Coronavirus Scare: భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం, తొలిసారిగా లక్ష దాటిన కరోనా కేసులు, పలు రాష్ట్రాల్లో మినీ లాక్‌‌డౌన్‌ అమల్లోకి, అయిదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ప్రధాని మోదీ
Representational Image | PTI Photo

New Delhi, April 5: దేశంలో తొలిసారి క‌రోనా కేసుల సంఖ్య ల‌క్ష దాటింది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 17న‌ దేశంలో గ‌రిష్ఠంగా 97,894 క‌రోనా కేసులు (India Coronavirus) న‌మోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డు దాటి గ‌త 24 గంటల్లో 1,03,558 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus Cases) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 52,847 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,25,89,067కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 478 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,65,101కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,16,82,136 మంది కోలుకున్నారు. 7,41,830 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 7,91,05,163 మందికి వ్యాక్సిన్లు వేశారు.

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మినీ లాక్‌ డౌన్‌ (పాక్షిక లాక్‌ డౌన్‌)ను ప్రకటించింది. ఉదయం సెక్షన్‌ 144, నైట్‌ కర్ఫ్యూతోపాటు వీకెండ్‌లో అంటే వచ్చే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు వరకు (శని, ఆది) సంపూర్ణ లాక్‌డౌన్‌ (Lockdown) ఉండనుంది. అత్యవసర సేవలను ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. ఆంక్షలు సోమవారం ఉదయం అమల్లోకొస్తాయి. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.

మాస్క్ అవసరం లేదు, ఎప్పుడు పెట్టుకోవాలో మేము చెబుతాం, విచిత్ర వ్యాఖ్యలు చేసిన అస్సాం బీజేపీ మంత్రి హిమంత్ బిశ్వా సరమ్

దేశంలో కరోనా కేసుల పెరుగుదలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 పరిస్థితి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై చర్చించారు. కరోనాని తరిమికొట్టడానికి అయిదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు.

ఇప్పటివరకు కరోనా కట్టడిలో అత్యంత ముఖ్యంగా భావిస్తున్న టెస్ట్, ట్రేస్, ట్రీట్‌ విధానంతో పాటు ప్రజలందరూ కరోనా నిబంధనల్ని కచ్చితంగా పాటించడం, అంకితభావంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ అయిదు సూత్రాలతోనే కరోనా కొమ్ములు వంచగలమని ప్రధాని అధికారులకు చెప్పారు. ఈ సమావేశంలో ప్రధాని ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ, కేబినెట్‌ సెక్రటరీ, హోం, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో పాటు నీతిఅయోగ్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఢిల్లీలో మూడు దాటి 4వ దశలోకి చేరిన కరోనా, మీకు దండం పెడతాను.. దయచేసి మాస్క్‌ ధరించండని వేడుకుంటున్న సీఎం కేజ్రీవాల్, లాక్‌డౌన్‌ లేదు, జాగ్రత్తలు పాటించాలని సీఎం సూచన

కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడానికి ప్రజలు నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించడమే కారణమని ఆ సమావేశం అభిప్రాయపడింది. ప్రజలు మాస్కులు పెట్టుకోకపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందని, క్షేత్రస్థాయిలో కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తి అరికట్టడంపై అధికారులు దృష్టి పెట్టకపోవడం కూడా కారణమేనని నిర్ణయానికొచ్చింది.

అందుకే జిల్లా స్థాయిలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న చోట జోన్లు ఏర్పాటు చేసి కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని ప్రధాని ఆదేశించినట్టుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన పేర్కొంది. దేశంలోని ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకి అవసరమయ్యే పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర చికిత్స సదుపాయాలపై కూడా ప్రధాని సమీక్షించినట్టుగా ఆ ప్రకటన వెల్లడించింది.

దేశాన్ని వణికిస్తున్న సెకండ్ వేవ్, రోజువారీ కేసుల్లో అమెరికా, బ్రెజిల్‌ను దాటేసిన ఇండియా, పేదలను భయపెడుతున్న లాక్‌డౌన్ ఊహగానాలు, సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్న వలస కార్మికులు

మహారాష్ట, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర బృందాలు

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 91శాతానికి పైగా కేసులు, మరణాలు 10 రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రధానికి అధికారులు అన్ని వివరాలతో కూడిన ఒక ప్రెజెంటేషన్‌ సమర్పించారు. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లలో కరోనా విధ్వంసం సృష్టిస్తోంది. గత 14 రోజుల్లో 57% కేసులు ఈ రాష్ట్రాల నుంచే నమోదవగా, 47% మరణాలు సంభవించాయి. ఇక దేశవ్యాప్తంగా కేసుల్లో 4.5%, మరణాల్లో 16.3% పంజాబ్‌ రాష్ట్రం నుంచే రావడం ఆందోళన పుట్టిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో 4.3% కేసులు, 7శాతానికి పైగా మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో పాటుగా కేసుల కంటే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లకు కేంద్ర బృందాలు వెళ్లి పరిస్థితుల్ని సమీక్షించాలని ప్రధాని ఆదేశించారు.

కోవిడ్‌–19 నిబంధనల్ని పాటించడంలో ప్రజలకి అవగాహన పెంచడానికి ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పూర్తి స్థాయిలో మాస్కుల వాడకం, వ్యక్తిగత పరిశుభ్రత, బహిరంగ ప్రదేశాల్లో , పని ప్రాంతాల్లో శానిటైజ్‌ చేయడం తప్పనిసరి. వీటిపై ఏప్రిల్‌ 6 నుంచి 14 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇక కరోనా పూర్తిగా నిర్వీర్యం కావాలంటే ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడమే ఏకైక మార్గమని ప్రధాని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చెయ్యడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక టీకా తయారీ కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని సూచించారు. దేశీయ అవసరాలు తీరుస్తూనే ఇతర దేశాలకు టీకాలను పంపాలని ప్రధానమంత్రి అధికారుల్ని ఆదేశించారు. దేశంలో ఇప్పటివరకు 7.59 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఇందులో 43% మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్‌లోనే ఇచ్చారు.