయగా, అందులో 3,05,804 మందికి కరోనా సోకింది. శుక్రవారం 495 మందికి కరోనా సోకినట్లు తేలిందని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 142 మంది కరోనా బారినపడ్డారు. తాజాగా ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు 1,685 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,241 ఉండగా, ఇళ్లు, కోవిడ్ కేర్ సెంటర్ల ఐసోలేషన్‌లో 1,767 మంది ఉన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని, తొందరపాటు నిర్ణయాలు ఉండవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ప్రజలెవరూ హైరానా పడొద్దని, పరిశ్రమల మూసివేత ఉండదని తెలిపారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో ప్రజలంతా మాస్కులు ధరించి, స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు