Karnataka Lockdown: కర్ణాటకకు థర్డ్ వేవ్ ముప్పు, సరిహద్దు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ కర్ఫ్యూ అమల్లోకి, ఈనెల 23 నుంచి రోజు విడిచి రోజు స్కూళ్లు తిరిగి ప్రారంభం
పాజిటివిటీ రేట్ పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్రంలో కోవిడ్ స్థితిగతులపై ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం తన నివాస కార్యాలయ కృష్ణాలో మంత్రులు, కోవిడ్ టాస్క్‌ఫోర్స్, వివిధ శాఖల సీనియర్ అధికారులతో సమావేశం జరిపారు.
Bengaluru, August 7: కర్ణాటక రాష్ట్రంలో కొద్దిరోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేట్ పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్రంలో కోవిడ్ స్థితిగతులపై ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం తన నివాస కార్యాలయ కృష్ణాలో మంత్రులు, కోవిడ్ టాస్క్‌ఫోర్స్, వివిధ శాఖల సీనియర్ అధికారులతో సమావేశం జరిపారు. మహారాష్ట్ర, కేరళ సరిహద్దు జిల్లాలో ప్రస్తుతమున్న నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ కర్ఫ్యూ (weekend curfew in border districts) కూడా అమలు చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రమంతటా నైట్ కర్ఫ్యూను రాత్రి 10 గంటలనుంచి కాకుండా 9 గంటల నుంచే అమలు చేయనున్నారు. 9, 10, 11, 12వ తరగతులను ఈనెల 23 నుంచి (Schools to reopen for classes 9 to 12 from Aug 23) రోజు విడిచి రోజు బ్యాచ్‌ల ప్రకారం నిర్వహించేందుకు అనుమతించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రారంభంపై నెలాఖరులో నిపుణుల అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. గడిచిన 24 గంటల్లో 1,62,338 కరోనా పరీక్షలను నిర్వహించగా 1,805 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. 1854మంది కోలుకున్నారు. 36 మంది మృత్యువాత పడ్డారు.
శుక్రవారం వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 29,15,317 మందికి కోవిడ్ సోకగా, 28,54,222 మంది డిశ్చార్జి అయ్యారు. 36,741 మంది కరోనాకు బలయ్యారు. 24,328 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.11 శాతం, మరణాల రేటు 1.99 శాతంగా నమోదైంది. బెంగళూరులో 441 మందికి కరోనా సోకగా, 7 మంది మరణించారు. 434 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక రాజధాని బెంగళూరుకు మూడో ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత నెలలో బాగా తగ్గిన మైక్రో కంటైన్మెంట్ జోన్లు కరోనా ఉధృతితో ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.
ప్రస్తుతం బీబీఎంపీ 80 అపార్ట్‌మెంట్లను సీజ్ చేయడంతోపాటు 777 మైక్రో కంటైన్మెంట్ జోన్లను గుర్తించింది. వీటిలో 157 ప్రాంతాల్లో ఇంకా కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహదేవపురంలో 162 మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఉండగా, 42 జోన్లలో మరింత ఎక్కువ కేసులు ఉన్నాయి. బొమ్మనహళ్లి విభాగంలో 31, బెంగళూరు దక్షిణంలో 16, యలహంకలో 17, ఆర్.ఆర్.నగర విభాగంలో 10, బెంగళూరు పశ్చిమలో 5, దాసరహళ్లి పరిధిలో 2 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. బొమ్మనహళ్లిలో డెల్టా వైరస్ వేరియంట్‌ను గుర్తించినట్లు బీబీఎంపీ అధికారికంగా ధ్రువీకరించింది.