Covid in India: దేశంలో మళ్లీ కరోనా మృత్యుఘోష, నిన్న ఒక్కరోజే 714 మంది మృతి, తాజాగా 89,129 మందికి కరోనా పాజిటివ్, కేసులు పెరిగినా లాక్‌డౌన్‌ విధించేది లేదని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వాలు
2020 Coronavirus Pandemic in India (photo-Ians)

New Delhi, April 3: దేశంలో గ‌త 24 గంటల్లో 89,129 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న‌ 44,202 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కు (Covid in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 714 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,64,110కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,15,69,241 మంది కోలుకున్నారు. 6,58,909 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 7,30,54,295 మందికి వ్యాక్సిన్లు వేశారు.

ఢిల్లీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు (Delhi Coronavirus) పెరుగుతున్నప్పటికీ లాక్‌డౌన్‌ విధించేందుకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విముఖత ప్రదర్శించారు. ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచన ఏదీ లేదని ఆయన శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ప్రకటించారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని కేజ్రీవాల్‌ (CM Arvind Kejriwal) తెలిపారు. 24 గంటల్లో 3,583 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఇది కరోనా సంక్రమణలో నాలుగోదశ అని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని, వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించామని కేజ్రీవాల్‌ ప్రకటించారు.

జంతువులకు కరోనావైరస్ వ్యాక్సిన్, ప్రపంచంలో తొలిసారిగా, కార్నివాక్-కోవ్ కోవిడ్ వ్యాక్సిన్ ఉత్ప‌త్తికి రిజిస్ట‌ర్ చేసుకున్న రష్యా

45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కాకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరికీ టీకా (Coronavirus Vaccination) వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం అందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేలా రాష్ట్రప్రభుత్వాలకు అనుమతి ఇస్తే మహమ్మారిని కట్టడి చేయవచ్చని, సంక్రమణను ఆపవచ్చని కేజ్రీవాల్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

మరోవైపు ఏప్రిల్‌ 1వ తేదీన ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన వారిలో మాస్క్‌ ధరించని, సామాజిక దూరాన్ని పాటించని 529 మందికి రూ.2 వేల చొప్పున అధికారులు జరిమానా విధించారు. ఇప్పటికే రాష్ట్రంలో మాస్క్‌లు ధరించడంపై కొనసాగుతున్న జరిమానాల అంశంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. అందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ సరిగ్గా ధరించని వారికి విధిస్తున్న రూ.2వేల జరిమానాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.

ఇదిలా ఉంటే ఈ నెల రెండో వారం తర్వాత దేశంలో కరోనా వైరస్ విజృంభణ గరిష్ఠ స్థాయికి చేరుతుందని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మే చివరి వరకు అలానే కొనసాగి ఆ తర్వాత క్రమంగా తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో వైరస్ గరిష్ఠ స్థాయికి చేరుకుని ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి తగ్గిందని, ప్రస్తుతం రెండో దశలోనూ వైరస్ ఉద్ధృతి అలానే ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.

గబ్బిలాల ద్వారా కరోనావైరస్, ఎట్టకేలకు వైరస్ పుట్టుక మీద స్పందించిన చైనా, ఇంకా బయటకు రాని డ‌బ్ల్యూహెచ్‌వో రిపోర్టు, దౌత్య‌వేత్త ద్వారా నివేదికను సంపాదించిన అసోసియేటెడ్ ప్రెస్ ఏజెన్సీ

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరును చూస్తే ఈ నెల 15-20 మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్రా అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉందని, మున్ముందు ఆ సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి మహారాష్ట్ర, పంజాబ్‌లలో కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని తెలిపారు.

కాగా, హర్యానాలోని అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్ మీనన్ మాత్రం ఏప్రిల్, మే నాటికి వైరస్ విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. వైరస్ వ్యాప్తి రేటు, అది సోకే అవకాశం ఉన్న జనాభా, పాజిటివ్ కేసుల సంఖ్యను ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు ఈ అంచనాకొచ్చారు.

ఇక మహారాష్ట్రలో కేసుల పెరుగుదలతో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే తెలిపారు. అయితే, ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ ప్రకటన చేయడం లేదన్నారు. లాక్‌డౌన్‌కు ప్రత్యామ్నాయం లభించకపోతే రానున్న రెండు మూడు రోజుల్లో కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. మహారాష్ట్రను కరోనావైరస్ హడలెత్తిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతం లాక్‌డౌన్‌ మినహా ప్రత్యామ్నాయం కనిపించడం లేదన్నారు.

కరోనావైరస్ ల్యాబ్ నుండే లీక్, జంతువుల నుండి కాదు, సంచలన విషయాన్ని వెల్లడించిన నార్వేజియన్ వైరాలజిస్ట్, ఆగస్టు లేదా సెప్టెంబర్ 2019‌లో ప్రమాదవశాత్తు ల్యాబ్ నుండి లీకయిందని వెల్లడి

ఏదైనా మార్గం ఉంటే సూచించాలని ప్రజలను కోరారు. తాను కూడా నిపుణులతో దీనిపై చర్చిస్తున్నానని తెలిపారు. ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. రాజకీయ పార్టీలు ఈ విషయంపై రాద్ధాంతం చేయకుండా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరించాలని ఉద్ధవ్‌ ఠాక్రే విన్నవించారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఠాక్రే పేర్కొన్నారు.

దేశంలో ఇతర రాష్ట్రాల కంటే అధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని గుర్తుచేశారు. ఆసుపత్రుల సంఖ్య, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని తాము కోరుకోవడం లేదన్నారు. నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.