Lakhimpur Kheri Violence: యూపీ ఆందోళనలో రైతన్నలపై దూసుకెళ్లిన కారు, నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మృతి, నిరసన తెలిపేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీ అరెస్ట్, కేంద్ర మంత్రి కుమారుడిపై మర్డర్ కేసు నమోదు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లాలో రైతుల ఆందోళన హింసాత్మకంగా (Lakhimpur Kheri Violence) మారింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై కేంద్రమంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు.
New Delhi, October 4: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లాలో రైతుల ఆందోళన హింసాత్మకంగా (Lakhimpur Kheri Violence) మారింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై కేంద్రమంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సోమవారం ఉదయం ప్రియాంక గాంధీ వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను పోలీసులు అరెస్ట్ (Priyanka Gandhi Vadra Arrested) చేశారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో పోలీసులపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడిచేందుకు వెళ్తున్నానని ఆమె పేర్కొన్నారు. తాము ఎలాంటి నేరం చేయలేదు.. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తనకు లీగల్ ఆర్డర్ ఇచ్చి అడ్డుకోవాలన్నారు.
ఒక వేళ తనను బలవంతంగా పోలీసు కారులో ఎక్కిస్తే.. మీపై కిడ్నాప్ కేసు పెడుతానని హెచ్చరించారు. ఇది రైతుల దేశం.. బీజేపీది కాదు. రైతులకు జీవించే హక్కు లేదా? రాజకీయాలతో రైతులను అణచివేస్తారా? అని ప్రశ్నించారు. గత కొన్ని నెలలుగా రైతులు తమ గళాన్ని వినిపిస్తున్నారు. రైతుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రియాంక గాంధీ కోపోద్రిక్తులయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరీ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా (Union Minister Ajay Mishra) కుమారుడి ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదైంది. ఆశిష్ మిశ్రాతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడిపై రైతులు లఖింపురి ఖీరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లడంతో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ ఘటనను కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్షాలు ఖండించాయి. అయితే ఈ ఘటనతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పేర్కొన్నారు. కొంతమంది ఆందోళనకారులు కత్తులు, కర్రలతో దాడి చేశారని, ఆ సమయంలో అక్కడ తన కుమారుడు ఉండి ఉంటే సజీవంగా వచ్చేవాడు కాదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఘటనపై కేంద్ర మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా స్పందిస్తూ.. ‘‘రైతుల రాళ్ల దాడితో కారు బోల్తా పడింది. కారు కింద పడి ఇద్దరు చనిపోయారు. ప్రమాదం తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడి జరిగిన తర్వాత మా కార్లకు నిప్పు పెట్టారు. ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్‌ను కొందరు కొట్టి చంపారు. ఘటనా స్థలంలో నా కుమారుడు లేడని అన్నారు.
లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లా టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య (Deputy Chief Minister Keshav Maurya) ఆదివారం హాజరయ్యారు. వీరి పర్యటనను నిరసిస్తూ ఉదయం నుంచి రైతులు నల్ల జెండాలు చూపిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అదే సమయంలో కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపై దూసుకెళ్లింది.
ఈ ఘటనలో నలుగురు రైతులు, వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతం ఉద్రిక్తతంగా మారింది. ఆగ్రహంతో మూడు వాహనాలను రైతులు తగలబెట్టారు. రైతులపై కాన్వాయ్ దూసుకెళ్లడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయత్ (Rakesh Tikait ) ఖండించారు. నేడు దేశవ్యాప్తంగా రైతులు సంఘాలు ఆందోళనలకు పిలుపినిచ్చాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)