Geneva [Switzerland], April 6: ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాపై సంచలన విషయాలను వెల్లడించింది. మనుషుల నుంచి కరోనా వైరస్ పిల్లులు, కుక్కలు, సింహాలు, పులులకు సోకుతున్నట్లు (Corona Transmission) డబ్ల్యూహెచ్‌వో ధృవీకరించింది. కొవిడ్-19 అనేది ప్రధానంగా మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది. అయితే ఇది జూనోటిక్ వైరస్ కనుక మనుషుల నుంచి జంతువులకు కూడా కొవిడ్ (COVID-19 transmission) సోకుతున్నట్లుగా ఆధారాలు ఉన్నాయని రష్యాకు చెందిన డబ్ల్యూహెచ్‌వో (WHO) ప్రతినిధి మెలీటా వుజ్నోవిక్ చెప్పారు.
మింక్స్, కుక్కలు, పిల్లులు, సింహాలు, పులులు, రకూన్ కుక్కల వంటివి వైరస్ సోకిన మనుషులకు సన్నిహితంగా ఉంటే అవి కూడా కరోనా బారిన పడినట్లు తేలింది. ఇతర జంతువులపై వైరస్ ప్రభావం ఎలా ఉందన్నదానిపై అధ్యయనం జరుగుతోందని మెలీటా తెలిపారు. వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న జంతువులను గుర్తించడం ద్వారా ఇతర జంతువులకు వైరస్ సోకే అవకాశాలను ముందుగానే తెలుసుకొని దానికి అడ్డుకట్ట వేయవచ్చని మెలీటా చెప్పారు.
కరోనా సోకిన వ్యక్తులు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. వైరస్ మనుషుల నుంచి జంతువులకు, అక్కడి నుంచి మనుషులకు సోకడం ద్వారా వైరస్‌లో జన్యుపరమైన మార్పులు చోటు చేసుకొని తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చని ఆమె అన్నారు.