Covid in India: వచ్చే నాలుగు వారాల్లో వైరస్ ప్రమాదకరంగా మారే అవకాశం, ఆందోళన వ్యక్తం చేసిన నిపుణులు, దేశంలో తాజాగా 1,15,736 మందికి కరోనా, పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి

ఒకే రోజు 630 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు (Covid in India) చేరింది.

COVID-19 Outbreak in India | File Photo

New Delhi, April 7: దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 1,15,736 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. ఒకే రోజు 630 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు (Covid in India) చేరింది. కొత్తగా 59,856 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 1,17,92,135 మంది కోలుకున్నారు. వైరస్‌ ప్రభావంతో ఇప్పటి వరకు 1,66,177 మృతి (Covid Deaths) చెందారు. ప్రస్తుతం దేశంలో 8,43,473 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.

గతంతో పోలిస్తే వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలక సమయమని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ నిబంధనలు పాటించాలని హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం నీతిఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వీకే పాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతిని (సెకండ్‌ వేవ్‌ను) అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని తెలిపారు. దేశంలో అన్ని వయసుల వారికి వ్యాక్సిన్‌ వేయాలన్న డిమాండ్‌లపై పాల్‌ స్పందించారు. వైరస్‌ ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికే తొలుత టీకాను ఇస్తామన్నారు. వ్యాక్సిన్‌ వేసుకోవాలనుకుంటున్నవారికంటే, టీకా అవసరమైన వారికే తమ ప్రాధాన్యత ఉంటుందన్నారు.

మనుషుల నుంచి జంతువులకు కరోనా, పెంపుడు జంతువుల‌కు దూరంగా ఉండ‌టం మంచిదని తెలిపిన డ‌బ్ల్యూహెచ్‌వో, ఇత‌ర జంతువుల‌పై వైర‌స్ ప్ర‌భావం గురించి అధ్యయనం

మరో వైపు టీకా డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 8,70,77,474 డోసులు వేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా కొవిడ్‌ పరీక్షలు భారీగానే సాగుతున్నాయి. నిన్న ఒకే రోజు 12,08,329 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ చెప్పింది. ఇప్పటి వరకు 25.14కోట్ల నమూనాలను టెస్ట్‌ చేసినట్లు వివరించింది.

ఇదిలా ఉంటే గడచిన 48 గంటల వ్యవధిలో యాక్టివ్ కేసుల సంఖ్య 7 లక్షల నుంచి 8 లక్షలకు పెరిగాయి. కరోనా మహమ్మారి ఇండియాలోకి ప్రవేశించిన తరువాత రెండు రోజుల వ్యవధిలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు పైగా పెరగడం ఇదే తొలిసారి. గత సంవత్సరంలో రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువైన వేళ, మూడు రోజుల వ్యవధిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య లక్ష పెరిగింది.

వణికిస్తున్న కరోనా ఫోర్త్ వేవ్, నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి, కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం, గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 3548 కరోనా కేసులు నమోదు

పంజాబ్‌లో 80శాతం కొవిడ్‌-19 కేసుల్లో యూకే వైరస్‌ వేరియంటేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. కరోనా పరిస్థితిపై మంగళవారం ఆయన 11 రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాజాగా వైరస్ వ్యాప్తికి కారణాలు వివాహ వేడుకలు, స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు నిరసనలేనన్నారు. ఈ మేరకు వైరస్‌ జన్యు శ్రేణిని గుర్తించినట్లు పేర్కొన్నారు.

కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో కొవిడ్‌ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. పాజిటివ్‌ రేటు పది రెట్లు పెరిగిందని చెప్పారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌కు కేంద్రం 50 కేంద్ర బృందాలను పంపిందని తెలిపారు. బృందాలు మూడు నుంచి ఐదు రోజులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తాయని చెప్పారు.

తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని 20 నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నగరాల్లో సాయంత్రం 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. ఇది నేటి నుంచి ఏప్రిల్‌ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఇప్పటికే అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కొత్తగా జామ్‌నగర్‌, భావ్‌నగర్‌, జునాగఢ్‌, గాంధీనగర్‌, ఆనంద్ నదియద్‌, మెహసానా, మోర్బీ, దహోద్‌, పఠాన్‌, గోద్రా, భుజ్‌, గాంధీదామ్‌, భరూచ్‌, సురేంద్రనగర్‌, అమ్రేలీ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించింది.

అదేవిధంగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల సభలు, సమావేశాలను ఈ నెలాఖరు వరకు నిషేధించింది. దీంతోపాటు వివాహాలకు హాజరయ్యే అతిథులపై ఆంక్షలు విధించింది. వివాహం వంటి శుభకార్యాలకు 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నది. రాష్ట్రంలో నిన్న 3280 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,24,878కు చేరింది. ఇందులో 4598 మంది మరణించారు.