Pakistan Abductions: పాకిస్థాన్‌లో హిందూ యువతిపై దారుణం, వధువును పెళ్లి మండపంలోంచి నుంచి ఎత్తుకెళ్లి మతమార్పిడి, ఆపై ముస్లిం వ్యక్తితో పెళ్లి, పాక్ ప్రభుత్వానికి సమన్లు జారీ చేసిన భారత్
పాకిస్థాన్ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందూ సమాజాన్ని రక్షించి, తమ పౌరులుగా వారికి కూడా భద్రత, సంక్షేమం కల్పించడం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ బాధ్యత అని భారత ప్రభుత్వం పేర్కొంది....
New Delhi, January 28: పాకిస్థాన్ (Pakistan) లో హిందూ యువతుల (Hindu Girls)పై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఒక హిందూ యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్, పాకిస్థాన్ హైకమిషన్ (Pakistan Diplomat) కు సమన్లు జారీచేసింది. బాధితులకు న్యాయం చేయాలని కోరింది.
వివరాల్లోకి వెళ్తే, జనవరి 26న పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్ (Sindh Province) లోని హాలా నగరంలో హిందూ వివాహ వేడుక జరుగుతుండగా కొంత మంది దుండగులు లోపలికి చొరబడి పెళ్లి కూతురును అపహరించుకుపోయారు. భారతీబాయి అనే పేరుగల ఆ 24 ఏళ్ల యువతిని అనంతరం బలవంతంగా ముస్లిం మతంలోకి మార్పిడి చేసి, కరాచీ నగరంలో బలవంతంగా షారుఖ్ గుల్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. ఈ పెళ్లికి స్థానిక పోలీసులే పెళ్లి పెద్దలయ్యారు. దీంతో అక్కడే హిందూ పంచాయితీని ఆశ్రయించిన వధువు తల్లిదండ్రులు వారి సాయంతో కోర్టులో కేసు వేయగలిగారు. దీనిపై విచారణ కొనసాగుతుంది.
ఈ ఘటనకు వారం రోజుల క్రితం కూడా 15 ఏళ్ల మరో హిందూ మైనర్ యువతి ఇదే తరహాలో కిడ్నాప్ (Abduction) కు గురైంది. ఆ టీనేజర్ ను కూడా మత మార్పిడి చేశారు. ఈ బాలిక విషయంలో పూర్తి వివరాలు బయటకు వెల్లడికాలేదు.
జనవరి 04న ఒక గ్యాంగ్ మిర్పూర్ లోని సిక్కు మతగురువు యొక్క 25 ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేసి, ఆమెను కూడా బలవంతంగా మత మార్పిడి చేయించి, గులాం ముస్తాఫా అనే వ్యక్తితో పెళ్లి చేయించారు.
హిందూ, ముస్లిమేతర యువతులే లక్ష్యంగా పాకిస్థాన్ లో ఇలాంటి దారుణాలు వరుసగా జరుగుతుండటం పట్ల భారత ప్రభుత్వం పాకిస్థాన్ హైకమిషన్ సీనియర్ అధికారిని గట్టిగా నిలదీసింది. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ, వీటిని అత్యవసర కేసులుగా పరిగణించి బాధితులకు న్యాయం చేయాలని పాకిస్థాన్ హైకమిషన్ కు సమన్లు జారీచేసింది. పాకిస్థాన్‌ను ఓడించేందుకు భారత ఆర్మీకి 10 రోజులు పట్టదు, ప్రధాని మోదీ వార్నింగ్
పాకిస్థాన్ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందూ సమాజాన్ని రక్షించి, తమ పౌరులుగా వారికి కూడా భద్రత, సంక్షేమం కల్పించడం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ బాధ్యత అని భారత ప్రభుత్వం పేర్కొంది.