Coronavirus Second Wave: దేశాన్ని వణికిస్తున్న సెకండ్ వేవ్, రోజువారీ కేసుల్లో అమెరికా, బ్రెజిల్‌ను దాటేసిన ఇండియా, పేదలను భయపెడుతున్న లాక్‌డౌన్ ఊహగానాలు, సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్న వలస కార్మికులు
Deadly Coronavirus turns busy Chinese cities into ghost towns (Photo-ANI)

New Delhi, April 3: భారత్‌లో కరోనా వైరస్ సెకండ్‌ వేవ్‌ వణికిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్‌ జరుగుతున్నా..కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. కరోనా రోజువారీ కొత్త కేసుల్లో (Coronavirus Second Wave) బ్రెజిల్, అమెరికాను భారత్‌ దాటేసి.. అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ తొలి స్థానానికి ( India Crossed brazil and america) ఎగబాకింది. దేశంలో శుక్రవారం 89,129 కరోనా కేసులు, 714 మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో 69,986.. బ్రెజిల్‌లో 69,662 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి.

కాగా గత సెప్టెంబర్‌ నుంచి భారత్‌లో ఇంత భారీ స్థాయిలో కేసులు (Massive surge in Covid-19 cases in India) వెలుగు చూడటం ఇదే తొలిసారి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,23,92,260 దాటింది. ఇప్పటివరకు 1,15,69,241 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 1,64,1110 మంది మృత్యువాతపడగా.. ప్రస్తుతం 6,58,909 యాక్టివ్‌ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 93.36%, మరణాల రేటు 1.32%గా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. రోజురోజుకీ దేశంలో కరోనా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది.

మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ 7 కోట్ల మైలురాయిని దాటింది. నిన్న(శుక్రవారం) ఒక్క రోజే 12.76 లక్షల డోసుల పంపిణీ చేసింది. ఇప్పటివరకు 7,06,18,026 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఇప్పటివరకు 6,13,56,345 మంది తొలి డోసు వేసుకోవగా..92,61,681 మందికి రెండో డోసు అందించారు. 45 ఏళ్లు పైబడిన 4,29,37,126 మందికి తొలి డోసు ఇచ్చారు.

దేశంలో మళ్లీ కరోనా మృత్యుఘోష, నిన్న ఒక్కరోజే 714 మంది మృతి, తాజాగా 89,129 మందికి కరోనా పాజిటివ్, కేసులు పెరిగినా లాక్‌డౌన్‌ విధించేది లేదని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వాలు

ఇక మహారాష్ట్రలో పరిస్థితి చేయి దాటుతోంది. లాక్ డౌన్ ఊహగానాలు వినిపిస్తుండటంతో అక్కడ వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వేల మంది కార్మికులు మళ్లీ లాక్‌డౌన్‌ అమలుచేస్తే పరిస్థితి ఏంటనే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది కూలీలు, కార్మికులు మళ్లీ సొంతూళ్ల బాట పట్టారు. ఉపాధి కోసం నగరానికి రావాలనుకున్న వాళ్లు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాకే నగరానికి రావాలని భావిస్తున్నారు.

కాగా డిసెంబర్, జనవరి మాసాల్లో కరోనా కాస్తా తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాల్లో కూలీలు, కార్మికులు ఉపాధి కోసం ముంబై నగరానికి వచ్చారు. అయితే, ఫిబ్రవరి చివరి వారం నుంచి కరోనా మళ్లీ విజృంభించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ఆంక్షలు విధించింది. అయినప్పటికీ కరోనా వైరస్‌ నియంత్రణలోకి రాకపోవడంతో మరింత కఠినంగా వ్యవహరించింది. రాత్రి పూట కర్ఫ్యూ, 144 సెక్షన్‌ అమలు చేసింది.

కరోనా వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? ఇతర మందులు వాడేవారు తీసుకోవచ్చా, తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది, డాక్టర్లు ఏమంటున్నారు ఓ సారి తెలుసుకోండి

రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజల్లో మార్పు రావాలని, లేని పక్షంలో మరోసారి లాక్‌డౌన్‌ విధించక తప్పదని ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తోంది. దీంతో లాక్‌డౌన్‌ విధిస్తే తమకు ఉపాధి లభించకపోవచ్చని ముందుగానే గ్రహించిన అనేక మంది పేదలు, కూలీలు, కార్మికులు, అసంఘటిత రంగాల్లో పనిచేసే వారు స్వగ్రామాలకు వెళ్లిపోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఒకవేళ మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ముంబైలోనే చిక్కుకుంటామని వారిలో భయం నాటుకుపోయింది. దీంతో చాలామంది స్వగ్రామాలకు పయనం అవుతున్నారు. పెట్టే బేడ, పిల్లా పాపలతో దొరికిన వాహనంలో బయలుదేరుతున్నారు.

ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు, హైవేలపై ట్రక్కులు, టెంపోలు, ప్రైవేటు టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ బస్సులు అన్నీ స్వగ్రామాలకు వెళ్లే కూలీలు, కార్మికులతో నిండిపోతున్నాయి. కొందరైతే ఎలాగైనా ఇంటికి వెళ్లాలన్న తపనతో వాహనాల వారు అడిగినంత చార్జీలు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా కొందరు చార్జీలు కూడా భారీగా పెంచారు.

భయంకర నిజాలు వెలుగులోకి, రాత్రి పూట పనిచేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం, శరీర కణాలు తొందరగా దెబ్బతింటాయట, వాషింగ్టన్‌ యూనివర్సీటీ పరిశోధనల్లో కొత్త నిజాలు

ఏప్రిల్‌లో కరోనా కేసుల సంఖ్య లెక్కకు మించి పెరగనున్నదని నిపుణులు అంటున్నారు. ఈనెల మధ్యనాటికల్లా కరోనా సెకెండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కేసుల సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. మరోవైపు దేశంలోని 11 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య అధికారులతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

మార్చిలో కరోనా వ్యాప్తి రేటు 6.8 శాతంగా ఉందని, గత ఏడాది ఇదే సమయంలో ఇది 5.5 శాతంగా ఉందని రాజీవ్ గౌబా తెలిపారు. కరోనా తీవ్రత దేశంలోని మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, కేరళ, ఛత్తీస్‌గడ్, చండీగఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, హరియాణా తదితర ప్రాంతాలలో అధికంగా ఉంది. కాగా శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఏప్రిల్‌లో కరోనా పీక్ స్టేజ్‌కు చేరుకుని మే చివరి నాటికి తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి.