Kanpur Police Encounter: డీఎస్పీతో సహా 8 మంది పోలీసులను కాల్చి చంపిన రౌడీషీటర్లు, యూపీలోని కాన్పూర్‌లో కిరాతక ఘటన, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్, రౌడీ మూకల కోసం కొనసాగుతున్న వేట
కాన్పూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ కిరాతక ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారని యూపీ ప్రభుత్వం తెలిపింది. కాన్పూర్ శివారులోని చౌబెపూర్‌లోని పోలీస్ స్టేషన్ పరిధిలోని బిక్రూ గ్రామంలో రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు పోలీసుల బృందం కాన్పూర్ వెళ్లింది.
Kanpur/UP, July 3: ఉత్తరప్రదేశ్‌లో రౌడీషీటర్లు డీఎస్పీతో పాటు 8 మంది పోలీసులను కాల్చి (Kanpur Police Encounter) చంపారు. కాన్పూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ కిరాతక ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారని యూపీ ప్రభుత్వం తెలిపింది. కాన్పూర్ శివారులోని చౌబెపూర్‌లోని పోలీస్ స్టేషన్ పరిధిలోని బిక్రూ గ్రామంలో రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు పోలీసుల బృందం కాన్పూర్ వెళ్లింది. భారత సైనికుల మధ్య అనూహ్యంగా ప్రధాని మోదీ, సరిహద్దులో ఉద్రిక్తతల సమయంలో లడఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన, ప్రధాని వెంట బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణే
పోలీసులపై రౌడీషీటర్లు అనూహ్యంగా కాల్పులకు (UP Police encounter) తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది పోలీసులు మృతి (8 UP Policemen Shot Dead) చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అదనపు డీజీపీ(శాంతి భద్రతలు), కాన్పూర్ ఎస్పీ, ఐజీ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పూర్తి వివరాల్లోకెళితే.. ఇటీవల హత్యాయత్న కేసుకు సంబంధించి రౌడీ షీటర్ వికాస్‌దూబేపై (Vikas Dubey) రాహుల్ తీవారీ అనే గ్రామస్థుడు ఫిర్యాదు చేయడంతో.. అతడిని పట్టుకునేందుకు డీఎస్పీ దేవేందర్ మిశ్రా ఆధ్వర్యంలోని 16 మంది పోలీసుల బృందం గురువారం రాత్రి బిక్రూ గ్రామానికి వెళ్లారు. పోలీసులు గ్రామానికి చేరుకోగానే అక్కడ వారి కదలికలను గుర్తించిన నేరస్థులు పోలీసులు బయటకు వెళ్లకుండా రోడ్లన్నీ దిగ్భంధించారు.
Here's ANI Tweet
పోలీసులు తమ వాహనాల నుంచి కిందకు దిగగానే నేరస్థులు తమ భవనాలపై నుంచి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. నేరస్థులు ఎత్తైన ప్రదేశం నుంచి కాల్పులు జరపడంతో డీఎస్పీ సహా ఎనిమిది పోలీసులు మరణించారు. పోలీసులపై దాడి తర్వాత దూబే మనుషులంతా అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల్లో మరో నలుగురు పోలీసులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు డీజీపీ హెచ్‌సీ అవస్థీ తెలిపారు.
యూపీలో పోలీసుల మృతి ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( CM Yogi Adityanath Condolence) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి (హోం), డీజీపీతో మాట్లాడిన ఆయన ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని కోరారు. హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కాన్పూర్ ఏడీజీ జేఎన్ సింగ్ తెలిపారు.
ఇతర జిల్లాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించామన్నారు. గాయపడిన నలుగురు పోలీసులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు. ఆరు జిల్లాలతో కూడిన కాన్పూర్ డివిజన్‌లోని అన్ని సరిహద్దులను మూసివేసినట్లు డీజీపీ తెలిపారు.
కరుడు గట్టిన రౌడీ షీటర్ వికాస్ దూబే బిక్రూ గ్రామానికి చెందిన వ్యక్తి. దే గ్రామంలో ఓ ప్రైవేటు గ్యాంగ్ ముఠాను నడుపుతున్నట్లు సమాచారం. అతడిపై హత్య, దొంగతనాలు, కిడ్నాప్‌లతో సహా 60 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2000 ఏడాదిలో తారాచంద్ ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్ సిద్ధేశ్వర్ పాండే హత్య కేసులో దూబే పేరు కూడా ఉంది. బీజేపీకి చెందిన మంత్రి సంతోష్ శుక్లా హత్యతో సహా రౌడీషీటర్ వికాస్ దూబేపై 60 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
2001లో శివలి పోలీస్ స్టేషన్‌లో సంతోష్ శుక్లాను హత్య చేసినట్లు దుబేపై ఆరోపణలు ఉన్నాయి. రాజ్‌నాథ్ సింగ్ కేబినెట్‌లో శుక్లా మంత్రిగా పనిచేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు కూడా మరణించారు. అయితే ఈ కేసులో దూబేను సెషన్ కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఇక బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన వికాస్ దూబే నగర పంచాయతీ సభ్యునిగా ఎన్నికయ్యారు.
ఈ గ్యాంగ్‌లో ఇద్దరు ఎన్‌కౌంటర్‌లో మరణించారని, మృతులను ప్రేమ్ ప్రకాశ్, అతుల్ దూబేలుగా స్థానికులు గుర్తించినట్టు తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే 47 కాట్రిడ్జిలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రౌడీ షీటర్ వికాస్ దూబే సహా తప్పించుకుపోయిన మరో ముగ్గురు క్రిమినల్స్ కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. దూబే జాడ పసిగట్టేందుకు ఎలక్ట్రానిక్ సర్విలెన్స్‌ను కూడా ఉపయోగిస్తున్నారు.