New Farm Laws: కొత్త చట్టాలు మీరు నిలిపివేస్తారా..మమ్మల్ని నిలిపివేయమంటారా ? కేంద్రంపై అసహనం వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం, రైతుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చురక
Supreme Court | (Photo Credits: PTI)

New Delhi, January 11: రైతుల ఆందోళ‌న విష‌యంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. మూడు వ్యవసాయ చట్టాలు (New Farm Laws), రైతుల ఆందోళనపై దాఖలైన పిటీషన్‌పై విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల అమ‌లును మీరు నిలిపేస్తారా లేక మ‌మ్మ‌ల్ని ఆ ప‌ని చేయ‌మంటారా అంటూ ప్ర‌శ్నించింది. కొంతకాలం చట్టాల అమలును నిలిపి వేయాలని లేదంటే తామే స్టే విధిస్తామని అత్యున్న‌త న్యాయ‌స్థానం తెగేసి చెప్పింది.

ఈ చట్టాల పరిశీలనకు గాను ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే రైతులు తమ నిరసనను కొనసాగించుకోవచ్చని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టాల పై స్టే ఇచ్చిన తర్వాత ఆందోళన నిలిపి వేస్తారా ? అని సుప్రీం రైతు సంఘాల ఉద్యమ నేతలను ప్రశ్నించింది. తదుపరి వాదనలను రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మక సమస్యగా ఎందుకు చూస్తోందని ప్రశ్నించిన సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా కేంద్ర వైఖరిపై అసంతృప్తితో ఉన్నామన్నారు.

మేము ఏవో విచ్చ‌ల‌విడి వ్యాఖ్య‌లు చేయ‌ద‌ల‌చుకోలేదు కానీ కేంద్ర ప్ర‌భుత్వంపై చాలా అసంతృప్తిగా ఉంది. ఏం సంప్ర‌దింపుల ప్ర‌క్రియ కొన‌సాగుతుందో మాకు తెలియ‌దు. అస‌లు ఏం జ‌రుగుతోందో ద‌య‌చేసి చెబుతారా అంటూ బోబ్డే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ స‌మ‌స్య‌కు స్నేహ‌పూర్వ‌క ప‌రిష్కారం చూపాల‌న్న‌దే మా ఉద్దేశం. కానీ ఈ చ‌ట్టాల అమ‌లు నిలిపివేత‌పై ఎందుకు మాట్లాడ‌టం లేదు. ఒక‌వేళ కేంద్రం చ‌ట్టాల అమ‌లు నిలిపివేస్తే రైతుల‌ను చ‌ర్చ‌ల‌కు రావాల్సిందిగా మేము చెబుతాం. మీరైనా ఆ ప‌ని చేయండి లేదంటే కోర్టే చేస్తుంది అని బోబ్డే (CJI SA Bobde) స్ప‌ష్టం చేశారు.

మరో రైతు బలవన్మరణం, బీజేపీ నేతలకు లీగల్ నోటీసులు పంపిన పంజాబ్ రైతులు, డిమాండ్లు తీర్చకపోతే 26వ తేదీన ట్రాక్టర్లతో పెరేడ్‌ నిర్వహిస్తామని తెలిపిన రైతు సంఘాలు, జనవరి 4న మరోసారి కేంద్రంతో చర్చలు

ఇప్ప‌టికే ఎన్నో ఆత్మ‌హ‌త్య‌లు, మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని, పిల్లలు, మ‌హిళ‌ల‌ను ర‌క్షించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. రైతులు ఆందోళ‌న నిర్వ‌హించే స్థ‌లాన్ని మ‌రో చోటికి మార్చాల‌ని కోర్టు ప్ర‌తిపాదించింది. వీటన్నింటికీ ప్రభుత‍్వమే బాధ్యత వహించాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అంతేకాదు అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతోందని కూడా ప్రశ్నించింది. ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరమూ బాధ్యత వహించాలి. మ ఇకపై ఎవరి రక్తంతోనూ మన చేతులు తడవకూడదని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాల పరిశీనలకుగాను ఐసీఎఆర్‌తో సహా నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

దీనిపై వ్యతిరేక, అనుకూల వాదనలను ఈ కమిటీకి అందించుకోవచ్చని, కమిటీ నివేదిక మేరకు వ్యవహరిస్తామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు కేవలం రెండు, మూడు రాష్ట్రాలు మాత్రమే నిరసన తెలుపుతున్నాయని అటార్నీ జనరల్‌ మెహతా సుప్రీంకు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల రైతులు, ఇతర ప్రాంతాల రైతులు నిరసనల్లో పాల్గొనడం లేదన్నారు. అయితే కమిటీ వేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే చట్టాలను నిలుపుదల చేయవద్దని ఆయన కోరారు.