New Delhi, January 28: ఒక "చారిత్రక అన్యాయాన్ని" సరిదిద్దడానికే తమ ప్రభుత్వం పౌరసత్వం (సవరణ) చట్టాన్ని (Citizenship Amendment Act) తీసుకువచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. పొరుగున ముస్లిం ప్రాబల్యం బలంగా ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ దేశాలలో మైనారిటీలుగా ఉన్న ముస్లిమేతరులు, హింసకు గురికాబడి శరణార్థులుగా భారతదేశానికి వలస వచ్చారు. వారికి ఇక్కడ పౌరసత్వం ఇస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చామని ప్రధాని తెలిపారు. దీనివల్ల భారతీయులకు ఎలాంటి నష్టం కలగదని ఆయన భరోసా ఇచ్చారు.
మంగళవారం దిల్లీలో జరిగిన నేషనల్ కేడెట్ కార్ప్స్ (NCC) ర్యాలీ 2020లో ప్రసంగించిన ప్రధాని, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలపై, నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్షాల నిరసనలు కేవలం ఓటుబ్యాంక్ రాజకీయాల ద్వారా ప్రేరేపించబడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు.
"ఇక్కడ కొందరు మైనారిటీల గొంతుకగా చెప్పుకుంటున్న వారే, పాకిస్తాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న దారుణాలపై మాత్రం నోరు మెదపడం లేదు. ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రతిష్ఠ మసకబారిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే నేను పనిచేసేది నా ప్రతిష్ఠ కోసం కాదు, భారతదేశ ప్రతిష్ఠ కోసం" అని మోదీ వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని నిరసనలైనా చేసుకోండి, పౌరసత్వ సవరణ చట్టంపై వెనకడుగు వేసేదే లేదు
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాశ్మీర్ సమస్య అలాగే ఉండిపోయింది, కొన్ని కుటుంబాలు, రాజకీయ పార్టీలు ఆ సమస్యను పట్టించుకోకపోవడం వల్లే జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగిపోయిందని మోదీ అన్నారు.
"భారత్‌కు పశ్చిమాన ఉన్న పొరుగుదేశం ఇప్పటికే 3 సార్లు భారత్‌తో యుద్ధంలో ఓడిపోయింది. భారత ఆర్మీకి 10- 12 రోజులు పట్టదు వారిని నాశనం చేయడానికి, అయినా గానీ ఆ దేశం దొడ్డి దారిలో నిరంతరం భారత్‌పై యుద్ధం చేస్తూ అమాయక ప్రజలను, భారత జవాన్లను బలి తీసుకుంటుంది" అంటూ పాకిస్థాన్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం భారత ఆర్మీ సంసిద్ధత వ్యక్తం చేసినా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు.
అయితే దశాబ్దాలుగా దేశాన్ని వెంటాడుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందని మోదీ స్పష్టంచేశారు. కాశ్మీర్ అంశంతో పాటు బోడో శాంతి ఒప్పందం, పాకిస్తాన్‌లో ఉన్న కర్తార్‌పూర్ గురుద్వారా ప్రారంభం, బంగ్లాదేశ్‌తో ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్, ముస్లిం మహిళల హక్కుల కోసం ట్రిపుల్ తలాక్ నిషేధం లాంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాము. ప్రతి ఒక్క భారతీయుడు మాకు విలువైన వాడే, ఇదే ఆలోచనతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.