
Hyderabad, Mar 27: హోలీ పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం దుకాణాలు (Wine Shops Closed in TS) మూతపడనున్నాయి. హోలీ సందర్భంగా ఆదివారం సాయంత్రం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (Cyberabad Police Commissioner Sajjanar) ఆదేశాలు జారీ చేశారు. సోమవారం హోలీ పండుగ (Holi festival) సందర్భంగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై వెళ్లే వ్యక్తులపై, వాహనాలు, స్థలాలపై రంగులు, రంగునీళ్లు చల్లవద్దని, ద్విచక్రవాహనాలు, కార్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మార్చి 29న జరగనున్న హోలీ పండగపై (Holi festival 2021) కూడా ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు సంఖ్య మళ్లీ వేగంగా పెరుగుతోంది. హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ పరిస్థితులు కూడా అదే తరహాలో ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం దేశంలో కరోనావైరస్ (Coronavirus) కారణంగా పరిస్థితులు మళ్లీ రోజురోజుకు దిగజారిపోతున్నాయి.
గత 24 గంటల్లో దేశంలో మొత్తం 62,258 కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 అక్టోబర్ తరువాత ఇలా రికార్డు స్థాయిలో అత్యధికంగా రోజువారీ కేసులు నమోదవడం మళ్లీ ఇదే ప్రథమం. దీంతో ప్రస్తుతం దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 1,19,08,910 కు చేరుకుంది. గత 2 వారాలుగా కరోనా కేసుల (Corona) సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లోనే కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతీ రోజూ పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల దృష్ట్యా, పరిస్థితిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది.