Hyd, Nov 14: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రారంభం నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల తేడాతో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఫలితం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే కాక, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయ బలం చేకూర్చింది.
శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపు ఉదయం నుంచే కాంగ్రెస్‌కు అనుకూల సంకేతాలు కనిపించాయి. తొలి రౌండ్ నుండే నవీన్ యాదవ్ ముందంజలో దూసుకెళ్లగా, ప్రతి రౌండ్‌తో తన ఆధిక్యాన్ని క్రమంగా పెంచుకున్నారు. తుది ఫలితాల ప్రకారం నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు వచ్చాయి. కాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 74,259 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 17,061 ఓట్లు మాత్రమే పొందడంతో, డిపాజిట్ కూడా కోల్పోయారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం కేవలం ఒక ఉప ఎన్నిక గెలుపుగా కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కీలక సందేశాన్ని పంపింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఈ తొలి పెద్ద పరీక్షలో కాంగ్రెస్ గెలవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరింత రాజకీయ బలం అందించినట్లైంది. ఈ ఎన్నికలో వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవ కూడా పార్టీ విజయాన్ని ప్రభావితం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, స్వయంగా డివిజన్ స్థాయిలో పర్యటిస్తూ ప్రజలను ఒప్పించడం ఆయన శైలి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది విమర్శలకు గురైనా, రేవంత్ వెనక్కి తగ్గకుండా నేరుగా ప్రజలతో కలిసిపోవడం ఆయన ఇమేజ్‌ను మరింత పెంచింది.
ఎన్నికలకు ముందు చివరి నాలుగు రోజుల పాటు రేవంత్ రెడ్డి చేసిన విస్తృత ప్రచారం కాంగ్రెస్‌కు కీలక మలుపుగా మారింది. జూబ్లీహిల్స్ పట్టణ, మధ్యతరగతి, ఐటీ ఉద్యోగుల వర్గం, బస్తీలు—అన్ని ప్రాంతాల్లోనూ రేవంత్ ప్రచారం బలంగా సాగింది. దీని ఫలితంగానే కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ వచ్చిందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు, బీఆర్ఎస్ ఈ ఎన్నికలో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోవడం ఆ పార్టీకి పెద్ద నష్టంగా నిలిచింది. గతంలో బలమైన పట్టు ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు కాంగ్రెస్ అలవాటు పడిన మెజార్టీతో దూసుకెళ్లడం గులాబీ శ్రేణుల్లో ఆందోళన కలిగించే అంశంగా మారింది.