MLA Madhavi Reddy vs Suresh Babu: నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కడప మేయర్‌కు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, రసాభాసగా మారిన కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం
ఈ సమావేశానికి ఎమ్మెల్యే మాధవి హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశానికి తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలను తీసుకొని ఎమ్మెల్యే మునిసిపల్ కార్పొరేషన్‌కు వచ్చారు.
Kadapa, Nov 7: కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రసాభాస జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మాధవి హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశానికి తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలను తీసుకొని ఎమ్మెల్యే మునిసిపల్ కార్పొరేషన్‌కు వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేను మినహా మిగతా ఎవరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు. లోపలికి వెళ్లిన వెంటనే మాధవి రెడ్డి... తన కుర్చీని ఎందుకు మార్చారంటూ నిలదీశారు. ఇన్నాళ్లు మేయర్ పక్కన కుర్చీ వేసి.. ఇప్పుడెందుకు కార్పోరేటర్ల వద్ద వేశారని ప్రశ్నించారు.
ఈ క్రమంలో మాధవిరెడ్డి, వైసీపీ పాలక వర్గ నేతల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. దీంతో టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి నిల్చొని నిరసన తెలిపారు. మరోవైపు ఆమె మాట్లాడుతుండగా మేయర్ సురేశ్, కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్‌గా మాట్లాడే అవకాశం ఉందని మాధవి పట్టుబట్టారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొంది.
మాధవీరెడ్డి మాట్లాడుతూ పాలకవర్గం తీరుపై మండిపడ్డారు. ‘‘మహిళను అవమానిస్తారా? మీరు లాగేసినా ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు. కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేదు. సమావేశమంతా నిల్చొని మాట్లాడే శక్తి నాకుంది. అహంకారం, అధికారం ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్నాం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నగరపాలక సంస్థ వద్ద పోలీసులు మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు.
Kadapa MLA Madhavi Reddy Fire on Suresh babu
కడప కార్పోరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి కుర్చీ వ్యవహారానికి సంబంధించి మేయర్ సురేష్ బాబు స్పందించారు. ఎమ్మెల్యే మాధవికి గౌరవం ఇచ్చి గతంలో మేయర్ సీటు పక్కన కూర్చోబెట్టామని.. కానీ ఆమె గౌరవాన్ని నిలుపుకోలేకపోయారన్నారు. ప్లాన్ ప్రకారమే కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే రభస చేశారని అన్నారు.గత సమావేశంలో ఒక నియంతలా వ్యవహరించడంతో కుర్చీ కింద వేసినట్లు వివరించారు. ప్రజాస్వామ్యంలో ఇలా వ్యవహరించడం ఆమె స్థాయికి తగదన్నారు.
అగౌరవపరచాలంటే లోపలికి రాకుండా నిరసన తెలపాలనుకున్నామని.. కానీ ఆమెను గౌరవించి లోపలికి రానిచ్చామని తెలిపారు. ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నామని... ఏ పార్టీ వారినైనా ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళమని చెప్పుకొచ్చారు. మీటింగ్‌లోనే సాటి మహిళా కార్పొరేటర్ మీద అవమానంగా ఎమ్మెల్యే మాట్లాడారని తెలిపారు. రాష్ట్రంలో హిట్లర్, నియంత పాలన సాగుతోందని విమర్శించారు. వందలాది మందితో సమావేశానికి రావడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎక్స్ ఆఫీషియో మెంబర్ మాత్రమేనని గుర్తించుకోవాలన్నారు. ఏపీలో ఏ ఎమ్మెల్యేకి ఇవ్వని గౌరవం ఇచ్చామని... దాన్ని మాధవి నిలుపుకోలేకపోయారని మేయర్ సురేష్ బాబు పేర్కొన్నారు.
డయాస్ పైన కుర్చీ లేకపోవడంతో నిలబడి మాట్లాడిన ఎమ్మెల్యే.. పక్కనే ఉన్న వైసీపీ మేయర్ సురేష్ బాబుపై ఫైర్ అయ్యారు. ‘‘పాలకవర్గం మీదని.. టీడీపీ ఎమ్మెల్యే మహిళనైన నన్ను అవమా నించారు. మీ అవినీతి భాగోతాన్ని మొత్తం బయటికి లాగుతాము. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని వైసీపీ మేయర్‌కు ఎమ్మెల్యే మాధవి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఆపై సమావేశాన్ని మేయర్, కార్పోరేటర్లు వాకౌట్ చేసి వెళ్లిపోయారు