Krishnam Raju Political Journey: ఓటమితో మొదలై కేంద్రమంత్రి వరకు ఎదిగిన రెబల్ స్టార్, ఇంట్రెస్టింగ్‌గా సాగిన కృష్ణంరాజు పొలిటికల్ జర్నీ, నరసాపురం నుంచి రాజకీయ ప్రస్థానం, కేంద్రంలో కీలక శాఖలు నిర్వహించిన దిట్ట
ప్రస్తుతం ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. తాజాగా ఆయన అనారోగ్యంతో చికిత్సపొందుతూ కన్నుమూయడంతో సినీ, రాజకీయ పార్టీల ప్రముఖులు నివాళులర్పిస్తూ, కృష్ణంరాజుతో వారికి ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకుంటున్నారు.
Hyderabad, SEP 11: టాలీవుడ్‌లో రెబల్ స్టార్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నఉప్పలపాటి కృష్ణంరాజు (Krishnam raju) రాజకీయాల్లోనూ (Political journey) విలక్షణ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ.. బీజేపీలో (BJP) ఆయనకు గుర్తింపు లభించింది. వాజ్ పేయి (Vajpeyee) ప్రధానిగా ఉన్న సమయంలో కృష్ణంరాజు కేంద్ర మంత్రిగానూ (Central minister) పనిచేశారు. 1990 నుంచి కాంగ్రెస్ పార్టీతో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం బీజేపీ, ప్రజారాజ్యం (Prajarajyam) పార్టీలోనూ కొనసాగింది. ఏ పార్టీలో ఉన్నప్పటికీ కృష్ణంరాజు అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వివాదాలకు దూరంగా తన పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారంకోసం తనవంతుగా ఉప్పలపాటి కృష్ణంరాజు కృషి చేశాడు. కృష్ణంరాజు 1990లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1991లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నరసాపురం (Narsapuram) లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. అయితే తొలిసారే ఓటమిని రుచిచూశాడు. తన ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు చేతిలో కృష్ణంరాజు ఓడిపోయాడు. అప్పటి నుంచి కొద్దికాలం రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు.
అయితే బీజేపీ ఆహ్వానం మేరకు 1998 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా కృష్ణంరాజు బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి తోట గోపాలకృష్ణ పై భారీ ఆధిక్యంతో విజయం సాధించి లోక్ సభలో అడుగుపెట్టారు. 1998 నుంచి 1999 వరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన కన్సలెటివ్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. అయితే, ఏడాదిలోనే మధ్యంతర ఎన్నికలు రావడంతో 1999 సంవత్సరంలో నరసాపురం నుంచి కృష్ణంరాజు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కేంద్రంలోనూ ప్రధానిగా వాజ్‌పేయి ప్రధానిగా ఎన్డీయే అధికారంలో ఉండటంతో కృష్ణంరాజుకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. 2000 నుంచి 2004 వరకు ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ప్రజలకు సేవలందించాడు. తొలుత కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, రక్షణ శాఖ సహాయ మంత్రిగా, వినియోగదారుల వ్యవహరాలు, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా, కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.
2004లో తిరిగి నరసాపురం లోక్ సభ నుంచి ఏంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యాడు. 2009లో మెగాస్టార్ ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణంరాజు రాజమండ్రి లోక్ సభ నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆ ఎన్నికలో ఓడిపోవటం, ఆ తరువాత పరిణామాలతో కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం కావటంతో కొంతకాలం కృష్ణంరాజు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
అయితే, 2013 సంవత్సరంలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో మళ్లీ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. తాజాగా ఆయన అనారోగ్యంతో చికిత్సపొందుతూ కన్నుమూయడంతో సినీ, రాజకీయ పార్టీల ప్రముఖులు నివాళులర్పిస్తూ, కృష్ణంరాజుతో వారికి ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకుంటున్నారు.