New Delhi/Beijing, March 29: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనవైరస్ జాడటు బయటపడి ఏడాదైనప్పటికీ దాని పుట్టుక (Coronavirus Origin) మీద ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. కోవిడ్ పుట్టుకపై డబ్ల్యూహెచ్‌వో అధ్యయనం జరిపినా ఇంకా ఆ నివేదికను బహిర్గత పరచలేదు. అయితే డబ్ల్యూహెచ్‌వో రిపోర్టు బయటకు రాకుండానే చైనా ఈ వైరస్ పుట్టుక మీద స్పందించింది. గబ్బిలాలు, శీతలీకరించిన ఆహారం ద్వారానే వైరస్ వ్యాప్తి జరిగి ఉంటుందని తెలిపింది. ఇది వుహాన్ ల్యాబ్ (Wuhan Lab) నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా తమ దర్యాప్తులో ఇదే విషయాన్ని వెల్లడించిందని చైనా తెలిపింది.
కరోనా మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికను జెనీవాలో ఉన్న ఓ దౌత్యవేత్త ద్వారా ప్రముఖ ఏజెన్సీ అసోసియేటెడ్ ఏజెన్సీ సంపాదించింది. కాగా దీనిని డబ్ల్యూహెచ్‌వో అధికారికంగా రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే అంతకు ముందే ఇందులో ఏమైనా మార్పులు చేస్తారా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.ఇందులో చాలా ప్రశ్నలకు అసలు సమాధానాలే లేవు. ఇప్పుడు కూడా ల్యాబ్ లీక్ అంశాన్ని వదిలేసి మిగతా అంశాలపై మరింత విచారణ జరపాల్సిన అవసరం ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో, చైనా సంయుక్త నివేదిక చెప్పడం గమనార్హం.
కాగా గత జనవరిలోనే చైనాకు వెళ్లి కరోనా మూలాలను పరిశీలించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం. అయితే నివేదికను మాత్రం ఎప్పటికప్పుడు ఆలస్యం చేస్తూ వచ్చింది. ప్రపంచమంతా ఈ మహమ్మారికి చైనాను బాధ్యురాలిని చేస్తున్న నేపథ్యంలో ఈ రిపోర్టును చైనా మారుస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిజానికి కరోనా విషయంలో మొదటి నుంచీ డబ్ల్యూహెచ్‌వోది చైనా అనుకూల ధోరణిగానే ఉంది.
నిజానికి ఈ నివేదికను ఎప్పుడో విడుదల చేయాల్సి ఉండగా ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. కరోనా వ్యాప్తికి చైనానే కారణం అని ప్రపంచమంతా విశ్వసిస్తున్న నేపథ్యంలో ఈ అపవాదును తొలగించుకునేందుకు డబ్ల్యూహెచ్‌వోపై చైనా ఒత్తిడి తెస్తుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు నివేదిక బయటకు రావడంలో ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
కాగా 2019 చివర్లో చైనాలో కరోనావైరస్ కేసులు మొట్టమొదటిసారిగా చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో డబ్ల్యూహెచ్‌వో టీం చైనాలోని వుహాన్ నగరంలో పర్యటించింది. చైనా శాస్త్రవేత్తలతో (WHO-China Study) కలిసి వారు అక్కడ పరిశోధనలు చేశారు. ఈ తుది నివేదికపై రెండు పక్షాలు ఆమోదం తెలిపాల్సి ఉంది. అయితే ఎప్పుడు ఇది బయలకు వస్తుందనేది అంతుచిక్కడం లేదు.