Covid in India: స్కూళ్లు నిరవధికంగా మూసివేత, కీలక నిర్ణయం తీసుకున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో తాజాగా 96,982 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు, సరిహద్దులు దాటివచ్చే ప్రయాణికులకు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి చేసిన కర్ణాటక
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,86,049కు (Coronavirus in India) పెరిగింది.
New Delhi, April 6: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,86,049కు (Coronavirus in India) పెరిగింది. మహమ్మారి ప్రభావంతో మరో 446 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 50,143 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 7,88,223కు (COVID-19 Cases in India) చేరాయి. ఇప్పటి వరకు 1,17,32,279 మంది కోలుకోగా.. మొత్తం 1,65,547 మంది ప్రాణాలు కోల్పోయారు.
టీకా డ్రైవ్‌లో భాగంగా 8,31,10,926 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. నిన్న ఒకే రోజు 12.11 లక్షలకుపైగా కొవిడ్ నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. మహమ్మారి ప్రారంభం నుంచి నిన్నటి వరకు 25.02 కోట్ల నమూనాలను పరిశీలించినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 47,288 నమోదయ్యాయి. కొత్త కేసుల్లో దాదాపు 49 శాతం వరకు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 7,302, కర్ణాటకలో 5,279 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో నియంత్రణ కోసం మంగళవారం నుంచి నగర సరిహద్దులు దాటివచ్చే ప్రయాణికులకు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు నివేదిక తప్పనిసరి చేశామని బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ మంజునాథ్ తెలిపారు. బీఎంపీ, పోలీస్ సహా పలు శాఖల ఆధ్వర్యంలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. కోవిడ్ బాధితుల ప్రాథమిక, ద్వితీయ సంబంధాలు కలిగిన వారి ఆచూకీ కనిపెడుతున్నామని తెలిపారు.
తమిళనాడు సరిహద్దుల్లో అత్తిబెలె చెక్‌పోస్ట్ వద్ద నిరంతరం తనిఖీలు చేస్తారన్నారు. మెడికల్ స్టోర్‌లలో జ్వరం, జలుబు మాత్రలు కొనేవారి సమాచారం సేకరిస్తున్నామని, జాతరలు, సభలు, సమావేశాలను నిషేధించామని చెప్పారు. పాలికె కమిషనర్ గౌరవ్‌గుప్తా మాట్లాడుతూ రోగుల కోసం బెడ్లను సిద్ధం చేశామన్నారు. తుమకూరు: మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 5,279 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా సోకి 32 మంది మృత్యువాత పడ్డారు. ఇటీవలి నాలుగు నెలల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మరో 1,856 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,20,434 కి, డిశ్చార్జ్‌లు 9,65,275 కి, మరణాలు 12,657 కి పెరిగాయి. ప్రస్తుతం 42,483 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 345 మంది రోగులు ఐసీయూలో ఉన్నారు.
స్కూళ్లను నిరవధికంగా మూసివేస్తున్నట్లు గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాలు ప్రకటించాయి. ఇక తరగతులను రద్దు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, బిహార్, పంజాబ్ ప్రభుత్వాలు వెల్లడించాయి. ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించాలని పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశాయి. తదుపరి ఉత్తర్వులు విడుదల చేసే వరకూ విద్యార్థులెవరూ పాఠశాలలకు రావొద్దని ఢిల్లీ సర్కారు స్పష్టం చేసింది. 9వ తరగతి వరకూ పాఠశాలలను ఏప్రిల్ 5 నుంచి రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం తెలియజేసింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 8వ తరగతి వరకు స్కూళ్ల మూసివేత గడువును ఏప్రిల్ 11 దాకా పొడిగించింది. మహారాష్ట్రలో 10, 12వ తరగతుల విద్యార్థులు, పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు మాత్రమే క్లాసులకు హాజరు కావొచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 10 దాకా స్కూళ్లను మూసివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. గుజరాత్, రాజస్తాన్‌లోనూ స్కూళ్లు మూతపడ్డాయి. బిహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిలో కరోనా కారణంగా స్కూళ్లకు తాళాలేయడంతో చదువులకు ఆటంకం కలుగుతోంది. మహమ్మారి ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో మూసివేత గడువును ప్రభుత్వాలు ఇంకా పొడిగిస్తున్నాయి.